Friday, November 15, 2024

వెనెజులాతో అమెరికా కాళ్ల బేరం!

- Advertisement -
- Advertisement -

అందితే జుట్టు లేకపోతే కాళ్లు అన్న సామెత తెలిసిందే. లాటిన్ అమెరికాలోని వెనెజులా గత ఏడు సంవత్సరాలుగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నది. అక్కడ వామపక్ష ప్రభుత్వం అధికారంలో ఉంది గనుక తలెత్తిన స్థితిని ఆసరా చేసుకొని ఎన్ని కట్టుకథలు, ఎన్ని దెప్పి పొడుపులో! ఇప్పుడు ఆ దేశంలో పరిస్థితి ఏమిటి ?


2022 జులై పన్నెండవ తేదీన బిబిసి ముండో (స్పానిష్ భాష) అమెరికా విదేశాంగశాఖ మంత్రిత్వ మాజీ ముఖ్య కార్యదర్శి కారీ ఫిలిపెట్టీతో ఒక ఇంటర్వ్యూను ప్రచురించింది. డోనాల్డ్ ట్రంప్ ఏలుబడిలో విదేశాంగశాఖలో వెనెజులా, క్యూబా వ్యవహారాలను ఆమె చూశారు. అమెరికా అధికారులు ప్రస్తుతం వెనెజులా అధ్యక్షుడు నికొలస్ మదురోతో సంప్రదిస్తున్నారని ప్రతిపక్షంతో ఎలాంటి సంబంధాలు లేవని చెప్పారు. ఎన్నికల్లో గెలిచిన మదురో బదులు తాము మద్దతు ఇచ్చిన ప్రతిపక్ష నేత జువాన్ గుయిడోనే విజేతగా గుర్తిస్తున్నట్లు ప్రకటించిన డోనాల్డ్ ట్రంప్, తరువాత ఇటీవలి వరకు జో బైడెన్ సర్కార్ ఆ వైఖరినే కొనసాగించింది. మదురోను పదవి నుంచి తొలగించాలని అక్కడి మితవాద శక్తులకు అమెరికా చెప్పింది. అన్ని రకాలుగా తోడ్పడుతున్నది. ప్రస్తుతం ప్రపంచంలో తలెత్తిన ఇంధన సంక్షోభం ప్రారంభం వరకు అమెరికా చదరంగంలో గుయిడోనే పావుగా ఉన్నాడు. ఒక ఎత్తుగడగా లేదా అవసరం కొద్దీ గుర్తించను అన్న అమెరికా ఇప్పుడు తన మాటలను తానే దిగమింగి అధికారికంగా మదురో సర్కార్‌తో చర్చలు జరుపుతోంది.

వెనెజులా పౌరులు గత కొన్ని సంవత్సరాలుగా అనుభవించిన, ఇప్పటికీ పడుతున్న కష్టాలు, ఇబ్బందులకు అమెరికా కారణం అన్న మౌలిక అంశాన్ని మీడియా కావాలనే విస్మరించి, కట్టుకథలు, పిట్టకతలు చెప్పింది, వాటిని గుడ్డిగా నమ్మి అనేక మంది రకరకాలుగా చెప్పారు. ఎవరెన్ని చెప్పినా అక్కడి జనాలకు వాస్తవాలు తెలుసు గనుక ఎన్ని ఇబ్బందులున్నా వామపక్ష మదురోవైపే మొగ్గు చూపుతున్నారు. మానవ హక్కులు, ప్రజాస్వామ్యం, చట్టబద్ధ పాలన పరిరక్షణ పేరుతో అనేక దేశాలపై అమెరికా విధించిన ఏకపక్ష ఆంక్షల ప్రతికూల పర్యవసానాలను నివేదించేందుకు ఐరాస ఒక కమిటీని ఏర్పాటు చేసింది. దాని నివేదన అధికారిణి ప్రొఫెసర్ అలేనా దౌహాన్ ఇటీవల చెప్పిన ప్రకారం అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షలు 98 శాతం అవి చెప్పిన సుభాషితాలు, అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనే అని పేర్కొన్నారు. జింబాబ్వే సందర్శనలో ఆమెతో కొందరు విద్యార్ధులు మాట్లాడుతూ తమ దేశంపై ఆంక్షల కారణంగా టూరిస్టులుగా కొన్ని చోట్లకు వెళ్లి చదువుకోవాల్సి వచ్చిందని, పరీక్షలకు వెళ్లి రోడ్ల మీద నిద్రించాల్సి వచ్చిందని చెప్పారు. వెనెజులాపై ఆంక్షల కారణంగా 2017 నుంచి 2018 వరకు అక్కడ శిశు మరణాల రేటు 31 శాతం పెరిగిందని, ఆరోగ్య హక్కుకు భంగం కలిగిందని అలేనా చెప్పారు. వ్యాక్సిన్ల కొనుగోలును అడ్డగించిన కారణంగా 26 లక్షల మంది వెనెజులా పిల్లలకు మెనెంజటిస్, రోటావైరస్, మలేరియా, ఇన్‌ఫ్లూయెంజా, మీజిల్స్, ఎల్లో ఫీవర్ ముప్పు తలెత్తిందన్నారు.

ఎన్ని ఆర్ధిక ఇబ్బందులున్నా వెనెజులా కరోనా మహమ్మారిని కట్టడి చేసి చావులను గణనీయంగా అరికట్టింది. ప్రతి లక్ష మందికి 20.1 శాతం మంది మరణిస్తే అదే అమెరికాలో 304.18 శాతం చావులు నమోదయ్యాయి. వెనెజులా మీద 2017 నుంచి 600 రకాల ఆర్ధిక ఆంక్షలను అమెరికా అమలు జరిపింది. ఒక దశలో వీటి కారణంగా 99 శాతం రాబడిని కోల్పోయింది. మరో వైపు మితవాద శక్తులను రాజకీయంగా ఉసిగొల్పింది. వీటన్నింటినీ మదురో సర్కార్, అధికార సోషలిస్టు పార్టీ ఎదుర్కొన్నది. 2021 డిసెంబరులో జరిగిన ప్రాంతీయ, మున్సిపల్ ఎన్నికల్లో 23 గవర్నర్ పదవులకు గాను 21, 213 మేయర్ పదవుల్లో 120 గెలుచుకుంది.

అమెరికా, ఇతర దాని మిత్రదేశాల ఆంక్షల, ఇతర కొన్ని అంశా ల కారణంగా గత పది సంవత్సరాల్లో వెనెజులా ఆర్ధికంగా 70 శాతం దిగజారింది. అనేక తీవ్ర ఇబ్బందులున్నప్పటికీ ఈ ఏడాది ప్రథమార్ధం నుంచి జిడిపి కోలుకోవటం ప్రారంభమైంది. కొత్తగా వ్యాపారాలు ప్రారంభం అవుతున్నాయని, జనం కొనుగోలు ఖర్చు పెరిగిందని తాజా వార్తలు. వెనెజులియన్ ఫైనాన్స్ అబ్సర్వరేటరీ సంస్థ చెప్పిన దాని ప్రకారం ఈ ఏడాది తొలి ఆరునెలల్లో ద్రవ్యోల్బణం 53.8 శాతం, ఇది గతేడాదితో పోలిస్తే ఆరోవంతు. కరెన్సీ బొలివర్ విలువ డాలర్‌తో గతేడాది 50 శాతం పతనమైతే ఈ ఏడాది 17 శాతం. అనేక నియంత్రణ చర్యలు, ఇతర అంశాలు దీనికి దోహదం చేశాయి. ఈ ఏడాది ఆఖరుకు రోజుకు 20 లక్షల పీపాల చమురు ఉత్పత్తి లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు పోతుండగా ప్రస్తుతం 7.75 లక్షల పీపాలు జరుగుతున్నది.

కోటి మంది కార్మికులు, ఇతరులకు లబ్ధి కలిగించే వేతనాలు, కనీస వేతనాలను ప్రభుత్వం ఇటీవల పెంచింది. లాటిన్ అమెరికా కరీబియన్ ఎకనమిక్ కమిషన్ అంచనా ప్రకారం 2014 తరువాత ఈ ఏడాది వృద్ధి రేటు ఐదు శాతం ఉంటుందని, అది అన్ని లాటిన్ అమెరికా దేశాల కంటే ఎక్కువ అని పేర్కొన్నది. 2022 జనవరి నుంచి మార్చి నెల వరకు అంతకు ముందు ఏడాదితో పోలిస్తే చమురు ఉత్పత్తి రోజుకు 5,33,000 పీపాల నుంచి 7,56,000 పీపాలకు పెరిగింది. ఏడాది పొడవునా ఆరులక్షల పీపాలు ఉంటే జిడిపి వృద్ది రేటు 8 శాతం ఉంటుందని మరొక అంచనా. ఐదు సంవత్సరాలుగా అమలు జరుపుతున్న ఆంక్షలను అమెరికా కొద్దిగా మే 17 నుంచి సడలించింది. వెనెజులా ప్రభుత్వరంగ చమురు కంపెనీతో లావాదేవీలు జరపవచ్చని అమెరికా, ఐరోపా చమురు కంపెనీలకు సూచించింది.

అమెరికా ఆంక్షలకు గురైన దేశాలలో ఇరాన్ కూడా ఒకటి. వెనెజులా, ఇరాన్ మధ్య వివిధ రంగాలలో 20 సంవత్సరాల వ్యూహాత్మక సహకార ఒప్పందంపై ఇరుదేశాల నేతలు జూన్ 11న సంతకాలు చేశారు. చమురు రంగంలో ఇరాన్, ఆహార, ఉత్పత్తి ఎగుమతిలో వెనెజులా సహకరించుకుంటాయి. ఎనిమిది లక్షల పీపా ల చమురును రవాణా చేసే ఓడలను ఇరాన్ అందిస్తుంది. రెండు దేశాలూ అమెరికా సామ్రాజ్యవాద బాధితులే, వ్యతిరేకులే. ఉక్రెయిన్, రష్యా వివాదంతో తలెత్తిన పరిస్థితి పర్యవసానాలను అంచనా గట్టటంలో ఒక విధంగా అమెరికా విఫలమైందనే చెప్పాలి. అమెరికాలో అసాధారణ రీతిలో చమురు ధరల పెరుగుదల వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో అధికార డెమోక్రాటిక్ పార్టీని దెబ్బ తీయవచ్చనే అంచనాలున్నాయి. అసాధారణ రీతిలో పెరిగిన ద్రవ్యోల్బణ దేశ జిడిపి వృద్ధి రేటును కూడా దెబ్బతీస్తుంది.

వచ్చే ఏడాది మాంద్యంలోకి జారవచ్చన్న హెచ్చరికలూ ఉన్నా యి. చమురు ధరలు తగ్గాలంటే సరఫరాను పెంచాలన్న వినతులను సౌదీ ఇతర దేశాలు అంగీకరించలేదు. రష్యా చమురు ఎంత ఎక్కువగా మార్కెట్‌కు వస్తే అంత అధికంగా దానికి రాబడి వస్తుందని తేలింది. అందువలన వెనెజులాపై గతంలో విధించిన ఆంక్షలను చూసీచూడనట్లు నటిస్తూ అక్కడ చమురు ఉత్పత్తి పెంపుదలకు అమెరికా చొరవ చూపింది. తద్వారా అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గితే అమెరికాకూ మేలే గనుక ఇది దాని అవసరం కోసం తప్ప వెనెజులా మీద మనసు మారి కాదు. తిరిగి ఎప్పుడైనా పంజా విసరవచ్చు. దొరికిన ఈ వెసులుబాటును వెనెజులా తనకు అనుకూలంగా మార్చుకుంటోంది.గతంలో చమురు ధరల పతనం కూడా దాని ఆర్ధిక ఇబ్బందులకు ఒక కారణం. ఇప్పుడు వంద డాలర్లకు పైగా ఉన్నందున రష్యా మాదిరి కొన్ని దేశాలకు రాయితీ ఇచ్చినా దానికి రాబడి పెరుగుతుంది. ఇదే తరుణంలో అమెరికాను పక్కాగా ప్రతిఘటించే ఇరాన్‌తో ఒప్పందం కూడా సానుకూల అంశమే. ప్రతిపక్ష నేత గుయిడోను వెనెజులా తాత్కాలిక అధ్యక్షుడిగా గుర్తించిన అమెరికా, దాని బాటలో నడిచిన ఇతర పశ్చిమ దేశాలు ఇప్పుడు అదే అమెరికా మదురో యంత్రాంగంతో చర్చలకు రావటం అమెరికాకు ప్రపంచంలో పరువు తక్కువ వ్యవహారమే దాన్ని నమ్ముకొని దానికి తాన తందాన అన్న దేశాలకూ పరాభవమే. ఇది మదురోకు పెద్ద నైతిక విజయం. చమురు ఎగుమతుల మీదనే ఆధారపడితే అమెరికా సామ్రాజ్యవాదం నుంచి ఎప్పుడైనా ముప్పురావచ్చు. అందుకే సమతుల విస్తరణ, దిగుమతులపై ఆధారపడకుండా చూసుకోవటం వంటి విధానాల వైపు వెనెజులా మళ్లుతున్నది.

ప్రతిపక్ష నేతను దేశాధ్యక్షుడిగా గుర్తించిన అమెరికా 2019లో వెనెజులాలోని తన రాయబార కార్యాలయాన్ని పక్కనే ఉన్న కొలంబియాకు తరలించింది.అక్కడ ఎన్నికల్లో తొలిసారిగా వామపక్షం అధికారంలోకి రానున్నదని గతేడాదే వివిధ సర్వేలు వెల్లడించాయి, అదే జరిగింది. ఇప్పుడు రెండు దేశాల మధ్య తిరిగి సంబంధాలు ఏర్పడనున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య తథ్యమని ముందుగానే అమెరికాకు తెలుసు గనుకనే అంటరాని వాడిగా పరిగణించిన మదురోతో చర్చలకుగాను మార్చి నెలలోనే బైడెన్ సర్కార్ వెనెజులాకు ఒక అధికారిక బృందాన్ని పంపింది. అక్కడ బందీలుగా ఉన్న తమ పౌరుల విడుదల సంప్రదింపులకు తప్ప మరొకటి కాదని బుకాయించింది. తరువాత ఆంక్షలను సడలిస్తామని ప్రకటించింది. చమురు ఉత్పత్తి, ఎగుమతులకు సంబంధించి ఒప్పందాలు చేసుకోవచ్చని తమ కార్పొరేట్ సంస్థ చెవరాన్‌కు అనుమతి ఇచ్చింది. ఇలా చేసి ఉండాల్సింది కాదని, దీని వలన అమెరికా ఆంక్షలు ఉన్నప్పటికీ తట్టుకొని నిలవగలమనే ధైర్యం బాధిత దేశాలకు వస్తుందని మితవాద, వామపక్ష వ్యతిరేక శక్తులు గగ్గోలుపెడుతున్నాయి. అమెరికాను వ్యతిరేకించే చైనా, రష్యా ప్రభావం పశ్చిమార్ధగోళంలో పెరుగుతుందని వాపోతున్నాయి.

ఆగస్టు 13 నుంచి 27వ తేదీ వరకు వెనెజులా రాజధాని కారకాస్‌లో ఇంటర్నేషనల్ ఆర్మీ గేవ్‌‌సు జరుగుతున్నాయి. రష్యా ప్రారంభించిన ఈ క్రీడలను తొలిసారిగా పశ్చిమార్ధగోళంలోని వెనెజులా నిర్వహిస్తున్నది. ఇప్పటి వరకు 37 దేశాల నుంచి 275 టీములు, 36 విభాగాల్లో పోటీ పడేందుకు వస్తున్నట్లు సమాచారం. జరుగుతున్నది క్రీడలే కావచ్చుగానీ వీటికి ఎంతో ప్రాధాన్యత ఉంది. లాటిన్ అమెరికాలో ఇప్పటికే తొమ్మిది దేశాల్లో అమెరికా వ్యతిరేక, వామపక్ష పార్టీల ప్రభుత్వాలు ఉన్నాయి. త్వరలో పనామా కూడా వీటి సరసన చేరవచ్చని వార్తలు వస్తున్నాయి. మొత్తంగా చూసినపుడు అమెరికా బయట తన పెరటి తోట అనుకుంటున్న లాటిన్ అమెరికాలోనూ ఒంటరి అవుతున్నది.

ఎం కోటేశ్వరరావు
8331013288

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News