Thursday, February 20, 2025

97 కిలోల బంగారంతో వేములవాడ రాజన్న అధిక ధనవంతుడు

- Advertisement -
- Advertisement -

67 కిలోలతో రెండో స్థానంలో భద్రాచలం,
61 కిలోలతో యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం మూడోస్థానం
అన్ని ఆలయాల వద్ద 1,048 కేజీల బంగారం,
38,783 కిలోల వెండి
బంగారంతో ఆలయాల అభివృద్ధికి దేవాదాయ శాఖ ప్రణాళికలు
త్రిసభ్య కమిటీ ఆమోదం తర్వాత ఆలయాల
అవసరం మేరకే బంగారం కరిగించే అవకాశం

మనతెలంగాణ/హైదరాబాద్:  రాష్ట్రంలోని అన్ని ఆలయాల కన్నా వేములవాడ రాజన్న ధనవంతుల స్థానంలో మొదటిస్థానంలో ఉన్నారు. 97 కిలోల బంగారంతో రాజన్న రాష్ట్రంలోనే మొదటిస్థానంలో దక్కించుకున్నారు. ఇక రెండోస్థానాన్ని భద్రాచలం రామయ్య (67 కిలోల బంగారం), మూడోస్థానం యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి వద్ద (61 కిలోల) బంగారం మొదటి మూడు స్థానాలను దక్కించుకున్నారు. రాష్ట్రంలోని మిగతా ఆలయాల కన్నా ఈ దేవుళ్లు అత్యంత ధనవంతులుగా పేరుగడించారు. దీంతోపాటు భక్తులు అత్యధికంగా దర్శించుకునే ఆలయాల్లోనూ ఈ మూడు ఆలయాలే ముందంజలో ఉండడం విశేషం.

భక్తులు కానుకల రూపంలో సమర్పించే బంగారాన్ని మాత్రమే…

ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలు యాదగిరిగుట్ట, భద్రచాలం, వేములవాడతో పాటు మిగతా ఆలయాలకు సంబంధించిన బంగారం, విరాళాలతో ఆలయాల అభివృద్ధిని చేపట్టాలని దేవాదాయ శాఖ భావిస్తోంది. అందులో భాగంగా ఏయే ఆలయానికి ఎంత బంగారం ఉంది, ఆ బంగారం వల్ల ఆలయాల అభివృద్ధికి ఎంతమేర మేలు జరుగుతుంది, దాంతో ఎలా అభివృద్ధి చేయవచ్చన్న దానిపై అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మెుత్తంగా రాష్ట్రంలోని అన్ని ఆలయాల వద్ద 1,048 కేజీల బంగారం ఉన్నట్లు దేవాదాయశాఖ అధికారుల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఆ తర్వాత ఈ బంగారం స్థానికంగా ఉన్న బ్యాంకుల్లోని లాకర్‌లలో భద్రపరిచారు. అయితే చాలా ఏళ్లుగా ఇలా లాకర్‌లో బంగారం మూలుగుతోంది. అయితే దాని ద్వారా ఆయా ఆలయాలను అభివృద్ధి ఎలా చేయచ్చన్న దానిపై దేవాదాయ శాఖ అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. కాగా, భక్తులు కానుకల రూపంలో సమర్పించే బంగారాన్ని మాత్రమే ప్రభుత్వ అనుమతి మేరకు కరిగించే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. త్రిసభ్య కమిటీ ఆమోదం తర్వాత ఆలయాల అవసరం మేరకే బంగారం కరిగించే చాన్స్ ఉంది. ఏ ఆలయానికి సంబంధించిన బంగారం ఆ ఆలయం పరిధిలోనే ఉంటుంది.

వేములవాడ, భద్రాచలం, యాదాద్రి ఆలయాలు ఆర్జేసి పరిధిలో….

తెలంగాణలో మెుత్తం 704 ఆలయాలు ఉండగా ఆదాయాన్ని బట్టి ఆయా ఆలయాలను రీజనల్ జాయింట్ కమిషనర్ (ఆర్జేసీ), జిల్లా కమిషనర్(డిసి), అసిస్టెంట్ కమిషనర్ (ఎసి)లకు బాధ్యతలు అప్పగించింది. ఆర్జేసీలుగా ఉన్న ఆలయాలు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ, భద్రాద్రి జిల్లాలోని భద్రాచలం, యాదాద్రి జిల్లాలో యాదగిరిగుట్ట ఆలయాలు ఉన్నాయి. డిసి కేడర్‌లో కొండగట్టు ఆంజనేయస్వామి, కొమరవెల్లి మల్లికార్జునస్వామి, బాసర సరస్వతీ ఆలయం, సికింద్రాబాద్‌లోని గణేశ్ ఆలయం ఉన్నాయి. ఎసి కేడర్‌లో మరో 13 ఆలయాలు ఉన్నాయి. మిగిలిన టెంపుల్స్ 6(ఏ), (బి), (సి), (డి) కేటగిరీ పరిధిలో ఉన్నాయి. ఈ మెుత్తం ఆలయాల్లో 1,048 కేజీల బంగారం ఉంది.

రాజన్న ఆలయం వద్ద 4,930 కిలోల వెండి

వెండి విషయానికొస్తే రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో కలిపి మొత్తంగా 38,783 కిలోల వెండి ఉన్నట్టు అధికారుల గణాంకాలు పేర్కొంటున్నాయి. అందులోనూ రాజన్న ఆలయం వద్ద 4,930 కిలోలు, యాదగిరి గుట్ట ఆలయం వద్ద 2,312 కిలోలు, భద్రాచలం ఆలయం వద్ద 980 కిలోల వెండి ఉంది. డిసి కేడర్‌లో ఉన్న 4 ఆలయాల్లో 3,331 కిలోలు ఉండగా ఎసి కేడర్లో ఉన్న 13 ఆలయాల్లో 4,415 కిలోల వెండి నిల్వలు ఉన్నాయి. 6(ఏ), (బి), (సి), (బి) కేటగిరీ పరిధిలో 22,811 కిలోల వెండి ఉంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News