లక్నో: బీజేపీ ఎంపీ వరుణ్‌గాంధీ గత కొంతకాలంగా సొంత పార్టీపైనే విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. గత ఏడాది సెప్టెంబర్‌లో అమేథీలోని సంజయ్ గాంధీ ఆస్పత్రిలోఓ రోగి చనిపోగా, దాన్ని సాకుగా చూపించి ఆస్పత్రి లైసెన్సును ఉత్తరప్రదేశ్ బీజేపీ ప్రభుత్వం రద్దు చేసింది. దీనిపై వరుణ్‌గాంధీ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. సంజయ్ గాంధీ పేరుపై ఉన్న కోపం ప్రజలకు సేవ చేస్తున్న ఆస్పత్రిపై చూపించరాదని బాహాటంగా సామాజిక వేదికలో రాష్ట్ర బీజేపీ ప్రభుత్వ తీరుపై నిప్పులు కురిపించారు.
ఈ నేపథ్యంలో వరుణ్‌గాంధీకి మళ్లీ ఫీలీభిత్ స్థానం నుంచి బీజేపీ టికెట్ ఇవ్వక పోవచ్చని తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్ బీజేపీ నేతలు ఇటీవల కోర్ కమిటీ మీటింగ్‌లో వరుణ్‌గాంధీ టికెట్‌పై వ్యతిరేకత వెళ్ల గక్కారు. ఇవన్నీ పరిశీలిస్తే కాషాయ పార్టీ ఈసారి వరుణ్‌కు రిక్తహస్తం చూపించవచ్చన్న ఊహాగానాలు చెలరేగుతున్నాయి. అలా జరిగితే పిలిభిత్ నుంచి ఇండిపెండెంట్‌గా వరుణ్ పోటీ చేయవచ్చని ఆయన సన్నిహిత వర్గాల నుంచి వినిపిస్తోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లోని ఫీలీభిత్ నియోజక వర్గం నుంచి మూడోసారి బీజేపీ ఎంపీగా వరుణ్ గాంధీ విజయం సాధించారు. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి యూపీలో 51 స్థానాలకు బీజేపీ తొలి జాబితా లోనే అభ్యర్థులను ప్రకటించింది. మరో 24 సీట్లను ఖరారు చేయలేదు. అందులో వరుణ్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తోన్న పీలీభిత్, ఆయన తల్లి మేనకా గాంధీ ఎంపీగా ఉన్న సుల్తాన్‌పుర్‌లు ఉన్నాయి.
అయితే ఈసారి మేనకా గాంధీకి సుల్తాన్‌పుర్ ఖరారు చేసే అవకాశం ఉన్నప్పటికీ, వరుణ్‌కు మాత్రం మొండిచేయి చూపొచ్చనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన స్థానంలో యూపీ మంత్రి జితిన్ ప్రసాద లేదా ఫీలీభీత్ ఎమ్‌ఎల్‌ఎ కు చోటు కల్పించవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. మరో వైపు సమాజ్‌వాది పార్టీ కూడా వరుణ్ గాంధీ వైపు చూస్తోంది. బీజేపీ టికెట్ నిరాకరిస్తే మీ పార్టీ టికెట్ ఇస్తుందా అని సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్‌ను ప్రశ్నించగా ఆయన ఎటూ తేల్చలేదు. వరుణ్‌కు టికెట్ ఇవ్వాలో ఇవ్వకూడదో పార్టీ నిర్ణయిస్తుందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా వరుణ్ గాంధీ ప్రతినిధులు ఢిల్లీ నుంచి నాలుగు సెట్ల నామినేషన్ పేపర్లు తీసుకొచ్చి వరుణ్‌కు అందజేసి తిరిగి ఢిల్లీకి వెళ్లిపోయారు.
ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ఇంతవరకు అంబేద్కర్ నగర్ నుంచి మాజీ బీఎస్‌పి ఎంపీ రితేష్ పాండేను పోటీకి నిలబెట్టగా, హేమమాలిని, రవికిషన్, అజయ్ మిశ్రా తేని, మహేష్ శర్మ, ఎస్‌పిఎస్ బఘేల్, సాక్షిమహారాజ్, తదితరులు మళ్లీ తమ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. ప్రధాని నరేంద్రమోడీ తన వారణాసి నియోజకవర్గం నుంచి , కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లక్నో నుంచి మరో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అమేథీ నుంచి పోటీ చేయనున్నారు. వరుణ్ గాంధీ విషయమే పెండింగ్‌లో ఉంచారు. ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని వరుణ్ గాంధీ కేదార్‌నాథ్‌లో కలుసుకోవడం రాజకీయంగా చర్చకు దారి తీసింది. వరుణ్ పార్టీ మారే అవకాశం ఉందన్న వార్తలు కూడా వచ్చాయి.