Sunday, December 22, 2024

కర్ణాటక ఫలితాలు బిజెపికి చెంపపెట్టు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అభివృద్ది మరిచి మతం, దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తున్న బిజెపి పట్ల యావత్ దేశ ప్రజలు విసుగు చెందారనడానికి కర్ణాటక ఎన్నికల ఫలితాలే నిదర్శనమని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్‌ను తిరస్కరించి కర్ణాటక ప్రజలు బిజెపికి చెంపదెబ్బలాంటి తీర్పునిచ్చారన్నారు. బిజెపి 40 శాతం కమీషన్ అవినీతి పాలన ఓ వైపు అయితే, మరోవైపు ప్రభుత్వరంగ సంస్థలను అమ్ముతూ దేశ సంపద అంతా మోడీ దోస్త్ అదానీకి దారాదత్తం చేస్తూ అక్రమంగా వచ్చిన సొమ్ముతో ప్రభుత్వాలను కూలుస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ప్రజల పట్ల వైషమ్యాలు రెచ్చగొట్టి, దేశ భద్రతను గాలికి వదిలేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

బిజెపి అసమర్థ, అవినీతి పాలన వల్ల సిలిండర్ ధర, పెట్రోల్, డీజిల్, నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటి సామాన్యులు అరిగోస పడుతున్నారన్నారు. కర్ణాటకలో గెలుపు చూసి తెలంగాణలో ఏదో పొడుస్తామని ఇక్కడి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పగటి కలలు కంటున్నాడని, అది వాపు చూసి బలుపు అనుకుంటున్నారని మంత్రి వేముల మండిపడ్డారు. ఇప్పటికే తెలంగాణ ప్రజలు తిరస్కరించిన కాంగ్రెస్, బిజెపిలకు ఇక్కడ చోటు లేదన్నారు. దమ్ముంటే బిజెపి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ పథకాలు అమలు చేసి చూపాలని మంత్రి వేముల సవాల్ చేశారు. కర్ణాటక ప్రజలకు కొత్త ప్రభుత్వం ద్వారా మేలు కలగాలని మంత్రి ఆకాంక్షించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News