వాసవి పైశాచికం ఏడాదిగా ఫ్లాట్లు అప్పగించని నిర్మాణ సంస్థ ఇదేమిటని ప్రశ్నిస్తే
తప్పించుకుంటున్న యాజమాన్యం కార్యాలయానికి వెళ్తే చీకట్లో నిర్బంధం మూడు గంటల
పాటు హైదరాబాద్‌లోని వాసవి ప్రధాన కార్యాలయంలోనే బందీలుగా గడిపిన బాధితులు
మన తెలంగాణ/సిటీబ్యూరో : ఏడాది కావస్తున్నా ఫ్లాట్లు అప్పగించడంలేదని నిలదీసేందుకు వచ్చిన ఫ్లాట్ల కొనుగోలుదారులను 3 గంటల పాటు ని ర్బంధించిన వైనమిది.డబ్బులన్నీ చెల్లించినా.. తమ కు ఫ్లాట్లను అప్పగించడంలేదని నిలదీసిన బాధితులను చీకటిలోనే కూర్చోబెట్టి భయబ్రాంతులకు గు రిచేసిన ఉదంతమిది. చిన్నపిల్లలతో వచ్చిన వారిపై ఏమాత్రం కనికరం చూపించకుండా.. కర్కశకంగా వ్యవహరించడం గ్రేటర్ హైదరాబాద్‌లో తీవ్ర కలకలం సృష్టించింది. ఈ సంఘటన వాసవి నిర్మాణ సంస్థ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు తెలంగాణలో పేరున్న సంస్థ వాసవి కావడంతో.. పలువురు తెలంగాణ వాసులతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కూడా నగరంలో పలు సంస్థల్లోని ఉద్యోగులు వాసవి నిర్మాణ సంస్థ వద్ద ఫ్లాట్లను కొ నుగోలు చేశారు.
వారికి సకాలంలో ఫ్లాట్లను పూర్తిచేసి అప్పగించడంలో సంస్థ తీవ్ర జాప్యం చేయడ మే కాకుండా పలుదఫాలుగా వాయిదాలు వేస్తూ రావడంతో కొనుగోలుదారులు ఇక ఓపిక లేక ఆ సంస్థ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. గ్రేటర్ నగరంలోని వివిధ ప్రాంతాల్లోని వాసవి ప్రాజెక్టు బహుళ అంతస్థుల భవనాలలో పలువురు ఫ్లాట్లను కొనుగోలు చేశారు. కొందరు 2020లో, మరి కొం దరు 2022లో, ఇంకొందరు 2024లో కొనుగోలు చేసినట్టు పలువురు వెల్లడిస్తున్నారు. కానీ, 2024 ఆగష్టునాటికి కొనుగోలు చేసిన ఫ్లాట్ల నిర్మాణాలను పూర్తిచేసి అప్పగిస్తామని చెప్పినా.. ఇప్పటి వరకు తమ ఫ్లాట్లను పూర్తిచయడం లేదనీ, అప్పగించడంలేదనీ, దీంతో తాము ఆందోళనకు లోనై వాసవి నిర్మాణానికి సంబంధించిన వారిని సంప్రదిస్తుండగా.. పలుమార్లు అదిగో ఇదిగో అంటూ వాయిదాలు వేస్తూ వస్తున్నారేగానీ, ఏడాది గడిచిపోతున్నా.
చెప్పిన వాయిదాల్లోనూ పనులు పూర్తికాకపోవడం, ఫ్లాట్లను రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వకపోవడంతో తామంతా వాసవి ప్రధాన కార్యాలయానికి చేరకుని యాజమాన్యాన్ని కలిసి అడగాలని నిర్ణయించుకుని వచ్చామని తెలిపారు. తాము ఖరీదు చేసిన ఫ్లాట్ల ఖరీదులో సుమారు 80 శాతం వరకు నిధులు చెల్లింపులు చేశామని, కానీ, వాసవి వారు ఇప్పటి వరకు ఫ్లాట్ల పనులను పూర్తిచేయడం లేదని వారు ఆవేవన వ్యక్తంచేస్తున్నారు. మాట్లాడేందుకు వస్తే.. తామందరినీ లోపలికి పిలిచి నేలపై కూర్చోబెట్టడం.. తామేదో తప్పు చేసిన వారిగా పరిగణించడం బాధాకరమని, మా నగదు తీసుకుని, మాకు ఫ్లాట్లను అప్పగించకపోగా.. కలిసేందుకు వచ్చిన వారిని తప్పుచేసిన వారిగా ట్రీట్ చేయడం, నేలపైనే కూర్చోబెట్టడం, కరెంట్ దీపాలను బంద్ చేయడం, ఎవరినీ కలవకుండా, మాట్లాడకుండా చేయడం తీవ్రంగా ఆందోళనకు లోనుచేసిందని పలువురు కొనుగోలుదారులు అసహనం వ్యక్తంచేశారు.
హఫీజ్‌పేట్ నుంచే..
గ్రేటర్లోని హఫీజ్‌పేట్‌లోని లేక్ సిటీ ప్రాజెక్టులోనే చాలా మంది ఫ్లాట్లను కొనుగోలుచేసిన వారే వాసవి యాజమాన్యాన్ని నిలదీసేందుకు వచ్చినట్టు పలువురు వెల్లడించారు. ఓ వెంచర్‌లో తాను 2బిహెచ్‌కె ఫ్లాటును కొనుగోలు చేశానని, 2024 ఆగష్టు నాటికి నిర్మాణం పూర్తిచేసి రిజిస్ట్రేషన్ చేయించి అప్పగిస్తానని చెప్పారని, ఇప్పటి వరకు పూర్తి చేయకపోగా ఏడాది గడిచినా.. వాయిదాలతో దాటవేస్తున్నారని ఓ కొనుగోలు దారుడు ఆవేదన వ్యక్తంచేశాడు. క్రౌన్‌సిటీలో 3 బిహెచ్‌కె ఫ్లాటును 2020లో కొనుగోలు చేశానని, 5 ఏండ్లు గడిచినా..
పనులు పూర్తికాలేదని, ఫ్లాటును అప్పగించలేదని, అడిగినప్పుడల్లా అదిగో, ఇదిగో అంటూ వాయిదాలతోనే సరిపెడుతున్నారని, ఇప్పుడు ప్ర శ్నించేందుకు వస్తే సమాధానం రావడంలేదనీ, అయినా.. మరో అవకాశమిస్తామని, ఈ వాయిదా ప్రకారంగానైనా.. ఫ్లాటు పనులు పూర్తిచేసి రిజిస్ట్రేషన్ చేస్తారా..? లేదా..? చూసిన అనంతరం తగిన విధంగా చర్యలు తీసుకోనున్న ట్టు మరో కొనుగోలుదారుడు వివరించారు. తాను ప్రగతినగర్(నిజాంపేట్)లోని ప్రాజెక్టులో ఫ్లాట్‌ను కొనుగోలు చేశానని, అయితే, ఇంకా పనులు మొదలుకాలేదని, ఎప్పుడు పనులు మొదలుపెడతారనేది అడిగేందుకు వచ్చినట్టు ఓ కొనుగోలుదారుడు వెల్లడించారు. ఇలా హఫీజ్‌పేట్, ప్రగతినగర్, ఉప్పల్ తదితర ప్రాంతాల్లోని ప్రాజెక్టుల్లో ఫ్లాట్లను కొనుగోలు చేసిన వారు యాజమాన్యాన్ని ప్రశ్నించారు.
నేలపై కూర్చోబెట్టి.. లైట్లు బంద్ చేసి..
యాజమాన్యాన్ని కలిసి అడిగేందుకు వచ్చిన పలువురు ఫ్లాట్లను కొనుగోలు చేసిన వారిని నేలపైనే కూర్చోబెట్టడం, లైట్లు బంద్ చేయడం, ఎటూ వెళ్ళకుండా డోర్‌లను లాక్ చేయడం వంటివి చూస్తే.. తామేదో తప్పుచేసిన వారిని ట్రీట్ చేసినట్టుగా చేయడంపై పలువురు అసహనం వ్యక్తంచేశారు. చివరికి చిన్నపిల్లలను కూడా బయటకు వెళ్ళనివ్వలేదనీ, పోలీసులు వచ్చినా లోనికి రానివ్వలేదనీ, పోలీసులు ఫోటోలు, వీడియోలు తీస్తున్నా.. పేపర్లు అడ్డుపెట్టడ ం, సిబ్బందితో అడ్డుకోవడం వంటివి చూస్తే.. ఇక ముందు ఈ నిర్మాణ సంస్థకు వ్యక్తిగతంగా వస్తే ప్రమాదమే.. అనే భావన కలిగిందని, ఈ వాతావరణం కాస్తంత భయాందోళనకు లోను చేసిందనేది ఫ్లాట్ల కొనుగోలుదారుల్లోని అభిప్రాయం. మీడియా ముందుకు వెళ్ళనివ్వలేదనీ, కొందరు ఆలస్యంగా వచ్చిన వారిని లోనికి పంపించలేదనీ, లోపల ఉన్నవారిని బయటకు పంపించడంగానీ, బయటవారిని లోపలికి పంపించడంగానీ చేయకపోవడంతో.. వీరి వద్ద ఫ్లాట్లను కొనుగోలు చేయాలంటేనే పునరాలోచన చేయాల్సి వస్తుందనే అనుమానాలను పలువురు వ్యక్తంచేశారు.
మర్యాదపూర్వకంగానే కలిశాం..
వాసవి సంస్థతో మర్యాదపూర్వకంగానే కలిసి మాట్లాడేందుకు, ఫ్లాట్లను ఎప్పుడు పూర్తిచేస్తారనేది అడిగేందుకు వచ్చామని, తమకు వాసవితో ఎలాంటి వాదనలు లేవని బాధితుల ముసుగులో కొందరిని మీడియా ముందుకు తీసుకొచ్చి యాజమాన్యమే చెప్పించడం గమనార్హం. మీడియా ముందుకు వచ్చిన వారు వాస్తవంగా ఫ్లాట్లను కొనుగోలుచేసిన వారుకాదని బాధితులు పేర్కొంటున్నారు.