వసంత పంచమి రోజు తరలివచ్చిన 5 కోట్ల మంది
తెల్లవారుజాము నుంచే పుణ్యస్నానాలు
భారీగా వచ్చిన అఖాడాలు, నాగసాధువులు
పకడ్బందీ ఏర్పాట్లు చేసిన యుపి ప్రభుత్వం
మహాకుంభ్‌నగర్ : వసంత పంచమిని పురస్కరించుకుని మహాకుంభమేళాలో సోమవారంనాడు అత్యంత ముఖ్యమైన మూడో అమృతస్నానానికి కోట్లాది మంది తరలివచ్చారు. తీవ్రమైన చలి, రవాణాపరమైన ఇబ్బందులను సైతం తట్టుకొని ప్రయాగ్‌రాజ్‌కు మిలియన్ల కొద్దీ భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము 4గంటల నుంచే పుణ్యస్నానాలు ఆచరించేందుకు త్రివేణి సంగమం సహా ఇతర ఘాట్ల వద్దకు తరలివెళ్లారు. ఒక్కరోజే సుమారు ఐదు కోట్ల మంది భగవంతుని నామస్మరణ చేస్తూ పుణ్యస్నానాలు ఆచరించినట్లు సమాచారం. అఖాడాలు, నాగసాధవులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా హెలికాప్టర్ల ద్వారా భక్తులపై పుష్ప వర్షం కురిపించారు.
మౌనీ అమావాస్య రోజున జరిగిన తొక్కిసలాటను దృష్టిలో ఉంచుకుని అధికారగణం ఈ సారి పటిష్టమైన భద్రత చర్యలు చేపట్టింది. భక్తులు అందరూ త్రివేణి సంగమం వద్దకు తరలిరాకుండా ఇతర ఘాట్ల వద్దకు కూడా వెళ్లేందుకు కుంభమేళాలో విస్తృత ప్రచారం చేశారు. ఒకే ఘాట్ వద్ద కాకుండా అన్ని ఘాట్లకు భక్తులు తరలివెళ్లేలా చర్యలు తీసుకున్నారు. తద్వారా ఎలాంటి అపశ్రుతి చోటు చేసుకోకుండా కోట్లాది మంది అమృత స్నానాలు ఆచరించారు. అదే సమయంలో ఈ సారి అదనపు భద్రత చర్యలు కూడా యూపీ ప్రభుత్వం చేపట్టింది.
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యత నాథ్ తెల్లవారుజాము 3.30 గంటల నుంచే భద్రత చర్యలను పర్యవేక్షించారు. ఎప్పటికప్పుడు అధికారులకు సూచనలు, ఆదేశాలిచ్చారు. రద్దీ ప్రాంతాలను గుర్తించి దాన్ని అధిగమించేందుకు పక్కా ఏర్పాట్లు చేశారు. ఉదయం 10గంటల వరకే 80లక్షలకు పైగా భక్తులు స్నానమాచరించారని డిఐజి వైభవ్ కృష్ణ వెల్లడించారు. దీన్ని బట్టే వసంతపంచమి రోజైన సోమవారంనాడు కనీసం ఐదు కోట్ల మంది అమృతస్నానం ఆచరిస్తారని ఆయన వివరించారు. యావత్ ప్రపంచం ఇప్పుడు భారతదేశం వైపు చూస్తోందని, భారతీయ సంస్కృతి సంప్రదాయాలు, సామాజిక సౌభ్రాతృత్వాన్ని పరిశీలిస్తోందని జునా అఖాడా పీఠాధిపతి అచార్య మహామండలేశ్వర్ అవదేశానంద్ గిరి మహారాజ్ వ్యాఖ్యానించారు.