నాగశౌర్య, రీతూవర్మ జంటగా లక్ష్మీసౌజన్య దర్శకురాలిగా పరిచయమవుతున్న చిత్రం ‘వరుడు కావలెను’. పిడివి. ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఈనెల 29న థియేటర్లలో విడుదల కానుంది. హైదరాబాద్‌లో చిత్ర యూనిట్ సంగీత్ పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. ముఖ్య అతిథిగా అగ్ర కథానాయిక పూజాహెగ్డే హాజరయ్యారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత ఎస్. రాధాకృష్ణ, చిత్ర నాయకా, నాయికలు నాగశౌర్య, రీతు వర్మ, దర్శకురాలు లక్ష్మీ సౌజన్య, నిర్మాత సూర్యదేవర నాగ వంశీ, సప్తగిరి, మాటల రచయిత గణేష్ రావూరి, సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్, గేయ రచయిత రాంబాబు గోశాల తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూజాహెగ్డే మాట్లాడుతూ… “మహిళా దర్శకురాలు లక్ష్మీసౌజన్య తెరకెక్కించిన మంచి ప్రేమకథ ‘వరుడు కావలెను’.
అందరూ సినిమా చూసి తమ బాధల్ని మరచిపోండి. ఈ సినిమా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను” అని అన్నారు. నాగశౌర్య మాట్లాడుతూ… ‘మన కుటుంబం మంచిది అని ఎంత గర్వంగా చెప్పుకుంటామో.. మా సినిమా బాగా వచ్చిందని అంతే గర్వంగా చెబుతున్నాను. మంచి అవుట్ పుట్ కోసం దర్శకురాలు లక్ష్మీసౌజన్య చాలా పోరాడింది. ఈ సినిమా హిట్‌తో తన కష్టానికి తగ్గ ప్రతిఫలం తప్పకుండా దక్కుతుంది’ అని తెలిపారు. నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ… ‘ఫ్యామిలీ ఆడియెన్స్, యువతకు బాగా ఆకట్టుకునే చిత్రమిది. ఈనెల 29న ఈ సినిమాను విడుదల చేస్తున్నాము’ అని అన్నారు. రీతూవర్మ మాట్లాడుతూ… ‘ప్రేమ, అనుబంధం ఇతివృత్తంగా పూర్తి కుటుంబ కథాంశంతో రూపొందిన చిత్రమిది. ఈ కథ నాకు దొరకడం అదృష్టంగా భావిస్తున్నా. మా అందరికీ ఇది సూపర్ హిట్ సినిమాగా నిలుస్తుంది” అని అన్నారు.