నిజామాబాద్: జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు సహాయసహకారాలు అందించేందుకు ప్రభుత్వ యంత్రాంగం అన్నిరకాలుగా అప్రమత్తంగా ఉందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రి ప్రశాంత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో పర్యటించి వరద పరిస్థితులు, సహాయచర్యలను ఎప్పటకప్పుడు పర్యవేక్షిస్తూ భరోసానిస్తున్నారు.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంలు ప్రజలకు 24 గంటలూ అందుబాటులో ఉంటాయని. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా కంట్రోల్ రూం ద్వారా అధికారులను సంప్రదించగలరని మంత్రి కోరారు. కంట్రోల్ రూంతో పాటు, నా కార్యాలయం నిరంతరం అందుబాటులో ఉంటూ, వరద ప్రభావిత ప్రజలకు సహాయసహకారాలు అందిస్తుందని తెలిపారు. అధికారులు లోతట్టు ప్రాంతాలలో క్షేత్రస్థాయిలో పర్యటించి, ప్రజల కనీస అవసరాలకు ఎలాంటి లోటు రాకుండా ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పారు. లోతట్టు ప్రాంతాలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు రిలీఫ్ క్యాంపులు కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వైద్యం, ఆహారం, విద్యుత్, రోడ్డు సౌకర్యాల పునరుద్ధరణ కోసం ఎక్కడికక్కడ త్వరితగతిన చర్యలు తీసుకుంటూ అధికారులు ప్రజలకు భరోసానివ్వనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.