Thursday, January 23, 2025

వెలిగొండ..గుదిబండ

- Advertisement -
- Advertisement -

శ్రీశైలం ప్రాజెక్టుపై పెరగనున్న ఒత్తిడి కోస్తా జిల్లాలకు
మరో 45టిఎంసీల కృష్ణాజలాలు కేంద్ర జల సంఘం
అనుమతులు లేకుండానే నిర్మాణం సెప్టెంబర్‌నాటికి
ప్రాజెక్టు పూర్తికి డెడ్‌లైన్ యుద్ధ ప్రాతిపదికన పనులు
మన ప్రాజెక్టులకు నీటి కటకట

మన తెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రాప్రాంతంలో నిర్మిస్తున్న వెలిగొండ సాగునీటి పథకం తెలంగాణ ప్రాంతం పాలిట మరో గుదిబండ కానుంది. కేంద్ర జలసంఘం అనుమతులు పొందకుండానే కృష్ణానదీజలాలను తరలించుకుపోయేందకు చేపట్టిన ఈ ప్రాజెక్టు వల్ల శ్రీశైలం రిజర్వాయర్‌పై మరింత ఒత్తిడి పెరగనుంది. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి వెలిగొండ ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాంట్రాక్టు ఏజెన్సీలకు డెడ్‌లైన్ విధించింది. ఇప్పటికే శ్రీశైలం రిజర్వాయర్‌లో నికర జలాల ఆధారంగా చేపట్టిన ప్రాజెక్టులకు ఇటు తెలంగాణ , అటు ఎపిలో నీటివాటాలు తేలక రెండు రాష్ట్రాలకు తలబొప్పి కడుతోంది.

బచావత్ ట్రిబ్యునల్ నీటి కేటాయింపుల్లో తెలంగాణ రా్రష్ట్రానికి అన్యాయం జరిగిందని, ఈ ప్రాంత ప్రజలు ఇప్పటికే గగ్గోలు పెడుతున్నారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ద్వారా తగిన న్యాయం చేయాలని కోరుతూ న్యాయస్థానాలను ఆశ్రయించాల్సివచ్చింది. ఈ పరిస్థితుల్లో  కేంద్ర జలసంఘం అనుమతులు కూడా పొందకుండానే అప్పటి ఉమ్మడి ఆంధ్రాపాలకులు వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభించారు. కృష్ణానదిలో మిగులు జలాల ఆధారంగా వెలిగొండ పథకాన్ని చేపట్టామని కేంద్ర జలసంఘానికి 2012లో అప్పటి ప్రభుత్వం వివరణ ఇచ్చుకుంది.అంతే కాకుండా వెలిగొండ ప్రాజెక్టును నిర్మించటం వల్ల కృష్ణాబేసిన్‌లో ఉన్న మరే ఇతర ప్రాజెక్టులపై ఎంత మాత్రం ప్రభావం కూడా పడదని హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో 1996లో రూ.980కోట్ల ప్రాథమిక అంచనాలతో చేపట్టిన ఈ పథకం అంచనా వ్యయం 2005నాటికి 5500కోట్లకు చేరింది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి రాష్ట్రం ఏర్పడే నాటికే ఈ ప్రాజెక్టు పనుల్లో ప్రధాన కాలువల పనులు 80శాతం పూర్తికాగా, మూడు ఆనకట్టల పనులు వందశాతం పూర్తయ్యాయి. జగన్ ప్రభుత్వం ఏర్పాటుతో వెలిగొండ ప్రాజెక్టు పనుల్లో మరింత వేగం పెరిగింది. వెలిగొండ ప్రాజెక్టు పూర్తయితే శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నేరుగా 45టీఎంసీల కృష్ణానదీజలాలను ఆంధ్రాలోని ప్రకాశం, నెల్లూరు తదితర కోస్తా జిల్లాలకు తరలించుకుపోనున్నారు. పేరుకు వరద జలాలు , మిగులు జలాలు అన్న పేర్లతో ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నప్పటికీ కేంద్ర జల్‌శక్తి శాఖగాని, కృష్ణానదీయాజమాన్యబోర్డు గాని కృష్ణానదిలో మిగులు జలాలు ఏ స్థాయింలొ ఎంత అన్నది ఇప్పటివరకూ ఖచ్చితమైన నిర్ధారణ చేయలేదు. కృష్ణానదీజలాలకు సంబంధించి జస్టిస్ బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు ఇంకా అమల్లోకి రాలేదు. అంతకు ముందు జస్టిస్ బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పునే అమలు చేస్తున్నారు. ఈ ట్రిబ్యునల్ ఉమ్మడి ఎపికి 811టిఎంసీల నీటిని కేటాయించింది.

అందులో 66, 34శాతం వాటాలుగా ఏపి 511టిఎంసీలు, తెలంగాణ 299టిఎంసీలు వినియోగించుకుంటున్నాయి. అయితే తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో తాగు , సాగు నీటి అవసరాలు పెరగటంతో కృష్ణానదీజలాల్లో సమాన నీటి వాటాలకోసం తెలంగాణ ప్రభుత్వం పోరాడుతోంది. శ్రీశైలం రిజర్వాయర్ 308టిఎంసీల నీటినిలువ సామర్ధంతో నిర్మించారు. ఈ రిజర్వాయర్ పూడిక పడి దీని సామర్ధం ఇప్పుడు 215టిఎంసీలకు పడిపోయింది. మరో వైపు పోతిరెడ్డి పాడు ద్వారా శ్రీశైలం కుడిగట్టు కాలువ పథకానికి మాత్రమే నికర జలాలు వినిగించుకోవాల్సివుంది. తెలుగు గంగ పథకం శ్రీశైలం రిజర్వాయర్‌పై 25టిఎంసీల మేరకు అదనపు భారం పెంచింది. దీంతో పోతిరెడ్డిపాడు పాడు నిటివిడుదల సామర్ధం పెంచారు. మరో వైపు రాయలసీమ ఎత్తిపోతల పథకం పేరుతో మరో కొత్త పథకాన్ని ఏపి ప్రభుత్వం చేపట్టింది. డ్యాంకు ఎగువన హంద్రీనీవా సుజల స్రవంతి , గాలేరునగరి సుజల స్రవంతి పథకాలకు 80టిఎంసీలకు పైగా కృష్ణాజలాలు తరలిపోతున్నాయి. పెన్నా బేసిన్‌కు నీరందించే ఈ పథకాలను కూడా కృష్ణానది వరద జలాలపై ఆధారపడే నిర్మించారు. శ్రీశైలం జలాశయం నిండి నిండకముందే ఈ పథకాలకు నీటిని తరలిస్తున్నారు.నంద్యాల జిల్లాలోని ముచ్చుమర్రి వద్ద శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం 802అడుగుల స్థాయి నుంచే కృష్ణాజలాలను తోడేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వెలిగొండ పూర్తయితే శ్రీశైలం రిజర్వాయర్‌పై మరింత భారం పడనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News