శివసేన ఎంపి సంజయ్ రౌత్ స్పష్టీకరణ
ముంబయి: మహాత్మా గాంధీ అభ్యర్థన మేరకు స్వాతంత్య్ర సమరయోధుడు వీర్ సావర్కర్ అప్పటి బ్రిటిష్ ప్రభుత్వానికి క్షమాభిక్ష లేఖలు రాశారంటూ కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలతో శివసేన విభేదించింది. వీర్ సావర్కర్ ఎన్నడూ బ్రిటిష్ పాలకులకు క్షమాపణ చెప్పలేదని శివసేన ఎంపి సంజయ్ రౌత్ బుధవారం పుణెలో విలేకరులతో మాట్లాడుతూ స్పష్టం చేశారు. పదేళ్లకు పైగా జైళ్లలో మగ్గుతున్న స్వాతంత్య్ర సమరయోధులు తాము జైలు నుంచి బయటపడేందుకు ఏదో ఒక వ్యూహాన్ని అవలంబిస్తారని, రాజకీయాలలో కాని జైలులో శిక్ష పొందుతున్నపుడు కాని ఒక విభిన్నమైన వ్యూహాన్ని అనుసరిస్తారని సంజయ్ అన్నారు. సావర్కర్ అటువంటి వ్యూహాన్ని అమలుచేసి ఉంటే దాన్ని క్షమాపణగా భావించకూడదని, సావర్కర్ ఎన్నడూ బ్రిటిష్ పాలకులను క్షమాపణ కోరలేదని ఆయన చెప్పారు. హిందుత్వానికి దిక్సూచి అయిన సావర్కర్‌ను శివసేనకు ఎప్పటికీ ఆదర్శనీయుడని గతంలో సావర్కర్‌కు భారత రత్న ఇవ్వాలంటూ పలుసార్లు డిమాండ్ చేసిన సంజయ్ రౌత్ పేర్కొన్నారు.