హైదరాబాద్: నిబంధనలను తుంగలో తొక్కి తమిళిసైని గవర్నర్ చేశారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నామినేషన్ల తిరస్కరణపై మంత్రి ప్రశాంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాజకీయ నేతలైతే గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా పనికిరారా?, తమిళిసై పార్టీ పదవి నుంచి నేరుగా గవర్నర్ కాలేదా? అని ప్రశ్నించారు. సర్కారియా కమిషన్ సిఫార్సులు పాటించాలని గతంలో ప్రధాని మోడీ అన్నారని.. కాని, నిబంధనలను తుంగలో తొక్కి తమిళిసైని గవర్నర్ చేశారని, తిమిళిసైకి నైతికత ఎక్కడిదని మంత్రి ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు.
ఇక, గవర్నర్ తమిళిసై తీరుపై దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ తమిళిసై చర్య సమాఖ్య స్పూర్తికి గొడ్డలిపెట్టు వంటిదని, గవర్నర్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఉద్ధేశపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నారని, రాజకీయ కక్షసాధింపులకు పాల్పడడం సరికాదని మంత్రి పేర్కొన్నారు.