యావత్ మహీతలాన్ని పరిపాలించి, పేరు ప్రఖ్యాతులు గడించి, దేవేంద్రుడి నుండి వరంగా ఎన్నో గౌరవ చిహ్నాలను పొంది, మిలమిల మెరిసిపోతున్న విమానంలో ఎక్కి తిరుగుతూ వుండే, ఛేది దేశాధిపతైన వసువు అనే మహారాజు కథే వసుచరిత్ర. దీన్ని సూతుడు శుకశౌనకాది మహామునులకు నైమిశారణ్యంలో తెలియచేశాడు.
అధిష్టానపురం అనే మహానగరం రకరకాల శోభలతో అలరారుతూ వుంటుంది. సకల విద్యలకు ఆ నగరం ఆటపట్టు. నగరంలో ఎక్కడ చూసిన ధాన్యపు రాశులే! వేదసమ్మతమైన హితోక్తులు చెప్పే బ్రాహ్మణోత్తములు ఎందరో వున్నారానగరంలో. వారు సకల విద్యలలోను ఆరితేరినవారు. సువర్ణ సంపదలతో నిండి అలరారుతూ వుంటుంది ఆ మహానగరం. ఆ నగరంలోని రాజులు ప్రతిభావైవిధ్యాలతో వెలుగొందుతుంటారు. కుబేరుడిని మించిన ధనవంతులు ఆ నగర వైశ్యులు. రైతులు ధాన్యపు రాశులను భద్రపరుస్తారు.
ఆ మహానగరానికి పరాక్రమవంతుడైన వసు నృపాలుడు అధిపతి. వసురాజు ఎనలేని కీర్తి సంపద ఆర్జించాడు. శౌర్యంలో అతడికి సమానులెవరూ లేరు. దానంలో, వితరణలో ఆయనకు ఆయనే సాటి. ప్రజలపట్ల అనుగ్రహం చూపేవాడు. అవసరమైతే పరాక్రమం ప్రదర్శించేవాడు. సర్వసమర్థుడై పరిపాలన చేశాడు. ఒకనాడు హిమవత్పర్వత శాఖైన కోలాహల పర్వతం శుక్తిమతి నదీప్రవాహానికి అడ్డు నిలవగా వసురాజు తన కాలిగోటితో ఆ పర్వతాన్ని పక్కకు నెట్టాడు. దాంతో అతడి కాలిగోరు ఇంద్రుడి వజ్రాయుధంతో సమానమైనదిగా చెప్పుకున్నారు. ఆ పరాక్రమాన్ని తిలకించిన ఇంద్రుడు వసురాజుతో స్నేహం చేయసాగాడు. సామంతరాజులు ఆయనకెప్పుడూ లోబడి వుండేవారు. వసురాజు చేత పరాభవించబడిన పర్వతం కొన్నాళ్లు ఆయన కాళ్ల దగ్గరే పడి వున్నది. ఆ తరువాత దానిమీద దయతలచి వదిలేశాడు. ఆ పర్వతం మీద రాజు అప్పుడప్పుడూ విహారం చేసేవాడు.
ఇదిలా వుండగా ఒక సంవత్సరం వసంత ఋతువు ప్రవేశించింది. రాజుగారి ఉద్యానవనంలో చెట్లు చిగురులు వేశాయి. మన్మథదేవుడు చైత్రమాసంలో మీనధ్వజారోహణం చేస్తాడు. మలయమారుతం అనే రథం ఎక్కి ప్రయాణం చేస్తాడు. మారుతం వసంత సమాగమంతో విజృంభిస్తుంది. అది చేసే అల్లరి అంతా-ఇంతా కాదు. వనపాలకులు మారుతం చేస్తున్న అల్లరిని, ఆగడాన్ని వసురాజుకు విన్నవించారు. వారి మాటలు వినగానే ఉద్యానవనం అంతా ఒక్కసారి తిరిగిరావాలని, విహరించాలని రాజుగారికి కోరిక కలిగింది. తనకొరకై సిద్ధం చేసిన అపురూపమైన రథంలో ఉద్యానవన విహారానికి బయల్దేరాడు రాజు.
మహారాజు దర్శనానికి అదే సరైన సమయం అని భావించిన సామంతరాజులు అక్కడికి చేరుకున్నారు. రాజుగారి రథం ఉద్యానవనం దగ్గర ఆగింది. ఆయన రథం మీదనుండి కిందికి దిగాడు. వెంటవచ్చిన సామంత రాజులను పొమ్మన్నాడు. తన స్నేహితులతో కలిసి ఉద్యానవనంలోకి ప్రవేశించాడు. వనాగ్రసీమను పరికించి చూశాడు రాజు. అరటి చెట్లను, పాడుతున్న చిలకలను, సాష్టాంగపడుతున్న వన వృక్షాలను, సంపెంగచెట్లను, ఇంకా ఆనేక రకాల వృక్షాలను చూశాడు రాజు. ఇంతలో వసురాజుకు శుక్తిమతీనదిలో ఒదిగి దాక్కుని వున్న కోలాహల పర్వతం గుర్తుకు వచ్చింది. దాని దగ్గరికి వెళ్లాలని కుతూహలం కలిగింది.
వసురాజు తన మంత్రితో సహా కోలాహల పర్వత ప్రాంతాన్ని చేరుకునేసరికి వారికి సురాపాన మత్తతతో మునిగిపోయిన దేవతాస్త్రీల మనోహర సంగీత నాదం వినవచ్చింది. ఆ నాదానికి తన్మయుడైపోయాడు వసురాజు. మరో పక్కనుండి కోకిలల గేయసముదాయం వినవస్తోంది. ఇంకో పక్క నుండి నెమళ్ళ గుంపుల నాట్యధ్వని వినవస్తోంది. అలా…అలా…అనేక గాన సంపుటలు ఒకే సమయంలో వినపడసాగాయి. పర్వత విశేషాలను తనివితీరా చూడ సాగాడు వసురాజు. తన మంత్రితో కూడి వసురాజు ఒక చంద్రశిలమీద కూచున్నాడు. ఆ సమయంలో వారికొక మధురగానం వినవచ్చింది. అది ఎక్కడినుండి వస్తున్నదో, ఎవరిదో, వారు ఎక్కడ వున్నారో కనుక్కొని రమ్మని మంత్రికి చెప్పాడు రాజు. ఆ వివరాలు తెలిస్తే అక్కడికి పోదామని అన్నాడు రాజు.
మంత్రి రాజుగారి ఆదేశానుసారం బయల్దేరాడు. ఆయనకు ఒకలోయ కనిపించింది. అక్కడ నదీ ప్రవాహం, అనేక రకాల చెట్లు, పక్షులు కనిపించాయి. అక్కడ మంత్రికి ఒక దివ్య మందిరం కనిపించింది. ఆ మందిరం ముందర నవరత్నాల ముగ్గులు కనిపించాయి. అది నానా శోభలతో వెలిగిపోతున్నది. ఆ మందిరంలో కొందరు వనితా రత్నాలు వున్నట్లు ఆయన భావించాడు. చెట్లచాటునుండి ఆ మందిరంలోకి చూడసాగాడు. లోపల ఒక సుందరి కూచుని వుండడం గమనించాడు. ఆమె అక్కడ కూచుని వీణ వాయిస్తూ వున్నది. ఆమె చుట్టూ కొంతమంది చెలికత్తెలున్నారు. ఆమె గురించి మహారాజుకు చెప్పిరావడానికి మంత్రి వసురాజు దగ్గరికి వెళ్లాడు.
మంత్రి తాను చూసినదంతా చెప్పాడు. తాను చూసిన సుందరి అందాన్ని వర్ణించాడు. ఆమెకు ఎదురుపడకుండా దూరంగా చెట్ల చాటు నుండి చూసిన సంగతి విన్నవించుకున్నాడు. త్వరగా వెళ్లి ఆమెను సందర్శించుకొని రావాలని రాజుగారు కుతూహలపడ్డాడు. వసురాజు విరహ వాతావరణంలో మునిగిపోయాడు. రాజు, మంత్రి కలిసి బయల్దేరారు. కన్య వున్న మందిరం కనిపించింది. ఆ దివ్యమందిరాన్ని పొదల మాటున నిలబడి అతి జాగ్రత్తగా పరిశీలించి చూశాడు వసురాజు. ఆ సుందరిని చూడగానే ఆయన కన్నులకు ఉత్సుకత ఎక్కువైంది. శరీరం అంతా అనురాగంతో నిండిపోయింది. ఆమె సౌందర్యాన్ని అలాగే చూస్తూ ఉండిపోవాలని అనుకున్నాడు. ఆమెను ఆపాదమస్తకం గమనించాడు.
వసురాజు మనస్సు ఇంతవరకూ పరాయత్తం కాలేదు. ఇప్పుడు ఆయన తన మనస్సులో ఈ కన్యారూపాన్ని నిలుపుకొని కొనియాడసాగాడు. ఆమె సౌందర్యానికి ముగ్దుడైపోయాడు. రాజు, మంత్రి ఆలోచన చేసిన తరువాత ముని వేషంలో మంత్రి ఆమె దగ్గరికి పోయాడు. ఆయన్ను చూసి సుందరి ఆయనకు నమస్కారం చేసింది. ప్రియపురుషుడిని వివాహం చేసుకుంటావని ఆమెను ఆశీర్వదించాడు ముని వేషంలోని మంత్రి. మునికి అర్ఘ్యపాద్యాది సేవలను చేసిన తరువాత ఆయన వివారాలను అడిగింది సుందరి చెలికత్తె మంజువాణి. తాను గౌతముడి వంశీయుడినని, క్షీర సముద్రంలో పుట్టానని, తన పేరు కూడా గౌతముడే అని, తాను సూర్యుడిని ప్రేమిస్తున్నానని, ఉద్యానగతుడైన తన స్వామితో అటువైపుగా వచ్చానని, అపర లక్ష్మీదేవిలాగా కనిపిస్తున్న ఆ సుందరి గోత్రనామాలు చెప్పమని అడిగాడు.
ఆ కన్య పేరు సింధునందన అని, ఆమెనే అంచలేంద్ర నందన అని కూడా అంటారని, దానర్థం నదీ పుత్రి, పర్వత పుత్రి అని, అంటూ, మంజువాణి ఆ సుందరి జన్మక్రమాన్ని తెలియచేసింది ఇలా. ఈ భూమ్మీద వసురాజు అనే చక్రవర్తి వున్నాడు. అతడి పరాక్రమం లోకాతీతమైనది. అతడి నివాస స్థలమైన అధిష్టానపురం సంపదలతో అలరారుతూ వుంటుంది. రాజధానికి కంఠాభరణం లాగా శుక్తిమతి అనే నది వున్నది. ఆ నదికి ఇష్టసఖి నర్మదానది. వేత్రవతి, సరస్వతి నదులు చెలికత్తెలు. అంతా కలిసి ఒకనాడు బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్లివస్తుంటే ఒక సంఘటన జరిగింది. శుక్తిమతీదేవికి పర్వత శ్రేష్టుడైన ఒక పురుషుడు తారసపడ్డాడు. అతడు అనుపమ భాగ్యశాలైన హిమవంతుడి కుమారుడు. పార్వతీదేవికి తమ్ముడు. పరమేశ్వరుడికి ముద్దుల మరది. పర్వతరాజు శుక్తిమతీదేవిని చూసి ఆకర్షితుడయ్యాడు. ఇద్ద రూ మోహంలో చిక్కుకుపోయారు. కోలాహలుడు శుక్తిమతి చెంతకు చేరాడు. ఆమె కూడా రాజుకు స్వాగతం పలికింది. అర్ఘ్యపాద్యాదులను ఇచ్చింది. పూజావిధులు నెరవేర్చింది.
తాను ఆమె పొందుకోరి వచ్చానని, ఎల్లప్పుడూ ఆమెను విడువకుండా వుంటానని, తనను అంగీకరించమని పర్వతరాజు కోరాడు శుక్తిమతిని. తన స్వభావం నీచాతినీచమైనదని, ఎప్పుడూ పల్లానికే పోతుంటానని, అతడేమో చలించని స్వభావం కలవాడని, తాను పరుగులు తీస్తుంటానని, అతడేమో ధైర్యంగా ఒక్క చోటే నిలుచుంటాడని, ఇలా పరస్పర విరుద్ధ గుణాలు కల ఇద్దరు ఒకటిగా కూడడం సమంజసంగా వుండదని, తమకు స్నేహం సరిపడే విషయం కాదని, కాబట్టి ఆయన పట్ల అనురాగం కలగడం కష్టం, అసాధ్యమని శుక్తిమతి తేల్చి చెప్పింది. పర్వతరాజు ఆమె చెప్పిన మాటలు వినకుండా బలం ప్రయోగించి, పరాక్రమం ప్రదర్శించి, శుక్తిమతిని లొంగదీసుకునే ప్రయత్నం చేశాడు. శుక్తిమతి అసహయురాలై వసురాజును ప్రార్థించింది. శుక్తిమతికి అడ్డుగా నిలిచాడు కోలాహలుడు. నదీగర్భం పగిలిపోయి నీరు భూమ్మీద అనేక పాయలుగా స్రవించసాగింది. భూమండలంలో సంచలనం బయల్దేరింది. జనం కూడా వసురాజుకు మొరపెట్టుకున్నారు. వసురాజు తన కాలిగోటితో కోలాహల పర్వతాన్ని ఆకాశం వైపుకు ఎగురవేశాడు. ప్రజలంతా సంతోషించారు.
కోలాహల పర్వత గర్వాన్ని అణచిన వసురాజును ప్రజలు కీర్తించారు. తాను చేయలేని పని వసురాజు చేసినందుకు దేవేంద్రుడు ఆనంద భరితుడయ్యాడు. స్వయంగా వసురాజు దగ్గరికి వచ్చి దర్శనం ఇచ్చాడు. ఒక అపురూపమైన రథాన్ని బహుమానంగా ఇచ్చాడు. ఆ రథం మీద లక్ష్మీదేవి, విష్ణుమూర్తి సూర్యమండలం అంతా పర్యటన చేశారని చెప్పాడు. ఆ విమాన యజమానికి సువర్ణప్రాప్తి కలుగుతుందని చెప్పాడు. ఆ విమానం ఎక్కే అర్హత బ్రహ్మకు, విష్ణువుకు, శంకరుడికి తప్ప అన్య దేవతలకు లేదన్నాడు. ఆ విమానాన్ని ఎక్కి వసురాజు తన నివాసానికి రాకపోకలు సాగించాలని కోరాడు ఇంద్రుడు. వసురాజు ఆ కానుకను స్వీకరించాడు. శుక్తిమతీ తీరవాసులైన మునులు వసురాజుకు ‘ఉపరిచరుడు’ అనే బిరుదు ఇచ్చారు. వసురాజు ఆయన అనుకున్నప్పుడల్లా ఆ విమానం మీద విహారం చేస్తూ నానలోకాలు తిరిగేవాడు.ఆయనకు శుక్తిమతీ నది క్రీడా సరోవరం కాగా, కోలాహల పర్వతం క్రీడా పర్వతమైంది.
జలప్రవాహానికి అడ్డుగా నిలిచిన కోలాహల పర్వతరాజు సంఘర్షణవల్ల శుక్తిమతీనదికి గర్భం ఏర్పడింది. ఒక శుభ ముహూర్తాన ఒక ఆడ శిశువు, ఒక మగ శిశువు కలిగారామెకు. ఈ విషయం తెలుసుకున్న కోలాహలుడు కూడా సంతోషపడ్డాడు. శుక్తిమతి తన కుమారుడికి ‘వసుపదుడు’ అని పేరు పెట్టింది. బాలికకు ‘గిరిక’ అని నామకరణం చేశారు బ్రాహ్మణులు. తన ఇద్దరు సంతానాన్ని శుక్తిమతి జాగ్రత్తగా పెంచుకుంటూ వస్తోంది. గిరిక అల్లారుముద్దుగా పెరిగింది. తల్లి కుమార్తెను చదువుల సరస్వతిగా తయారు చేసింది. తండ్రి ఆమెను వీణా వాద్య ప్రవీణురాలిగా చేశాడు. ఆమె వీణానాదం చేయడానికి ఒక మణి గృహాన్ని నిర్మించి ఇచ్చాడు. ఆ ‘గిరిక’ యే ఈ కన్య. చెలికత్తెలైన వారంతా వనదేవతలు.
ఈ విధంగా మంజువాణి ఉపరిచర వసువు కథను, గిరికాదేవి జన్మ వృత్తాంతాన్ని మునివేషంలో వున్న మంత్రికి సవివరంగా చెప్పింది. పొదలమాటున వున్న రాజు కూడా ఆ కథంతా విన్నాడు. గిరిక నెమ్మదిగా తలెత్తి వసురాజును చూసింది. సిగ్గు పడింది. వసురాజు చక్కదనాన్ని చూస్తూ ఉండిపోయింది. రాజు అక్కడికి వచ్చాడు కాబట్టి తమ అభిమతాలన్నీ తీరాయని మంజువాణి అన్నది. ఆయన్ను పొందగలిగినందుకు గిరిక చాలా అదృష్టవంతురాలని అన్నది. ఆ భువనమోహిని చిన్నతనం నుండీ వసురాజును కీర్తిస్తూనే వున్నదని అన్నది. ముని వేషంలో వున్న మంత్రి వసురాజును, గిరికను ఆశీర్వదించి అక్కడి నుండి వెళ్లిపోయి, తన కపట వేషాన్ని తీసేసి మంత్రి వేషంలో తిరిగి అక్కడికి వచ్చాడు. గిరికను, వసురాజును ఒంటరిగా వదిలి అంతా అక్కడి నుండి తప్పుకున్నారు. వసురాజు మనస్సు పూర్తిగా గిరిక మీదే లగ్నమైపోయింది. ఆమె పరిస్థితి కూడా అంతే.
ఇంకా అక్కడే ఎక్కువకాలం వుంటే మంచిది కాదని, గిరిక ఎలాగూ రాజును ప్రేమించిందని, రాజధానికి పోయి పురోహితులను సంప్రదించి గిరికతో వివాహానికి ముహూర్తుం నిర్ణయం చేద్దామని మంత్రి అన్నాడు. ఆ తరువాత మంత్రితో కూడి వసురాజు ఆలోచనలలో మునిగి తేలుతూ నగరానికి వెళ్లాడు.
మంత్రితో కలిసి అధిష్టానపురం నగరానికి చేరుకున్న వసురాజు ఏపనిమీదా ఆసక్తి కనపరచలేదు. ప్రతి పనీ పరధ్యాసతో లాంఛనప్రాయంగా ముగించేవాడు. అనుక్షణం గిరికన్యను తలచుకుంటూ నీరసించి పోయాడు. అక్కడ స్త్రీరత్నమైన గిరిక ఏమీ దొరకని స్థితిలో పడిపోయి తన హృదయ చోరుడి వర్ణచిత్రం వ్రాసింది. ఆమెకూడా వసురాజులాగానే విరహావస్థలోపడి ఉన్మత్తురాలైపోయింది. కూతురు అలా మానసిక వ్యధతో కుంగిపోవడం తల్లి శుక్తిమతీదేవి గమనించింది. కూతురును తన కౌగిట్లో పొదివి పట్టుకున్నది.
మన్మథబాధ భరించలేక గిరికన్య ఉద్యానవనంలో విహారానికి పోయింది. చెట్టు-చెట్టునూ, పుట్ట-పుట్టనూ వసురాజు గురించి అడిగింది. ఆమె పడుతున్న విరహ తాపాన్ని గమనించిన ఆమె ఇష్టసఖి మంజువాణి ఆమెను ఉపశమింపచేయడానికి పరి-పరి విధాల ప్రయత్నం చేసింది. తాను పోయి గిరిరాజ కన్య వృత్తాంతాన్ని వసురాజుకు చెప్తానని, ఆయన మనస్సు, ఆలోచన తెలుసుకొని వెంటనే వస్తానని, శుభవార్తను తీసుకు వస్తానని అంటుంది గిరికన్యతో, ఇతర చెలికత్తెలతో. ఆమె వెళ్లిన తరువాత మిగిలిన చెలికత్తెలు గిరికన్యను ఊరడించసాగారు. ఇంతలో వసురాజు దగ్గరికి వెళ్లిన మంజువాణి ఆయనిచ్చిన పద్మరాగముద్రికతో కూడిన ఉంగరాన్ని పుచ్చుకుని వినువీధిలో రాసాగింది. మంజువాణి గిరికన్యను చేరుతున్నకొద్దీ దాని అరుణిమ ఎక్కువ కాసాగింది.
మంజువాణి వచ్చి వసురాజు ఇచ్చిన ఉంగరాన్ని గిరికకు ఇచ్చింది. అక్కడి వృత్తాంతం చెప్పమని చెలికత్తెలు మంజువాణిని అడిగారు. జవాబుగా ఇలా చెప్పింది మంజువాణి: మీరు చెప్పిన విధంగానే, గిరిక మనస్సులోని విచారాన్ని వసురాజుకు చెప్పడానికి గగన మార్గంలో ప్రయాణం చేసి ఆయన్ను చేరుకున్నాను. మొదట వసుమహారాజు నగరం ఏదో కనుక్కోవడం కష్టమైంది. కొంత పరిశీలన చేసి ఆయన నగరమైన అధిష్టానపురాన్ని గుర్తించగలిగాను. ఆయన రాజ సౌధం మీద వ్రాలాను. వసురాజు గృహద్వారాన్ని సమీపించాను. అదృశ్య రూపంలో వసురాజు కేళీ భవనంలో ప్రవేశించాను. అక్కడ వసురాజును, ఆయన మందిరాన్ని చూశాను. అక్కడ వున్న స్త్రీలు వసురాజు పరిస్థితిని గురించి చర్చించుకుంటున్నారు. గిరిక వున్న క్రీడావనానికి వెళ్లివచ్చినప్పటి నుండి ఆయన అదోలా ఉన్నాడని వారు మాట్లాడుకుంటున్నారు. రాజు వున్న రత్నమందిరంలో ప్రవేశించాను. వసురాజు నీమీద విరహతాపంతో కుమిలి పోతున్నాడని గ్రహించాను.
గిరికను ఉద్దేశించి వసురాజు కఠినంగా మాట్లాడడం, నిష్ఠూరాలు ఆడడం గమనించి అదే సరైన సమయమనుకొని మాట్లాడసాగాను. నా మాటల ద్వారా గిరిక హృదయ తాప వర్ణన వసురాజు హృదయానికి ములుకులాగా తాకినట్లయింది. మాట్లాడుతున్నదెవరో వసురాజుకు మొదలు అర్థం కాలేదు. మంజువాణి ఏదైనా సందేశం తీసుకు వచ్చిందా అన్న అనుమానం కలిగింది వసురాజుకు. తనకు గిరిక అంటే పూర్ణమైన అనురాగం వున్నదని, గిరిక కూడా అదే భావనతో వున్నదని తెలుసుకున్నాను కాబట్టి ఇక తనకు ఊరట కలిగిందన్నాడు. తానేం చేయాలని అడిగాడు. ఆయన ఆత్మీయతకు, మమకారానికి నాకు ఆశ్చర్యం కలిగింది. నేను గిరిజాదేవి ఆనవాలుగా తీసుకెళ్లిన ఆమె కంఠహారాన్ని వసురాజు హృదయ స్థానంలో వుంచాను. ఆ హారం ఆయన శరీరాన్ని తాకడంతోనే ఆయన తాపం పోయినట్లు మాట్లాడసాగాడు.
అ ఆతరువాత నేను నా అదృశ్య రూపాన్ని వదిలి, వచ్చింది నేనేనని, హారం ఇచ్చింది నేనేనని, మంజువాణినని చెప్పాను. వసురాజు తన మనస్సులో గిరిక పట్ల వున్న అనురాగాన్ని వివరించాడు. ఇంద్రుడికి తన వృత్తాంతం తెలిసిందని, ఒక మంచి రోజు చూసుకొని కోలాహలుడి దగ్గరికి వెళ్లి వివాహ ప్రస్తావన చేయనున్నాడని అన్నాడు వసురాజు. ఈ శుభ వార్తను నీకు (గిరికకు) తెలియచేయమని అన్నాడు. అలా అంటూ తన చేతి ఉంగరాన్ని నాకు నిదర్శనంగా ఇచ్చి పంపాడు. ఈ విధంగా జరిగిన కథ అంతా మంజువాణి ద్వారా విన్న గిరిక ఆ ఉంగరాన్ని చేతిలో తీసుకున్నది. వంటికి అద్దుకున్నది. ఆ ఉంగరం మీద వసురాజు పేరు చూసి, ఆయన్నే చూసినట్లు సిగ్గు పడింది. ఆ ఉంగరాన్ని తన వేలుకు ధరించింది. అప్పుడే వివాహం అయిపోయినంత ఉత్సాహంగా వున్నదామెకు. ఈ విషయమంతా విన్న గిరిక తల్లి శుక్తిమతీదేవి కూడా సంతోషించింది.
ఇదిలా వుండగా ఇంద్రుడు మొదలుగాగల దిక్పాలకులు కోలాహలుడి దగ్గరికి వచ్చారు. శుభకార్య నిర్వహణకు వస్తున్న ఇంద్రుడికి కోలాహలుడు స్వాగతం పలికాడు. ఇంద్రుడికి అతిథి పూజ చేశాడు. అర్ఘ్యపాద్యాదులు ఇచ్చాడు. తన ఉన్నతికి తగినట్లుగా ఇంద్రుడిని గౌరవించాడు. ఆయన వెంట వచ్చిన వారందరినీ పలకరించి, మన్నించి, గౌరవించాడు. తన కుమార్తెను అందరికీ పరిచయం చేశాడు. తండ్రి ఆదేశం ప్రకారం గిరిక అందరికీ నమస్కారం చేసింది. అంతా ఆమె చక్కదనాన్ని, సౌందర్యాన్ని చూసి మెచ్చుకున్నారు. గిరికకు తగిన వరుడు ఒకడున్నాడని అంటూ, ఇంద్రుడు, వసురాజు గురించి చెప్పాడు. అలాంటివాడు అల్లుడు కావడం కంటే అదృష్టం ఇంకేమి వుంటుందని అన్నాడు. కోలాహలుడు ఆ మాటలకు కృతజ్ఞతాపూర్వకంగా ఇంద్రుడి వైపు చూశాడు. తనకు ఇంతకన్నా సౌభాగ్యం ఏముందని అన్నాడు. ఇంద్రుడి స్నేహితుడైన వసురాజుకు తన కూతురును ఇచ్చి వివాహం జరిపించమని వేడుకున్నాడు కోలాహలుడు.
అంతకు ముందే అక్కడికి చేరుకున్న శుక్తిమతీదేవి, ఆమెతో పాటు వచ్చిన ఇతర నదీకాంతలు (నర్మద, గంగ, వాఘిరా, యమునా, రుద్రాంఘ్రిజ, తామ్రపర్ణి, పినాకిని, శీతాద్రిజాత) గిరిక వైభవానికి సంతోషపడ్డారు. హిమవంతుడు మేనక సమేతంగా వచ్చాడు. మైనాకుడు సముద్ర గర్భం నుండి పైకి వచ్చాడు. మేరు, మందర పర్వత శ్రేష్ఠులు వచ్చారు. ఇంకా ఎందరో గిరిక వివాహం చూడడానికి వచ్చారు. ఆ పర్వతం మొత్తం పెద్ద పట్టణంగా తయారైంది. ఆ రాత్రే వివాహానికి ఒక శుభ ముహూర్తాన్ని నిర్ణయించమని, వదూవరులకు శుభం కలిగే విధంగా ఆశీర్వదించమని దేవేంద్రుడు తన గురువు బృహస్పతిని కోరాడు. వివాహానికి మిథున లగ్నం అనుకూలం అన్నాడు బృహస్పతి.
ఇంద్రుడు ఆ తరువాత వసురాజు దగ్గరికి వెళ్లాడు. వాస్తవానికి వసురాజు ఆయనకొరకు ఎదురు చూస్తున్నాడు. తనకు పాదాభివందనం చేసిన వసురాజును ఆశీర్వదిస్తూ ఇంద్రుడు, ఆయన్ను పెండ్లికొడుకువు అగుదువుగాక అని అన్నాడు. కోలాహలుడి దగ్గర జరిగిన విషయాలన్నీ చెప్పి, ఆ రాత్రే ముహూర్తమని అంటూ అక్కడికి బయల్దేరమన్నాడు. వెంటనే రాజాజ్ఞప్రకారం అధిష్టానపురం స్వర్గధామం లాగా అలంకరించడం జరిగింది. వసురాజును దేవతాస్త్రీలు పెండ్లికొడుకును చేశారు. ఆ తరువాత ఆయన వివాహ వేదిక దగ్గరికి వచ్చాడు. సమస్త అలంకారాలతో పెళ్లికూతురుగా తయారైన గిరిక కూడా వివాహ వేదిక మీదికి వచ్చింది. ఆమె లక్ష్మీదేవిలాగా శోభాయమానంగా ఒప్పుతున్నది.
దిక్పాలకుల భార్యలంతా గిరికాదేవికి వివాహ సమయంలో అలంకార విశేషాలను కానుకలుగా పంపారు. అంతకు ముందే వసురాజును అలంకరించారు. గిరిజావసురాజుల వివాహం చూడడానికి సంధ్యాదేవి వచ్చింది. ఇంతలో లగ్నం సమీపించింది. సరస్వతీదేవి వసురాజును చూడడానికి వచ్చింది. గిరిక, వసురాజులు శ్రీ మహాలక్ష్మి, విష్ణుమూర్తి లాగా వున్నారు. సుముహూర్తం కాగానే కోలాహల రాజు, వసురాజుకు తన కూతురును కన్యాదానం చేశాడు. బృహస్పతి మంత్రాలు చదివాడు. గిరిక కంఠానికి వసురాజు మంగళ సూత్ర ధారణ చేశాడు. బృహస్పతి శుభాశీస్సులు పలికాడు. వధూవరులు తలంబ్రాలు పోసుకున్నారు. ఆ తరువాత వారి వివాహ మహోత్సవాన్ని తిలకించడానికి వచ్చిన వారందరికీ విందులు చేశారు.
వసురాజు, గిరిక ఈ విధంగా ఇంద్రుడి ప్రేరణ వల్ల వివాహితులయ్యారు. పెళ్లి నాలుగు రోజులు పూర్ణాహుతులు మొదలైన హోమక్రియలు చక్కగా జరిగాయి. దేవతలు సంతృప్తిచెందారు. వదూవరులకు ఎన్నో వరాలిచ్చారు. దీవెనలిచ్చారు. కానుకలిచ్చారు. ఇంద్రుడు వసురాజుకు దివ్యమైన వేణు దండాన్ని ఇచ్చాడు. అది శతకోటి వజ్రాయుదాలకు సమానమని చెప్పాడు. కోలాహల పర్వతరాజు, శుక్తిమతీదేవి, వసురాజు వివాహ మహోత్సవానికి వచ్చిన ఇరుపక్షాల బంధువులను తగురీతిగా సత్కరించారు. అత్తగారింటికి వెళ్లనున్న గిరికకు అన్ని రకాల సలహాలు, సూచనలు ఇచ్చింది తల్లి శుక్తిమతీదేవి.
అంపకాలైన తరువాత వసురాజు గిరికతో కలిసి విమానం ఎక్కి ఆకాశమార్గంలో తన నగరానికి ప్రయాణమయ్యాడు. ఆ తరువాత రాజ గృహానికి చేరుకున్నారు. క్రమంగా సమస్త ప్రజలచేత కొనియాడబడుతూ వసురాజు శుభ సంపదలతో వెలగసాగాడు. వసురాజు, గిరిక, రతీమన్మథుల్లాగా; వాణీవిరించులలాగా; శచీసురేంద్రుల లాగా; లక్ష్మీనారాయణుల్లాగా సుఖ సంతోషాలతో కాలం గడిపారు. వసురాజు గిరిక పట్ల నిరంతరాసక్తితో మెలుగుతూ వున్నాడు. అతడి కీర్తి దశదిశలా వ్యాపించింది. అతడి జయలక్ష్మి, రాజ్యలక్ష్మి సుస్థిరంగా, ఐశ్వర్యంతో అలరారింది.
(జయంతి పబ్లికేషన్స్ వారి కమలాసనుడు వచన రచన ఆధారంగా)
వనం జ్వాలా నరసింహారావు