నాగశౌర్య, రీతు వర్మ జంటగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన సూపర్ హిట్ మూవీ ‘వరుడు కావలెను’. లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంతో మాటల రచయితగా పరిచయమయ్యారు గణేష్ రావూరి. ఈ సినిమా విజయంలో డైలాగ్స్‌కు మంచి క్రెడిట్ దక్కింది. ఈ సందర్భంగా మాటల రచయిత గణేష్ రావూరి మీడియాతో మాట్లాడుతూ.. “గతంలో సోలో బ్రతుకే సో బెటర్ చిత్రంతో పాటు ఒకటి, రెండు చిత్రాలకు ఒక వర్షన్ డైలాగ్స్ రాశాను. పూర్తిగా ఓ సినిమాకు వర్క్ చేసింది మాత్రం ‘వరుడు కావలెను’ చిత్రానికే. నిర్మాత నాగవంశీ ఈ సినిమాకు డైలాగ్స్ రాసే అవకాశాన్నిచ్చారు. ‘వరుడు కావలెను’ సినిమాకు వస్తున్న స్పందన, మాటలు బాగున్నాయంటూ వస్తున్న ప్రశంసలు సంతోషాన్నిస్తున్నాయి. ‘వరుడు కావలెను’ కథలో కామెడీ, ఎమోషన్స్ కలిసి ఉంటాయి.
ఈ రెండింటికీ మాటలు బాగా కుదిరాయి. హీరో హీరోయిన్ల పాత్రలకు ఓ పరిధి ఉంటుంది. ఆ పరిధి మేరకు మాటలు రాశాను. హీరో హీరోయిన్ల పాత్రలు తమ మనసులో మాటను ఒకరికొకరు చెప్పకుండా మాటలు, కథనాన్ని ఒక బిగితో చివరి వరకు తీసుకెళ్లాం. హీరోతో హీరోయిన్ రెండు సార్లు ప్రేమలో పడటం ఈ చిత్రంలో నాకు బాగా నచ్చిన అంశం. రచయితగా త్రివిక్రమ్ శైలిని అనుసరించలేదు. ఆయనలా రాశానని ఎవరైనా చెబితే దాన్ని పెద్ద గౌరవంగా భావిస్తా. నాకు కమర్షియల్ మూవీస్ కు, మాస్ చిత్రాలకు మాటలు రాయాలని ఉంది. త్వరలో అలాంటి అవకాశాలు వస్తాయని ఆశిస్తున్నా”అని అన్నారు.
‘Varudu Kavalenu’ Writer Ganesh Ravuri Interview