మోడీ ఉచితాలపై వరుణ్ చురక
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ ఉచితాలు అనుచితాలు అని చేసిన వ్యాఖ్యలపై బిజెపి ఎంపి వరుణ్‌గాంధీ ఘాటుగా , వ్యంగాత్మకంగా స్పందించారు. యుపిలోని పిల్భిత్ ఎంపి అయిన వరుణ్ ఇటీవలి కాలంలో సొంతపార్టీలపై తీవ్రస్థాయిలో విమర్శలకు దిగుతూ ఉన్న క్రమంలో ఇప్పుడు ఏకంగా మోడీనే లక్షంగా ఎంచుకుని దాడితీవ్రతను పెంచారు. ప్రధాని మోడీ రెవ్డీలపై బాగా మాట్లాడారని, ఆయన ఈ ఐదేళ్లకాలంలో పేదలకు ఐదు కిలోల బియ్యం నెలవారిగా అందించారు. ఇదే కాలంలో కొందరిని ఎంచుకుని ఏకంగా రూ 10 లక్షల కోట్ల మేర అప్పుల మాఫీకి కూడా దిగారు. ఈ రెండింటికి సంబంధించి నిజంగానే పార్లమెంట్‌లో ప్రధాని మోడీని ప్రస్తుతిస్తూ తీర్మానం వెలువరించిందే అని స్పందించారు.
ప్రజలకు రేషన్ అందిస్తున్నందుకు ప్రధాని మోడీకి, కేంద్ర ప్రభుత్వానికి అభినందనలు తెలియచేయాలని ఇటీవల బిజెపి ఎంపి నిశికాంత్ దూబే చెప్పడాన్ని వరుణ్ ప్రస్తావించారు. ఎన్నికలలో ఉచిత హామీల ప్రక్రియ దేశ ఆర్థిక వ్యవస్థకు విఘాతం అవుతుందని ఇటీవల యుపి సభలో ప్రధాని చెప్పడం వివిధ పార్టీల నుంచి విమర్శలకు దారితీసింది. ఇప్పుడు సొంత పార్టీ ఎంపి కూడా దీనిపై మండిపడ్డారు. ఉచితాల జాబితాలో మెహుల్ చోక్సీ, రిషి అగర్వాల్‌ల పేర్ల ముందు భాగాన ఉంటాయని, సర్కారు వారి నిధులపై వీరికే కదా తొలి హక్కు ఉండేదని, ఏది ఏమైనా రూ 10 లక్షల కోట్ల అప్పుల మాఫీ మరో వైపు పేదలకు ఉచిత రేషన్‌లు ఇచ్చినందుకు ప్రధాని అభినందనీయుడే అవుతాడని , దూబే మాటలు సబబే అని వరుణ్ వ్యంగ్యంగా స్పందించారు.