80 మందితో బిజెపి కొత్త జాతీయ కార్యవర్గం
న్యూఢిల్లీ: బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా గురువారం 80 మంది సభ్యులతో పార్టీ జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించారు. ఈ జాబితాలో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్‌తోపాటు పార్టీ సీనియర్లు ఎల్‌కె అద్వానీ, మురళీ మనోహర్ జోషి తదితరుల పేర్లు ఉన్నాయి. కాగా..వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా గళం విప్పిన బిజెపి ఎంపి వరుణ్ గాంధీ, ఆయన తల్లి ఎంపి మేనకా గాంధీలకు జాబితాలో చోటు దక్కకపోవడం గమనార్హం. రైతుల సమస్యల పట్ల సానుభూతిని వ్యక్తం చేసిన మాజీ కేంద్ర మంత్రి బీరేంద్ర సింగ్‌కు కూడా కొత్త కార్యవర్గం నుంచి తప్పించడం విశేషం. 80 మంది సభ్యులతోపాటు 50 మంది ప్రత్యేక ఆహ్వానితులు, 179 మంది శాశ్వత ఆహ్వానితులు కొత్త కార్యవర్గంలో ఉంటారు. కొత్తగా మంత్రివర్గంలో చేరిన అశ్వినీ వైష్ణవ్‌కు కార్యవర్గంలో చోటు దక్కగా మాజీ కేంద్ర మంత్రులు హర్ష వర్ధన్, రవి శంకర్ ప్రసాద్, ప్రకాశ్ జావదేకర్‌లు కూడా కొత్త కార్యవర్గంలో కొనసాగనున్నారు.