న్యూఢిల్లీ : ఇనుప ఖనిజం, ఉక్కు ఆస్తుల వ్యూహాత్మక విక్రయం ద్వారా వేదాంత లిమిటెడ్ దాదాపు 4.9 బిలియన్ డాలర్ల రుణాలను చెల్లించనుందని కంపెనీ చైర్మన్ అనిల్ అగర్వాల్ పేర్కొన్నారు. దీని ద్వారా కంపెనీ రుణాన్ని తగ్గించుకోవాలని ప్రయత్నిస్తోంది. సున్నా రుణం కంపెనీగా మారేందుకు స్టీల్ వ్యాపారం విక్రయం దోహదం చేస్తుందని అగర్వాల్ ఒక ఇంటర్వూలో చెప్పారు. 2024 మార్చి నాటికి ఈ సేల్ పూర్తి కానుందని ఆయన తెలిపారు. ఆరు డీమెర్జ్‌డ్ కంపెనీల్లో విక్రయించే సంస్థ వివరాలను ఆయన వెల్లడించలేదు.
వేదాంత మొత్తం 6.4 బిలియన్ డాలర్ల (రూ.53,256 కోట్లు) అప్పులను కల్గివుంది. దీనిలో 1 బిలియన్ డాలర్ల చెల్లింపులు జనవరిలో చేయనుంది, అలాగే 2024 ఆగస్టులో 500 మిలియన్ డాలర్లు చెల్లించనుంది. సమయానికి రుణాలను తిరిగి చెల్లించేందుకు సంస్థ వద్ద చాలా అంతర్గత వనరులు ఉన్నాయని అగర్వాల్ తెలిపారు. అక్టోబర్‌లో వేదాంత సెబీ ఆమోదం పొందవచ్చు, వచ్చే ఆర్థిక సంవత్సరంలో(202324) విభజన ప్రక్రియను పూర్తి చేయనున్నామని అన్నారు. వేదాంతకు చెందిన హిందుస్తాన్ జింక్ విభజనను అగర్వాల్ ధృవీకరించారు.