నిజామాబాద్: భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ స్థానికంగా ఉండాలన్నా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు మంగళవారం పోచంపాడ్ లోని శ్రీరామ్ సాగర్ డ్యామ్ కి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చేరుకున్నారు. అధికారులతో కలసి వరద పరిస్థితిని మంత్రి సమీక్షించడం జరిగింది. మహారాష్ట్ర నుంచి గోదావరిలోకి, మంజీర, కౌలాస్ నాల నుండి కూడా గోదావరి నదికి భారీ వరదలు వస్తున్న నేపథ్యంలో గేట్లు ఎత్తి 3,50,000 క్యూసెక్కుల నీరు దిగువ గోదావరి కి వదలడం జరిగిందన్నారు. దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇంకా రెండు మూడు రోజులు భారీ వర్షాలు ఉన్నందున అత్యవసరం అయితేనే ప్రజలు బయటకు రావాలని సూచించారు. వర్షాలతో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడిన ప్రాంతాల ప్రజలు కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కంట్రోల్ నెంబర్ కి కాల్ చేయాలని కోరారు. అన్ని శాఖల అధికారులు స్థానికంగా ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ప్రాణ, ఆస్తి నష్టాలు జరగకుండా చూడాలని మంత్రి ఆదేశించారు.