బిజెపి మాజీ ఎంపి వేదాంతి విజ్ఞప్తి
అయోధ్య: ఉత్తర్ ప్రదేశ్‌లోని అయోధ్యలో వచ్చేనెల 22న జరగనున్న రామాలయ ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవానికి బిజెపి కురువృద్ధ నాయకుడు ఎల్ కె అద్వానీని తీసుకువచ్చేందుకు తగిన ఏర్పాట్లు చేయవలసిందిగా ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు బిజెపి మాజీ ఎంపి, రామమందిర ఉద్యమ నాయకుడు రాంవిలాస్ వేదాంతి గురువారం విజ్ఞప్తి చేశారు. అయితే వయోభారం కారణంగా అద్వానీ, మరో బిజెపి సీనియర్ నాయకుడైన మురళీ మనోహర్ జోషి అయోధ్యలో ప్రాణప్రతిష్టాపన కార్యక్రమానికి రావద్దంటూ డిసెంబర్ 18న రామాలయ తీర్థ క్షేత్ర ట్రస్టు సలహా ఇచ్చింది.
కాగా..శ్రీరామచంద్రడు తన సింహాసనంపై అధిష్టించే అద్భుత దృశ్యాన్ని అద్వానీ తన కళ్లతో స్వయంగా చూడాలని, రామ మందిర ఉద్యమంలో అద్వానీ అత్యంత కీలక పాత్ర పోషించిన కారణంగా ఆయన అయోధ్యకు రావాలని దేశంలోని హిందువులే కాదు యావత్ ప్రపంచంలోని హిందువులు కోరుకుంటున్నారని వేదాంతి తెలిపారు.
బిజెపి నేడు ఈ స్థితికి రావడం వెనుక అటల్ బిహారీ వాజ్‌పేయి, అద్వానీ, మురళీ మనోహర్ జోషి కృషి ఎంతో ఉందని ఆయన అన్నారు. సోమనాథ్ నుంచి అయోధ్య వరకు చేపట్టిన రథయాత్ర ద్వారా అద్వానీ రామ మందిర ఉద్యమానికి ప్రాణం పోశారని ఆయన తెలిపారు. రామాలయంలో ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని వీక్షించేందుకు అద్వానీని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని ఆయన కోరారు.