ముంబై: వైద్య చికిత్సలు అవసరమైన ఇతర వృద్ధులు కూడా జైళ్లలో ఉన్నందున ఎల్గార్ పరిషద్-మావోయిస్టుల సంబంధాల కేసులో అరెస్టయి ప్రభ్తుతం ఆసుపత్రిలో ఉన్న కవి-హక్కుల కార్యకర్త వరవరరావును తలోజ జైలు అధికారుల ఎదుట లొంగిపోవలసిందిగా ఆదేశాలు ఇవ్వాలని బొంబాయి హైకోర్టును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఎ) సోమవారం అర్థించింది. జస్టిస్ నితిన్ జాందార్, జస్టిస్ ఎస్‌వి కొత్వాల్ ఎదుట సోమవారం ఈ కేసు విచారణకు రాగా ఎన్‌ఐఎ ఈ మేరకు తన వాదన వినిపించింది. కాగా.. ఆరోగ్య కారణాల రీత్యా 83 ఏళ్ల వరవరరావుకు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆరు నెలల పాటు తాత్కాలిక మెఇకల్ బెయిల్‌ను హైకోర్టు మంజూరు చేసింది.
సెప్టెంబర్ 5న ఆయన బెయిల్ గడువు తీరిపోవలసి ఉంది. అయితే వివిధ వ్యాధులతో బాధపడుతున్న తనకు బెయిల్ గడువు పొడిగించాలని వరవరరావు కోర్టుకు విన్నవించుకోవడంతో ఆయన బెయిల్‌ను పలుమార్లు కోర్టు పొడిగించింది. కాగా..నానావతి ఆసుపత్రి సమర్పించిన వైద్య నివేదికలపై తమ సమాధానాన్ని దాఖలు చేయడానికి కొంత వ్యవధి కావాలని వరవరరావు తరఫు న్యాయవాది ఆనంద్ గ్రోవర్ సోమవారం కోర్టును కోరారు. దీన్ని ఎన్‌ఐఎ తరఫు న్యాయవాది తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ వరవరరావు బెయిల్‌ను జనవరి 7వ తేదీవరకు కోర్టు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.