Monday, December 23, 2024

వెరికోజ్ వెయిన్స్‌కు కారణాలు తెలుసా?

- Advertisement -
- Advertisement -

మనిషి శరీరంలో రక్త ప్రసరణ సాఫీగా జరిగితే ఎలాంటి సమస్య ఉండదు. సాధారణంగా గుండె పంపింగ్ చేసే రక్తాన్ని ధమనులు శరీరం లోని అన్ని భాగాలకు చేరవేస్తాయి. ఆక్సిజన్, ఇతర పోషకాలను ఆయా భాగాలు గ్రహించుకున్న తరువాత సిరలు రక్తాన్ని తిరిగి గుండెకు తీసుకువెళ్తాయి. ఈ ప్రక్రియ సాఫీగా కొందరిలో సాగదు. కొంతమందిలో సిరల్లో సామర్ధం తగ్గటం కారణంగా తిరిగి వెనక్కి రక్తం వెళ్లకుండా ఉంటుంది. సిరల్లోని కవాటాలు బలహీనం కావటమే దీనికి కారణం. దీనివల్ల కాలిసిరలు ఉబ్బెత్తుగా కనిపిస్తాయి. కాలిపిక్కల్లోని సిరలు బాగా ఉబ్బిపోయి మెలికలు తిరిగే అనారోగ్య పరిస్థితినే వెరికోజ్ వెయిన్స్ అంటారు. సాధారణంగా ఈ సమస్య వచ్చిన వారికి కాళ్లు పాదాల లోని సిరలలో అవరోధాలు ఏర్పడి అక్కడే చెడురక్తం నిలిచిపోతుంది. అలాగే మెలికలు తిరుగుతూ ఉబ్బుతాయి.

వెరికోజ్ వెయిన్స్ అని పిలిచే ఈ పరిస్థితి వల్ల చర్మం బర్నింగ్ సెన్షేషన్ కలిగి ఉంటుంది. వెరికోజ్ వెయిన్స్ చుట్టూ చర్మం రంగులో మార్పు, దురద, నొప్పి కూర్చున్నప్పుడు , నిలబడినప్పుడు నొప్పి పెరగడం, వంటి లక్షణాలు కనిపిస్తాయి. రక్తప్రసరణ దెబ్బతినడం వల్ల మడమల నొప్పులు, వాపు, దురద, వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలా రావడానికి అనేక అంశాలు కారణాలు కావచ్చు. తల్లిదండ్రుల్లో ఎవరికైనా ఈ సమస్య ఉంటే వచ్చే అవకాశం ఉంది. పురుషుల కన్నా ఈ సమస్య స్త్రీలలో అధికంగా ఉంటుంది. అధిక బరువున్న వారు, ఎక్కువసేపు నిలుచుని ఉండేవారు వెరికోజ్ వెయిన్స్ బాధితులవుతుంటారు. కదలకుండా పనిచేసే వారిలో ఈ ముప్పు అధికంగా ఉంటుంది. ఈ లక్షణాలు ఉన్నవారు సరైన చికిత్స తీసుకోకుండా ఉంటే సిరల్లో రక్తం గడ్డకట్టడం వల్ల తీవ్ర సమస్యకు దారి తీస్తుంది.

సిరలు ఉబ్బిన కాళ్ల కింద ఎత్తుగా దిండు పెట్టుకుని నిద్రించాలి. సాక్సులు, పట్టీలు ధరించడం మంచిది. రక్త ప్రసరణ దెబ్బ తినకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటే సిరలు ఉబ్బకుండా చూసుకోవచ్చు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.గుండె వైపు అంటే శరీరం పైభాగం యాంటీ ఇన్‌ఫ్లమేటరీ నూనెలను ఉపయోగించి ఉబ్బిన సిరలపై బలంగా కాకుండా సుతిమెత్తగా మసాజ్ చేస్తే మంచిది. బరువును నియంత్రలో ఉంచుకోవాలి.

పీచుతో కూడిన ఆహార పదార్ధాలు ఎక్కువగా తీసుకోవాలి. ఆహారంలో ఉప్పును తగ్గించాలి. కూర్చుని ఉన్న సమయంలో కాళ్లను కాస్త ఎత్తులో పెట్టుకోవాలి. గంటల కొద్దీ ఒకే భంగిమలో కూర్చోవటం, నిల్చోవటం చేయకుండా మధ్యమధ్యలో భంగిమలు మార్చాలి. వెరికోజ్ వెయిన్స్ నిర్ధారణ కోసం అల్ట్రాసౌండ్, సీటీ, ఎమ్‌ఆర్‌ఐ వంటి టెస్టులు చేస్తారు. దానికి తగ్గట్టు వైద్యులు చికిత్స చేస్తారు. పరిస్థితి తీవ్రంగా మారి నొప్పి ఎక్కువగా ఉంటే సర్జరీ చేస్తారు. ఇందులో దెబ్బతిన్న రక్తనాళాలను తొలగిస్తారు. దీనినే లైగేషన్ అండ్ స్ట్రిప్పింగ్ అంటారు. మహిళలకు ఈ రుగ్మత వచ్చిందంటే గర్భం దాల్చడం, హార్మోన్ల ప్రభావం వంటి అంశాలు రక్త ప్రసరణను ఆలస్యమయ్యేలా చేయవచ్చు.

ఉత్తానపాద ఆసనం
ఉత్తానపాద ఆసనం చేయడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగవుతుంది. ఆకుపచ్చగా, ఉబ్బిని సిరలు నెమ్మదిగా తగ్గుతాయి. అసిడిటీ, అజీర్ణం, మలబద్ధకం, వంటి కడుపు రుగ్మతల నుంచి ఉపశమనం పొందవచ్చు. వెన్ను, తుంటి కండరాలు దృఢమవుతాయి. వెన్నునొప్పితో బాధపడేవారికి ఉపయోగపడుతుంది. ఉదర కండరాల స్థాయి తగ్గుతుంది. బెల్లీ ఫ్యాట్‌ను తగ్గిస్తుంది. దిగువ వీపు రక్త ప్రసరణ మెరుగవుతుంది. పునరుత్పత్తి అవయవాల పనితీరు మెరుగవుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News