ముంబయి: ప్రముఖ కవి, విరసం కార్యకర్త వరవర రావు(83) ఎల్గర్ పరిషద్‌మావోయిస్టు సంబంధిత కేసులో లొంగిపోయేందుకు బాంబే హైకోర్టు గడువును ఫిబ్రవరి 28 వరకు శుక్రవారం పొడగించింది. ఆ కేసులో ఆయన నిందితుడుగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిపై తాత్కాలిక బెయిల్‌పై ఉన్నారు. వాస్తవానికి ఆయన సెప్టెంబర్ 5నే లొంగిపోవలసి ఉంది. కానీ తన ఆరోగ్య పరిస్థితి కారణాలరీత్యా శాశ్వత బెయిల్‌ను కోరుతూ ఆయన మరో దరఖాస్తును పెట్టుకున్నారు. అప్పటి నుంచి ఆయనకు హైకోర్టు బెయిల్‌ను విస్తరించింది. ఆయన నవీ ముంబయిలోని తలోజా కారాగారం అధికారుల ఎదుట లొంగిపోయేందుకు ముందు అనేక సార్లు బెయిల్‌ను పొడగిస్తూ వచ్చింది. కాగా చివరి ఉత్తర్వు ప్రకారం ఆయన ఫిబ్రవరి 5కల్లా లొంగిపోవలసి ఉంది.
కాగా న్యాయమూర్తులు ఎస్‌ఎస్ షిండే, ఎన్‌ఆర్ బోర్కర్‌ల ధర్మాసనం ముందు శుక్రవారం అర్జంటుగా విచారణ జరపాల్సిందిగా కోరుతూ ఆయన తరఫు లాయర్లు బెయిల్ దరఖాస్తులు పెట్టుకున్నారు. కాగా ధర్మాసనం ఆయన లొంగిపోయేందుకు తుది గడువును ఫిబ్రవరి 28 వరకు పొడగించింది. ఇదిలా ఉండగా ఆయన బెయిల్ దరఖాస్తులు రాగల వారాల్లో విచారణకు వచ్చే అవకాశం ఉంది. పుణెలో 2017 డిసెంబర్ 31న ‘ఎల్గర్ పరిషద్’ సమావేశం జరిగింది. ఆ సమావేశానికి మావోయిస్టులు నిధులు సమకూర్చారని పుణె పోలీసులు అంటున్నారు. ఆ సమావేశంలో జరిగిన ఉద్రిక్త ప్రసంగాలు తర్వాత కోరేగావ్-భీమా యుద్ధ స్మారకం వద్ద మరునాడు హింసాత్మక ఘటనలకు తావు ఇచ్చాయంటున్నారు పోలీసులు. ఏది ఎలా ఉన్నప్పటికీ 2022 ఫిబ్రవరి 28కల్లా వరవర రావును లొంగిపోవలసిందిగా ధర్మాసనం గడువును పెంచింది.