Tuesday, September 17, 2024

శ్రీవినాయక వ్రత కథ

- Advertisement -
- Advertisement -

వ్రతకథ చదివేవారు, పూజలో కూర్చున్నవాళ్ళు ముందు కొన్ని అక్షతలు చేతిలో ఉంచుకోవాలి. కథ పూర్తయిన తరువాత వాటిని శిరస్సుపై వేసుకోవాలి. పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు జ్ఞాతుల వలన సిరి సంపదలన్నీ పోగొట్టుకున్నాడు. భార్యతోనూ, తమ్ములతోనూ వనవాసం చేస్తూ ఒకనాడు నైమిశారణ్యాకి చేరుకున్నాడు.అక్కడ శౌనకాది బుషులకు అనేక పురాణ రహస్యాలను బోధిస్తున్న సూత మహామునిని దర్శించి, నమస్కరించి ‘బుషివర్యా! మేము రాజ్యాధికారాన్నీ,సమస్త వస్తు వాహనాలనూ పోగొట్టుకున్నాం. ఈ కష్టాలన్నీతీరి, పూర్వవైభవాన్ని పొందేలా ఏదైనా సులభమైన వ్రతాన్ని చెప్పండి‘ అని ప్రార్థించాడు. అప్పుడు సూతుడు ధర్మరాజుకు.. వినాయకవ్రతం చేస్తే కష్టాలు తొలగిపోయి, సమస్త సౌఖ్యాలు కలుగుతాయంటూ ఇలా చెప్పసాగాడు. ‘ఒకసారి కుమారస్వామి పరమశివుణ్ణి దర్శించి తండ్రీ! మానవులు ఏ వ్రతం చేయడం వలన వంశవృద్దిని పొంది, సమస్త కోరికలూ తీరి సకల శుభాలనూ విజయాలనూ, వైభవాలనూ పొందగలుగుతారో అటువంటి వ్రతాన్ని చెప్పండి అని కోరాడు.

అందుకు శివుడు’నాయనా! సర్వసంపత్కరము, ఉత్తమము, ఆయుష్కామ్యార్థ సిద్దిప్రదమూ అయిన వినాయక వ్రతమనేదొకటుంది. దీన్ని భాద్రపద శుద్ధ చవితినాడు ఆచరించాలి. ఆ రోజు ఉదయమే నిద్రలేచి స్నానం చేసి, నిత్యకర్మలు నెరవేర్చుకుని తమ శక్తి మేరకు బంగారంతోగానీ, వెండితోగానీ లేదా మట్టితోగానీ విఘ్నేశ్వరుడి బొమ్మను చేసి, తమ ఇంటికి ఉత్తర దిక్కులో బియ్యాన్ని పోసి మండపాన్ని నిర్మించి, అష్టదళ పద్మాన్ని ఏర్పరచాలి. అందులో గణేశుడి ప్రతిమని ప్రతిష్టించాలి. అనంతరం శ్వేతగంధాక్షతలు,పుష్పాలు, పత్రాలతో పూజించి, ధూపదీపాలను, వెలగ, నేరేడు మొదలైన ఫలములను రకమునకు ఇరవై ఒకటి చొప్పున నివేదించాలి.

నృత్య, గీత, వాద్య,పురాణ పఠనాదులతో పూజను ముగించి యథాశక్తి వేదవిదులైన బ్రాహ్మణులకి దక్షిణ, తాంబూలాదులు ఇవ్వాలి. బంధుజనంతో కలిసి భక్ష్య భోజ్యాదులతో భోజనం చేయాలి. మరునాడు ఉదయం స్నానసంధ్యలు పూర్తిచేసుకుని గణపతికి పునఃపూజ చేయాలి. విప్రులను దక్షిణ తాంబూలాలతో తృప్తులను చేయాలి. ఈ విధంగా ఎవరైతేవినాయక వ్రతాన్ని చేస్తారో వాళ్ళకి గణపతి ప్రసాదం వలన సకలకార్యాలూ సిద్ధిస్తాయి. అన్ని వ్రతాల్లోకీ అత్యుత్తమైన ఈ వ్రతం త్రిలోక ప్రసిద్ధమై దేవముని గంధర్వాదుల అందరిచేతా ఆచరింపబడింది’ అని పరమశివుడు కుమారస్వామికి చెప్పాడు.

కనుక ధర్మరాజా, నువ్వు కూడా ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే నీ శత్రువులను జయించి సమస్త సుఖాలనూ పొందుతావు. గతంలో విదర్భ యువరాణి దమయంతి ఈ వ్రతం చేయడం వల్లనే తాను ప్రేమించిన నలమహారాజును పెళ్లాడగలిగింది. కృష్ణుడంతటి వాడు ఈ వ్రతం చేయడం వల్లనే శమంతకమణితో బాటుగా జాంబవతీ సత్యభామలనే ఇద్దరు కన్యామణులను కూడా పొందగలిగాడు. ఆ కథ చెబుతాను విను’ అంటూ ఇలా చెప్పసాగాడు.

పూర్వం గజముఖడయిన గజాసురుడు శివుడికోసం తపస్సు చేశాడు. అతనితపస్సుకు మెచ్చి పరమశివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. గజాసురుడు ’స్వామీ నువ్వు నా ఉదరమందే నివశించాలి’ అని కోరాడు. దాంతో భక్తసులభుడైన శివుడు అతడి కుక్షియందు ఉండిపోయాడు. జగన్మాత పార్వతి భర్తను వెదుకుతూ ఆయన గజాసురుని కడుపులో ఉన్నాడని తెలుసుకుంది. ఆయన్ను దక్కించుకునే ఉపాయం కోసం శ్రీమహా విష్ణువును ప్రార్ధించింది. శ్రీహరి బ్రహ్మాది దేవతలను పిలిపించి చర్చించాడు. గజాసుర సంహారానికి గంగిరెద్దు మేళమే తగినదని నిర్ణయించారు. నందీశ్వరున్ని గంగిరెద్దుగా అలంకరించారు. బ్రహ్మాది దేవతలందరూ తలకొక వాయిద్యాన్ని ధరించారు. మహావిష్ణువు చిరుగంటలు, సన్నాయిలు ధరించాడు. గజాసుర పురానికి వెళ్ళి గంగిరెద్దును ఆడిస్తుండగా గజాసురుడు విని, వారిని పిలిపించి తన భవనం ఎదుట గంగిరెద్దును ఆడించమని కోరాడు. బ్రహ్మాదిదేవతలు రసరమ్యంగా వాద్యాలను వాయిస్తుండగా జగన్నాటక సూత్రధారియైన హరి చిత్ర విచిత్రంగా గంగిరెద్దును ఆడించాడు.

గజాసురుడు పరమానందభరితుడై ఏమి కావాలో కొరుకోండి ఇస్తాను అని అన్నాడు. అంతట శ్రీహరి గజాసురున్ని సమీపించి ’ఇది శివుని వాహనమైన నంది, శివుణ్ణి కనుగొనడానికి వచ్చింది. శివుణ్ణి అప్పగించు‘ అని కోరాడు. ఆ మాటలకు గజాసురుడు నివ్వెరపోయాడు. వచ్చినవాడు రాక్షసాంతకుడైన శ్రీహరి అని తెలుసుకున్నాడు. తనకు మరణం నిశ్చయమనుకున్నాడు. తన గర్భంలో ఉన్న పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి ’స్వామీ నా శిరస్సును త్రిలోక పూజ్యముగా చేసి, నా శరీరాన్ని నువ్వు ధరించు’ అని ప్రార్ధించాడు. తన గర్భంలో ఉన్న శివుణ్ణి తీసుకోవచ్చునని విష్ణుమూర్తికి అంగీకారం తెలియజేశాడు. అంత శ్రీహరి నందిని ప్రేరేపించగా, నంది తన కొమ్ములతో గజాసురుని ఉదరాన్ని చీల్చాడు. బ్రహ్మాది దేవతలకు వీడ్కోలు చెప్పి శ్రీహరి వైకుంఠానికి వెళ్ళగా, శివుడు నందినెక్కి కైలాసానికి వెళ్ళాడు.

వినాయకోత్పత్తి కైలాసంలో పార్వతి భర్త రాకను గురించి విని సంతోషించింది. స్వాగతం చెప్పేందుకు స్నానాలంకార ప్రయత్నంలో తనకై ఉంచిన నలుగుపిండితో పరధ్యానముగా ఒక ప్రతిమను చేసింది. అది చూడముచ్చటైన బాలుడుగా కనిపించింది. దానికి ప్రాణం పోయాలనిపించి, తన తండ్రి ద్వారా పొందిన మంత్రంతో ఆ ప్రతిమకు ప్రాణప్రతిష్ట చేసింది. ఆ దివ్యసుందరుని వాకిట్లో ఉంచి, ఎవరినీ లోనికి రానివ్వరాదని చెప్పి లోపలకు వెళ్ళింది. కాసేపటికి శివుడు వచ్చాడు. వాకిట్లో ఉన్న బాలుడు పరమశివుణ్ణి అభ్యంతర మందిరంలోనికి పోనివ్వకుండా అడ్డుకున్నాడు. తన ఇంట్లో తనకే అవరోధమా అని శివుడు కోపంతో రగిలిపోయాడు. రౌద్రంతో ఆ బాలుని శిరచ్చేదం చేసి, లోపలికి వెళ్ళాడు. శివపార్వతులు సంభాషణల మధ్య ద్వారం దగ్గరి బాలుడి గురించి మాటలు దొర్లాయి. శివుడు తాను ఆ బాలుడి శిరస్సు ఖండించినట్లు తెలిపాడు. విషయం తెలుసుకున్న పార్వతి విలపించింది. శివుడు కూడా చింతించాడు. వెంటనే తనవద్దనున్న గజాసురుని శిరస్సును ఆ బాలుడి మొండెమునకు అతికించి ఆ శిరస్సుకు శాశ్వతత్వాన్ని త్రిలోక పూజ్యతను కలిగించాడు. గణేశుడు గజాననుడై శివపార్వతుల ముద్దుల పట్టియైనాడు. ఆ తరువాత శివపార్వతులకు కుమారస్వామి జన్మించాడు.
విఘ్నేశాధిపత్యం
ఒకనాడు దేవతలు, మునులు, మానవులు, పరమేశ్వరుని సేవించి విఘ్నములకు ఒక అధిపతిని ఇమ్మని కోరారు. గజాననుడు తాను జ్యేష్టుడను గనుక ఆధిపత్యం తనకు ఇమ్మని కోరాడు. గజాననుడు మరుగుజ్జువాడు, అనర్హుడు, అసమర్థుడు కాబట్టి ఆధిపత్యం తనకే ఇవ్వాలని కుమారస్వామి తండ్రిని వేడుకున్నాడు. అందుకు శివుడు తన కుమారులనుద్దేశించి ’మీ ఇరువురిలో ఎవరు ముల్లోకములలోని పవిత్ర నదులన్నింటిలో స్నానంచేసి ముందుగా నా వద్దకు వస్తారో వారికి ఈ ఆధిపత్యం లభిస్తుందని చెప్పాడు. అంత కుమారస్వామి తన వాహనం నెమలిపై వెంటనే బయలుదేరాడు. గజాననుడు అచేతనుడయ్యాడు. మందగమనుడైన తాను తన వాహనం అయిన ఎలుకపై ముల్లోకాల్లోని నదులన్నింటిలో వేగంగా స్నానం చేసి రావడం కష్టసాధ్యమనీ తరుణోపా యం చెప్పమనీ తండ్రినివేడుకున్నాడు. వినాయకుని బుద్ది సూక్ష్మతకు మురసిపోయిన శివుడు నారాయణ మంత్రాన్నిఅనుగ్రహించాడు. నారములు అనగా జలములు, జలములన్నీ నారాయణుని ఆధీనములు. అంటే నారాయణ మంత్రం ఆధీనంలో ఉంటాయి. వినాయకుడు ఆ మంత్రం చదువుతూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణం చేయ డం ప్రారంభించాడు. ఆ మంత్రం ప్రభావం వల్ల ప్రతి తీర్థంలోనూ కుమారస్వామి కన్నా ముందే వినాయకుడు ప్రత్యక్షం కావడం ప్రారంభించాడు. ఇలా మూడుకోట్ల యాభైలక్షల నదులలో వినాయకుడే ముందుగా స్నానమాచరించడం చూసి కుమారస్వామి ఆశ్చర్యపడి కైలాసానికి వెళ్ళాడు. తండ్రి పక్కన ఉన్న గజాననున్ని చూసి, నమస్కరించి ’తండ్రీ,అన్నగారి మహిమ తెలియక ఆధిపత్యం అడిగాను, క్షమించండి. ఈ ఆధిపత్యం అన్నగారికే ఇవ్వండి’ అని ప్రార్ధించాడు.
చంద్రుని పరిహాసం
అంత పరమేశ్వరుడు భాద్రపద శుద్ధ చవితినాడు గజాననునికి విఘ్నాధిపత్యం ఇచ్చాడు. ఆనాడు సర్వదేశస్థులు విఘ్నేశ్వరునికి కుడుములు, ఉండ్రాళ్ళు మొదలైన పిండివంటలు, టెంకాయలు, తేనె, అరటిపండ్లు, పానకం, వడపప్పు మొదలైనవి సమర్పించి పూజించగా విఘ్నేశ్వరుడు సంతుష్టుడై కొన్ని భక్షించి, కొన్ని వాహనమునకిచ్చి, కొన్ని చేత ధరించి సూర్యాస్తమయ వేళకు కైలాసానికి వెళ్ళి తల్లిదండ్రులకు ప్రణామం చేయబోయాడు. ఉదరం భూమికానిన చేతులు భూమి కానవు, చేతులు భూమికానిన ఉదరం భూమి కానదు ఈ విధంగా ఇబ్బంది పడుతుండగా, శివుని శిరస్సులోఉన్న చంద్రుడు వినాయకుడి అవస్థ చూసి నవ్వాడు. రాజదృష్టి సోకిన రాళ్ళు కూడా నుగ్గవుతాయి అన్నట్లు విఘ్నదేవుని ఉదరం పగిలి లోపలున్న కుడుములన్నీఆ ప్రదేశంలో పడి వినాయకుడు మృతి చెందాడు. అది చూసి పార్వతీదేవి ఆగ్రహంతో చంద్రుని పాపాత్ముడా! నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించాడు కాబట్టి నిన్ను చూసినవారు పాపాత్ములై నీలాప నిందలు పొందుదురు గాక అని శపించింది. ఇప్పుడు ఒక కొబ్బరికాయ కొట్టి నీళ్ళు వినాయక విగ్రహంపై చల్లాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News