హైదరాబాద్: మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం దేవాలయానికి వెళ్లే ప్రయాణికులకు అటవీ శాఖ నిబంధనలు సడలించింది. శ్రీశైలం వెళ్లే వాహనాలను రాత్రి 8 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మన్ననూరు చెక్‌పోస్టు వద్ద నిలిపివేసేవారు. మహాశివరాత్రి ఉత్సవాల్లో పాల్గొనేందుకు శ్రీశైలం వెళ్లే ప్రయాణికులు రాత్రి 8 గంటల తర్వాత వెళ్లేందుకు కొన్ని చెక్‌పోస్టు నిబంధనలను అటవీ శాఖ సడలించింది. ముఖ్యంగా స్పీడ్ 40 కిలో మీటర్లకు మించకూడదని, హారన్ మోగించరాదని, వాహనాలను అడవి మధ్యలో ఎక్కడ నిలుపరాదని, తగు జాగ్రత్తగా వెళ్లాలని సూచించారు. రాత్రివేళ వన్యప్రాణులు తిరుగుతాయని రహదారిపై వెళ్లే వారు జాగ్రత్తగా గమనిస్తూ వెళ్లాలని తెలిపారు.
దోమలపెంట, మన్ననూరు చెక్‌పోస్టుల వద్ద వెసులుబాటు నిబంధనలు ఈ నెల 21వ తేదీ వరకు అమలులో ఉంటాయని తెలిపారు. ఇప్పటికే శ్రీశైలంలో జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలతో పాటు వచ్చే నెల ఉగాది వేడుకల వేళ రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు వాహనాలు అటవీ మార్గం మీదుగా ప్రయాణించడానికి ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ అనుమతి ఇచ్చింది. ఎపి అటవీ శాఖ పరిధిలోని శిఖరేశ్వరం, దోర్నాల చెక్ పోస్టుల ద్వారా ఉత్సవాల రోజుల్లో రాత్రివేళ కూడా ఆర్టీసీ బస్సులు, భక్తుల వాహనాలను అనుమతించనున్నట్లు ఎపి అటవీ శాఖ తెలిపింది.