Friday, December 20, 2024

కాంగ్రెస్‌లో చేరితే సంతోషిస్తాం

- Advertisement -
- Advertisement -

వరుణ్ గాంధీకి అధిర్ రంజన్ ఆహ్వానం

న్యూఢిల్లీ: ఉత్తర్ ప్రదేశ్‌లోని పిలిభిత్ నియోజకవర్గం సిట్టింగ్ ఎంపి వరుణ్ గాంధీకి బిజెపి లోక్‌సభ అభ్యర్థుల జాబితాలో చోటు దక్కకపోవడంతో ఆయనకు కాంగ్రెస్ నుంచి ఆహ్వానం అందించింది. తమ పార్టీలోకి వరుణ్ గాంధీని సాదరంగా ఆహ్వానిస్తున్నామని కాంగ్రెస్ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి మంగళవారం తెలిపారు. వరుణ్ గాంధీ మూలాలు గాంధీ కుటుంబంలో ఉన్న కారణంగానే ఆయనకు బిజెపి టిక్కెట్ నిరాకరించిందని పశ్చిమ బెంగాల్ పిసిసి అధ్యక్షుడు చౌదరి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. వరుణ్ గాంధీ కాంగ్రెస్‌లో చేరాలని, మచ్చలేని నిజాయితీపరుడైన వరుణ్ గాంధీ తమ పార్టీలో చేరితే తామంతా సంతోషిస్తామని చౌదరి తెలిపారు.

వరుణ్ గాంధీ చాలా ఉన్నత భావాలు గల నాయకుడని, మంచి విద్యావంతుదైన రాజకీయ నేతని ఆయన చెప్పారు. ఆయన వ్యక్తిత్వం పారదర్శకమని, ఆయనకు గాంధీ కుటుంబంతో కూడా సత్సంబంధాలు ఉన్నాయని చౌదరి చెప్పారు. ఈ కారణంగానే ఆయనకు బిజెపి టిక్కెట్ నిరాకరించిందని ఆయన చెప్పారు. వరుణ్ గాంధీ కాంగ్రెస్‌లోకి రావాలని తామంతా కోరుకుటున్నట్లు ఆయన తెలిపారు. బిజెపి ఆదివారం(మార్చి 24) విడుదల చేసిన లోక్‌సభ అభ్యర్థుల ఐదవ జాబితాలో పిలిభిత్ స్థానంలో సిట్టింగ్ ఎంపిగా ఉన్న 44 ఏళ్ల వరుణ్ గాంధీకి చోటు దక్కలేదు. వరుణ్ గాంధీ తప్పించి 2021లో కాంగ్రెస్ నుంచి బిజెపిలో చేరిన జితిన్ ప్రసాదకు చోటు కల్పించింది. అయితే సుల్తాన్‌పూర్ నియోజకవర్గంలో మాత్రం వరుణ్ గాంధీ తల్లి మేనకా గాంధీకి మాత్రం బిజెపి మరోసారి పోటీ చేసే అవకాశాన్ని కల్పించింది. అయితే..బిజెపి తనకు సీటు నిరాకరించడం పట్ల వరుణ్ గాంధీ తీవ్ర మనోవ్యథకు గురైనట్లు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి.

తనను బిజెపి మోసం చేసిందని రగిలిపోతున్న వరుణ్ గాంధీ ఈసారి ఎన్నికల్లో పోటీ చేయకూడదని భావిస్తున్నట్లు వారు చెప్పారు. జాబితా విడుదల కావడానికి ముందే వరుణ్ గాంధీ నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలు కొనుగోలు చేయడంతోపాటు ఎన్నికల ప్రచారం కోసం పిలిభిత్‌లోని ప్రతి గ్రామంలో రెండు కార్లు, 10 మోటారుసైకిళ్లు సిద్ధంగా ఉంచాలని తన అనుచరును ఆదేశించారని వారు చెప్పారు. అయితే బిజెపి టిక్కెట్ నిరాకరించినప్పటి నుంచి వరుణ్ గాంధీ నుంచి ఎటువంటి సందేశం ఆయన అనుచరులకు రాలేదని వారు చెప్పారు.

ఒకవేళ బిజెపి టిక్కెట్ రాని పక్షంలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలవాలని ఈ నెల మొదట్లో వరుణ్ గాంధీ భావించినట్లు వర్గాలు తెలిపాయి. అయితే తన భవిష్యత్ కార్యాచరణ గురించి వరుణ్ ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. కాగా..ఉత్తర్ ప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలోని ప్రభుత్వంపైన వరుణ్ గాంధీ అఏనేక సందర్భాలలో తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయనకు టిక్కెట్ దక్కకపోవడం వెనుక ఇది కూడా ఒక కారణం కావచ్చన్న ప్రచారం జరుగుతోంది.బిజెపి విధానాల పైన కూడా ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో నరేంద్ర మోడీ ప్రభుత్వ వైఫల్యాలను కూడా ఆయన గతంలో ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News