Sunday, September 22, 2024

గద్దర్ పాటల్లో వైవిధ్యం

- Advertisement -
- Advertisement -

మలి తెలంగాణ ఉద్యమ వైతాళికుడు, మార్గదర్శి, దిక్సూచి గద్దర్. మలి తెలంగాణ ఉద్యమంలో తొలి దశలో ఆరు తూటాలకు శత్రువు చంపే ప్రయత్నం చేశాడు. ప్రజలు, డాక్టర్లు ఆయన్ని బతికించుకున్నారు. ఈ దేశంలోని ప్రజాస్వామ్యం రక్తమోడుతున్నది. ప్రజాస్వామ్యయుతంగా రక్తపాతం సృష్టించబడుతున్నది. బెల్లి లలిత యాదవ్ 16 ముక్కలై దేశానికి విస్తరించింది. తెలంగాణ స్వప్నంలో అంతర్భాగమై నిలిచింది. గద్దర్ బతికిపోయి తెలంగాణ రాష్ట్ర స్వప్నాన్ని కళ్లారా చూశారు. కళ్లెదురుగా ఓట్లతో మారుతున్న పాలక వర్గాలను, ప్రజా ప్రతినిధులను చూశాడు. తాను కూడా చట్టసభల్లో ప్రవేశించి ఓట్ల ద్వారా అధికారం సాధించవచ్చని పరిణతి దశలో నిర్ణయానికి వచ్చాడు. ఆ నిర్ణయానికి వెనుక 50 యేళ్ళ అనుభవాలు, గుణపాఠాలు, నిర్బంధాలు, అధ్యయనాలు పెనవేసుకొని ఉన్నాయి.
1985లో సోవియట్ యూనియన్ 13 దేశాలుగా విడిపోయింది. డంకెల్ ప్రతిపాదనలు, గాట్ ఒప్పందం, ఆ క్రమంలో 1990 నుండి సాగిన ప్రపంచీకరణ పరిణామంలో సమాజంలో అనేక మార్పులు జరిగాయి. ఏ పల్లెలో సమూలమైన మార్పులు అవసరమని భావించాడో అవి ఆ గ్రామాల్లో ముందుకు సాగలేదని గద్దర్ గమనించాడు. నిర్దిష్టంగా అధ్యయనం చేయటం కోసం తాను పుట్టి పెరిగిన తూప్రాన్ వెళ్ళి కొంత కాలం వుండి ప్రజలను, వారి జీవితాలను వారి నోట విని తెలుసుకున్నారు. అలా ప్రజాస్వామ్యయుతంగా తెలంగాణ రాష్ట్ర సాధన జెండా చేబూని ముందుకు నడిచాడు.అంతకు ముందు దశాబ్దాలుగా పాడిన పాటలు సృష్టించిన ప్రభంజనాన్ని తెలంగాణ సాధన వైపు మలిచారు. గద్దర్ పాటకు అనేక చారిత్రక దశలున్నాయి. వాటిని అధ్యయనం చేయడం అవసరం. ఆయన పాటలు ఇచ్చిన చైతన్యాన్ని ప్రశంసిస్తున్నారు. ఆయన పాటల్లోని సాహిత్యాన్ని, శైలీ శిల్పాన్ని, అలంకారికతను చాలా మంది పట్టించుకోలేదు. వస్తు వైవిధ్యం ఎంత అపూర్వమో చాలా మంది గమనించలేదు. ఇప్పుడా అవసరం మునుపెన్నడూ లేనంతగా ముందుకు వచ్చింది. గద్దర్ ఒక లెజెండ్‌గా, ఒక యుగకర్తగా ఎలా ఎదుగుతూ వచ్చాడో ఆ పరిశోధన తేటతెల్లం చేస్తుంది.
‘నన్ను గన్న తల్లుల్లారా! తెలంగాణ పల్లెల్లారా! నీ పాటనై వస్తున్నానమ్మో’ / ‘పోరు తెలంగాణమా! కోట్లాది ప్రాణమా!’/
‘నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లమ్మా!’/ ‘భూమిని తలకిందుల చేసి బువ్వ పంచిపెట్టినోడా!’/ ‘సిరిమల్లె చెట్టుకింద మల్లెచెట్టు లచ్చుమమ్మో!’/ ‘భారత దేశం భాగ్యసీమరా!’/ ‘దళిత పులులమ్మా!’/ ‘అమ్మా! తెలంగాణమా! ఆకలి కేకల గానమా!’/ ‘రానురో ఈ సర్కారు దవాఖానాకు’/ ‘ధరలు ఎట్ల పెరుగుతున్నాయంటే’/ ‘నీ పాద పాదాన పరిపరి దండాలు’
‘రెక్క బొక్క నొయ్యకుండ చుక్క చెమట పడకుండ బొర్ర బాగ పెంచినవుర దొరోడో!’
తాను ఏ ప్రజల జీవితాలు మారాలని విప్లవంలోకి వచ్చాడో ఆ ప్రజలు ఎలా ఉన్నారో, వారి జీవితాలు ఎంత మేరకు మారాయో తెలుసుకోడానికి తాను పుట్టి పెరిగిన మెదక్ జిల్లా తూప్రాన్ గ్రామానికి వెళ్ళి కొన్ని నెలల పాటు అక్కడే ఉండి అధ్యయనం చేశారు. ప్రజల జీవితాల్లో వచ్చిన ఆ మార్పులు తాను కొరుకున్న వాటికన్నా ప్రపంచీకరణ ద్వారా వచ్చిన మార్పులు, నగరీకరణ సంస్కృతి, రియల్ ఎస్టేట్ సంస్కృతి తెచ్చిన మార్పులు, టి.వి.,సెల్‌ఫోన్, ఇంటర్‌నెట్, రోడ్లు తెచ్చిన మార్పులు ఎక్కువైనాయని గమనించాడు. ఆవేదన చెందాడు. అలా ఆ మూడు దశాబ్దాల గ్రామీణ పరిణామాలను 37 పాటల మాలికలో విశ్లేషించారు.
గద్దర్ సైద్ధాంతిక చర్చల్లో వందలాది లేఖలు, నోట్స్ రాశారు. అవి భావజాల చర్చను, చరిత్రను, గద్దర్ ఆ ఉద్యమాలను, ఆయా రంగాలను ఎలా విస్తరింపజేయాలో చేసిన సూచనలు, కార్యక్రమాలు, అభిప్రాయాలు సైద్ధాంతిక గాఢత నిక్షిప్తం చేసుకున్న విషయం చాలా మందికి తెలియదు. వాటిని చదివితే గద్దర్ సామాజిక శాస్త్రవేత్తగా ఎంత ఎత్తుకు ఎదిగారో సమాజానికి ముందు వరుసన నడుస్తూ మార్గదర్శనం చేయాలనే కర్తవ్యం ఎలా నిర్వహిస్తున్నారో తెలుస్తుంది. వాటి లోంచి కొన్నయినా పుస్తక రూపంలో రావడం అవసరం. తనకు తీరిక దొరికినప్పుడల్లా తాత్విక సైద్ధాంతిక, సాంస్కృతిక, రాజకీయ, సామాజిక రంగాల్లో చేయాల్సిన ఉద్యమాల గురించిన విశ్లేషణను, కార్యక్రమాలను, అనుభవాలను, సహచరుల అభిప్రాయాలను కొన్ని పదుల నోట్ బుక్‌లలో 1985 నుండి అక్షర బద్ధం చేస్తూ వస్తున్నారు.
గద్దర్ విప్లవోద్యమంలో కొనసాగుతున్నప్పటికీ స్వయంగా ఆయా సమస్యలపై, దృక్పథాలపై, కార్యక్రమాలపై, పోరాట రూపాలపై, వ్యూహం ఎత్తుగడలపై తనదంటూ ప్రత్యేక అధ్యయనం చేస్తూ ప్రత్యేక అభిప్రాయాలను, అవగాహనను కలిగి వున్నారు. అయినప్పటికీ పార్టీలో క్రమ శిక్షణ కలిగిన కార్యకర్తగా కొనసాగుతూ వచ్చారు. ప్రధాన వైరుధ్యాల చర్చలో, కుల సమస్యలో, మత సమస్యలో, జాతుల సమస్యలో, స్త్రీల సమస్యలో, మైనార్టీ సమస్యలో, పేదరికం నిర్మూలన, ఉపాధి కల్పన, ఆధునిక విద్య, గ్లోబలైజేషన్, కన్జూమరిజం, భూస్వామ్య సమాజ అవగాహన, ప్రజా సంఘాల నిర్మాణం, ఇతర సంస్థలతో ఉద్యమాలతో కల్సి పని చేయాల్సిన తీరు, నాయకత్వంలో ఎవరుండాలి అనే తదితర అనేక అంశాల పట్ల గద్దర్ తనదైన సిద్ధాంత భూమికను రూపొందించుకున్నారు. వాటిని అంతర్గత చర్చలు డాక్యుమెంట్ రూపంలో భద్రపరిచారు.
అఖిల భారత పర్యటనలో గానీ, రాష్ర్టంలో గానీ, తెలంగాణ ధూంధాం కార్యక్రమాల్లో గానీ ప్రోగ్రాంలు ఇచ్చే ముందు ఒక ప్రణాళిక వేసుకునే వాళ్లం. ఏ మాట, ఏ పాట, ఏ ఆట, ఏ జోక్స్, ఏ గాయకుడు, ఎప్పుడు ఎలా ప్రదర్శించాలో ఎవరు, ఎప్పుడు ప్రసంగించాలో నిర్ణయించుకునేవారము. అలాగే గద్దర్ ఏదైనా సభలో, సదస్సులో మాట్లాడటానికి వెళితే ఆ సబ్జక్టుకు సంబంధించి రాత్రింబగళ్ళు అధ్యయనం చేసి పెద్ద రిజిష్టర్‌లో పది, ఇరవై పేజీలు నోట్స్ రాసుకొని ముఖ్యాంశాలు రికార్డు చేసి పాఠశాల విద్యార్థిలాగా వాటిని మననం చేసుకొని ఆయా సదస్సుల్లో ఏం మాట్లాడాలో నిర్ణయించుకొని బయలు దేరుతాడని చాలా మందికి తెలియదు.
అలా గద్దర్ గత 40 ఏళ్ళలో సమాజంలో వచ్చిన మార్పులను ఉద్యమ ప్రజలను ఎప్పుడు ఏ మేరకు ఎవరిని పట్టించుకుంది, ఎవరిని వదిలేసింది. ఎందుకు వదిలేసింది అనే అంశాలను సమీక్షించుకున్నారు, ఆత్మవిమర్శ చేసుకున్నారు. దున్నేవారికే భూమి అని హామీ ఇచ్చి ప్రజలను సమీకరించాము.ఈ 40 ఏళ్ళలో దున్నేవారికి భూమి అందిందా? ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయా? పాలక వర్గాల ఆధిపత్యంలోని సమాజంలో సాగే అభివృద్ధినైనా ఉద్యమించే ప్రాంత ప్రజలు విద్య, వైద్యం, ఉపాధి, ఉద్యోగం ద్వారా అందుకున్నారా? సాధారణ ప్రజల కన్నా ఉద్యమించే ప్రజలు నిరంతరం కష్టాలకు, అణచివేతకులోనై ఉన్నది కూడా పోగొట్టుకున్నారా? నేటి ఆధునిక అవకాశాల్లో దళిత, బహుజన ప్రజలు విప్లవించే క్రమంలో ఏ మేరకు అందుకున్నారు. విప్లవించని ప్రజలు అందుకున్న అవకాశాలు విప్లవించే ప్రజలు ఎందుకు అందుకోలేకపోయారు? విప్లవం విప్లవించే ప్రజలకు అలాంటి చైతన్యాన్ని పోరాట రూపాలను, కార్యక్రమాలను ఎందుకు అందించలేకపోయింది? నా తూఫ్రాన్ పల్లె ప్రజలు, దళితులు, పేదలు 40 ఏళ్ళలో ఏ మేరకు అభివృద్ధి చెందారు? అని కడుపులో కల్లోలం బడబానలం రగిలింది. తన 60వ ఏట గద్దర్ దీన్ని కొంత కాలం పల్లెలో, పల్లె ప్రజలతో కలిసి జీవించి తేల్చుకోవాలని అనుకున్నారు.అలా తూఫ్రాన్‌లో కొంత కాలం వుండి తన కన్నా వయస్సులో పెద్దవాళ్ళయిన వారి అనుభవాలను, అభిప్రాయాలను రికార్డు చేశారు…
2000- 2010లలో రాసిన పాటలు: తూఫ్రాన్‌లో వుంటూ 40 ఏళ్ళ పల్లె పరిణామాలను తులనాత్మకంగా పరిశీలించి, విశ్లేషించిన క్రమంలో తన అనుభవాలను, అభిప్రాయాలను ప్రజల జీవితాలను ప్రజల దృక్పథాన్ని తనను ప్రజలు ప్రశ్నించిన తీరును గద్దర్ 37 పాటల మాలికలో ఒక కావ్యంగా మలిచారు.
“గుర్తున్న నా బిడ్డ…
కన్న ఊరు కడుపు దేవిందా…
ఎన్నేండ్లకొచ్చావు బిడ్డ”
అంటూ తనను ప్రశ్నించిన ప్రజల ఆత్మీయతను కూడా పాటల్లో కవిత్వీకరించారు. ఇలా తాను పుట్టిన తూప్రాన్ గ్రామంలో కులాల గురించి, చెరువుల గురించి, చేతి వృత్తుల గురించి, భూమి గురించి, నీరు గురించి, తాను ఊరిలో ఏ మార్పులు రావాలని కోరుకొని ఉద్యమాల్లోకి వచ్చారో ఆ మార్పులు రాకపోవడం ఎలా జరిగిందో ఈ పాటల్లో ఆవేదన పూరితంగా చిత్రించాడు.“ముస్లింలం మేం బాబు / పొడిచే పొద్దు చిగురించే కొమ్మలు”/ “చిన్నప్పుడిట్లుండెరా నా ఊరు/ కాయలుపండే… హైవే రోడ్డు కిందరా /నా ఊరు అంతమై పోయిందిరా నా ఊరు/ సామ్రాజ్యవాదుల కింద అనిగి పోయిందిరా నా ఊరు”/ “పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా”/ “నీ పాటనై వస్తున్నా… గద్దర్ ఎన్‌కౌంటర్‌లలో మరణించిన వారి భౌతికదేహాన్ని తల్లిదండ్రులకు, ఉద్యమాలకు అప్పగించాలని ఉద్యమించారు. ఒక దశలో పాడెపై పడుకొని శవాన్ని అప్పగించే దాకా లేవనని పడుకున్నాడు. అలా పోలీసులను, రాజ్యాన్ని ఎదిరించి ఆయా అమరవీరుల శవాలను తిరిగి పోస్టుమార్టం చేయించి ఊరేగింపులు తీసి నివాళులు అర్పించారు. అది ఒక ఉద్యమ చైతన్య కార్యక్రమంగా కూడా మలిచారు.

-బి.ఎస్.రాములు
8331966987

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News