5 శాతం పడిపోయిన ప్యాసింజల్ వాహన అమ్మకాలు
చిప్‌ల కొరత ఉన్నప్పటికీ మెరుగైన పంపిణీ
గ్రామాలపై పెట్రోల్ రేట్ల పెరుగుదల ప్రభావం : ఫడా
న్యూఢిల్లీ : గత నెలలో వాహన విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. మార్చి నెలలో దేశీయ ప్రయాణికుల వాహన(పివి) రిటైల్ విక్రయాలు 2,71,358 యూనిట్లతో 4.87 శాతం క్షీణించాయి. ఆటోమొబైల్ డీలర్ల సంస్థ ఫడా (ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్స్ డీలర్స్ అసోసియేషన్) ఈ గణాంకాలను వెల్లడించింది. ఫడా ప్రకారం, 2021 మార్చిలో ప్యాసింజర్ వాహనాల విక్రయాలు 2,85,240 యూనిట్లు నమోదయ్యాయి. అంటే 2022 మార్చిలో ఈ సేల్స్ 5 శాతం తగ్గాయి. ఫడా ప్రెసిడెంట్ వింకేష్ గులాటి మాట్లాడుతూ, ప్యాసింజర్ వాహనాలకు భారీ డిమాండ్ కొనసాగుతోందని, అయితే చాలా కాలంగా సెమికండక్టర్ల కొరత వల్ల సమస్యలు ఎదురవుతున్నాయని అన్నారు.
చిప్‌ల కొరత ఉన్నప్పటికీ గత నెలలో సరఫరా మెరుగైంది. రష్యాఉక్రెయిన్ యుద్ధం, చైనా లాక్‌డౌన్ వంటి అంశాలు సరఫరాను మరింత దెబ్బతీయగా, వాహన డెలివరీలపై ప్రభావం ఏర్పడిందని ఆయన అన్నారు. మార్చి నెలలో ద్విచక్ర వాహన సేల్స్ 1,157,681 యూనిట్లతో 4.02 శాతం పడిపోగా, గతేడాది ఇదే నెలలో ఈ విక్రయాలు 12,06,191 యూనిట్లుగా ఉన్నాయి. గ్రామాల్లో ద్విచక్ర వాహన అమ్మకాలు అంతగా లేవని, పెట్రోల్ రేట్లు పెరగడం వల్ల ప్రభావం ఉందని గులాటి అన్నారు.
వాణిజ్య వాహన అమ్మకాలు మాత్రం 77,938 యూనిట్లతో 15 శాతం పెరగ్గా, గతేడాదిలో ఇవి 67,828 యూనిట్లు మాత్రమే నమోదైనాయి. త్రీ వీలర్ విక్రయాలు కూడా 48,284 యూనిట్లతో 27 శాతం పెరగ్గా, గతేడాదిలో ఇవి 38.135 యూనిట్లు మాత్రమే ఉన్నాయి. విభాగాల వారీగా మొత్తం విక్రయాలు 16,19,181 యూనిట్లతో 2.87 శాతం పడిపోయాయి. 2021లో మొత్తం సేల్స్ 16,66,996 యూనిట్లుగా ఉన్నాయి.