హైదరాబాద్: ఎపిలో జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు చేతగానీ తనం వల్లే అభివృద్ధి జరగలేదని, ఈ ఇద్దరు ముఖ్యమంత్రులకు కులాల పట్ల ఉన్న చిత్తశుద్ధి అభివృద్ధిపై లేదని ఇక్కడ హైదరాబాద్ ఉన్నట్టే అక్కడ వైజాగ్ ఉందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం తెలంగాణ భవన్‌లో ఎపి నుంచి పలువురు నాయకులు బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కర్నూల్, నంద్యాల, ప్రకాశం జిల్లాలకు చెందిన నాయకులు బిఆర్‌ఎస్ కండువాను కప్పుకున్నారు. ఎపి బిఆర్‌ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. బిఆర్‌ఎస్‌లో చేరిన వారిలో కర్నూల్ కార్పొరేటర్ ముస్తాక్, సాయి తేజ్ సర్పంచ్, రామాపురం ప్రకాశం, సలీం బేగ్, వెంకటేశం, మాజీ ఎంపిటిసిలు, జెడ్పీటిసి మాజీ యూసుఫ్ బేగ్, ఎంఆర్‌పిఎస్ కర్నూల్ జిల్లా అధ్యక్షురాలు రాధమ్మ, తదితరులు ఉన్నారు.
తెలంగాణ తరహా అభివృద్ధి ఆంధ్రప్రదేశ్‌లో జరగాలి
ఈ సందర్భంగా మంత్రి వేముల మాట్లాడుతూ తెలంగాణ తరహా అభివృద్ధి ఆంధ్రప్రదేశ్‌లో జరగాలని, అక్కడి ప్రజలు కోరుకుంటున్నారని అందులో భాగంగా కెసిఆర్ నాయకత్వం కావాలనుకుంటున్నారని మంత్రి తెలిపారు. 8 ఏళ్లుగా ఎపిలో జరిగిన అభివృద్ధి ఏమిటో అందరికీ కనిపిస్తుందన్నారు. గతంలో ఉన్న నాయకుడు ఒక కులాన్ని పెంచుకున్నారని, ఇప్పుడు వచ్చిన నాయకుడు వచ్చి ఆ కులంపై పడ్డారని ఆయన తెలిపారు. ఆంధ్ర ప్రజల పట్ల కెసిఆర్‌కు ప్రేమ ఉందన్నారు. ఆంధ్ర ప్రజలకు నష్టం చేస్తున్న అక్కడి పాలకుల వైఖరిని తప్పుపడుతూ వచ్చారన్నారు.
వందల కి.మీ.ల సముద్ర తీరం ఉన్న ఆంధ్ర ప్రదేశ్ ను అద్భుతంగా అభివృద్ధి చేసుకోవచ్చని ఎన్నో సార్లు పేర్కొన్నా రన్నారు. అక్కడి నాయకులకు చిత్తశుద్ధి ఉంటే 9ఏళ్లలో వైజాగ్ నగరాన్ని ఎంతో అభివృద్ధి చేయవచ్చన్నారు. 19 కిలోమీటర్ల సముద్ర తీరం ఉన్న సింగపూర్ అంత అభివృద్ధి జరిగితే, వేల కిలోమీటర్ల సముద్రం ఉన్న ఎపిలో ఎంతో అభివృద్ధి జరగాలని ఆయన ప్రశ్నించారు. ఎపి నాయకుల చేతగాని తనం వల్లే ఎపి అభివృద్ధి జరగలేదన్నారు. ఎపికి సహజ వనరులు ఉన్నా ఎపి ముఖ్యమంత్రులకు ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదన్నారు. ఎపికి కెసిఆర్ నాయకత్వం అవసరం ఉందన్నారు. వైసిపి, టిడిపి నాయకులు కెసిఆర్ నాయకత్వాన్ని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి వేముల తెలిపారు.
9 ఏళ్ల కెసిఆర్ పాలనలో తెలంగాణ ఊహించని అభివృద్ధి : తోట చంద్రశేఖర్
తోట చంద్రశేఖర్ ఎపి బిఆర్‌ఎస్ శాఖ అధ్యక్షుడు మాట్లాడుతూ ఎపిని విడగొట్టిన కెసిఆర్ పార్టీలో ఎందుకు జాయిన్ అయ్యారని నన్ను అడుగుతున్నారని, ఎపిని విడగొట్టింది కెసిఆర్ కాదనీ విడగొట్టింది కాంగ్రెస్ పార్టీ అని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ఎపిని విడగొడితే బిజెపి సహకరించిందని, వైసిపి, టిడిపి లేఖలు ఇచ్చాయని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని కడుపుమండి కెసిఆర్ గొంతెత్తారని ఆయన తెలిపారు. ఆంధ్రా పాలకులు తెలంగాణ ప్రాంతానికి అన్యాయం చేస్తున్నారని కెసిఆర్ ప్రశ్నించడంతో పాటు పోరాటం చేశారన్నారు. 9 ఏళ్ల కెసిఆర్ పాలనలో తెలంగాణ ఊహించని అభివృద్ధి జరిగిందన్నారు. 9ఏళ్ల క్రితం తెలంగాణలో కనీసం త్రాగునీరు లేదనీ,.ప్రస్తుతం కరువు రహిత రాష్ట్రంగా మారిందని ఆయన తెలిపారు.