Tuesday, December 17, 2024

ప్రకృతిని ప్రేమిద్దాం

- Advertisement -
- Advertisement -
Venkaiah Naidu attending cultural event Alai Balai
రాజకీయాల్లో ప్రత్యర్థులే కాని శత్రువులు ఉండరు, అందరినీ ఒకేవేదిక మీదికి తీసుకువచ్చి దసరా స్ఫూర్తిని చాటుతున్న దత్తాత్రేయ అభినందనీయులు:ఎంఎల్‌సి కవిత
హాజరైన వివిధ పార్టీల నేతలు, ప్రముఖులకు సన్మానాలు
కార్యక్రమాన్ని అభినందిస్తూ ప్రధాని మోడీ లేఖ

మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రకృతితో కలిసి జీవించడం.. ప్రకృతిని ప్రేమించడం..ప్రాచీన భారతీయ నాగరికతను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఆదివారం హర్యాన గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్యంలో హైదరాబాద్ జలవిహార్‌లో నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా దుర్గామాత, జమ్మిచెట్టుకు పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సంస్కృతి, సంప్రదాయాలు నా హృదయానికి దగ్గరగా ఉంటాయి. వేషం, భాష వేరైనా మనమంతా భారతీయులం. ప్రాచీన భారతీయ నాగరికతను కాపాడుకోవాలి. బతుకమ్మ, బోనాలు తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తాయి.కులమతాలను పక్కన పెట్టి అందరూ కలిసి ముందుకు వెళ్లాలనేదే అలయ్ బలయ్ ముఖ్య ఉద్దేశమన్నారు. దత్తాత్రేయ గత 16 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని గుర్తుచేశారు. అందరం కలిసి నడవడం.. కలిసి జీవించడం.. కలిసి ముందుకెళ్లడమే ఈ కార్యక్రమ ఉద్దేశమని గవర్నర్ దత్తాత్రేయ అన్నారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్ మాట్లాడుతూ ప్రజలందరూ కలిసి ముందుకెళ్లడం స్ఫూర్తిగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం సంతోషంగా, ప్రేరణగా ఉందన్నారు.

రాజకీయాల్లో ప్రత్యర్థులే.. శత్రువులుండరు

రాజకీయ పార్టీల నేతలను ఒకే వేదికపై నిలిపిన ఘనత బండారు దత్తాత్రేయకు దక్కుతుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఈ వేడుకలో వారూ, వీరూ అనే భేదం లేకుండా అన్ని పార్టీల వారిని పిలిచి నిజమైన దసరా స్ఫూర్తిని తెలంగాణ ప్రజలకు బండారు దత్తాత్రేయ గుర్తు చేస్తున్నారని కవిత కొనియాడారు. రాజకీయాల్లో ప్రత్యర్థులే ఉంటారే తప్ప శత్రువులు ఉండరని అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్సీ కవిత ఒకే వేదికపై కూర్చున్న దృశ్యం ప్రత్యేకతను సంతరించుకుంది. రాజకీయాలు పక్కన పెట్టి వాళ్లిద్దరు అప్యాయంగా పలకరించుకున్నారు. రాజకీయాల్లోకి నేతల వారసులు వస్తున్నారు.. అదే విధంగా దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మీరాజకీయాల్లో ఆదరించాలని కాంగ్రెస్ నేత విహెచ్ కోరారు.

ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

అలయ్ బలయ్ కార్యక్రమంలో భాగంగా గవర్నర్ తమిళిసై సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె గిరిజన మహిళలతో కలిసి నృత్యం చేశారు. వివిధ కళారూపాల ప్రదర్శనతో కార్యక్రమం ఉల్లాసంగా ఉత్సాహంగా సందడిగా సాగింది. హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ రాజేంద్రవిశ్వనాథ్‌తో పాటు అతిథులకు కళారూపాలను దత్తాత్రేయ దగ్గరుండి చూపించారు. తమిళసై కళాకారులతో కలిసి కోలాటమాడారు. డోలు వాయించారు. గుస్సాడీ నృత్యాలు, ఆదివాసీలు, గిరిజనులు, థింసా కళాకారులు, సదర్ దున్నపోతులు, పీర్లు, బోనాలతో కళాకారులు ఆకట్టుకున్నారు. అలయ్ బలయ్ నిర్వహిస్తున్నందు కు అభినందిస్తూ దత్తాత్రేయకు ప్రధాని మోదీ లేఖ రాశా రు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబిస్తోందని ఆ లేఖలో పేర్కొన్నారు. కేంద్రం అమలు చేస్తోన్న ఏక్ భారత్-శ్రేష్ట్ భారత్ లక్ష్యం కూడా ఇదేనన్నారు.

ప్రముఖులకు సన్మానం

అలయ్ బలయ్‌లో పలువురు ప్రముఖులను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సన్మానించారు. భారత్ బయోటెక్ ఛైర్మన్ కృష్ణ ఎల్ల, డాక్టర్ రెడ్డీస్ లేబోరేటరీస్ అధినేత ప్రసాద్‌రెడ్డి, జనసేన అధినేత పవన్‌కల్యాణ్, ఏఐజీ ఛైర్మన్ డాక్టర్ నాగేశ్వరరెడ్డి, బయోలాజికల్- ఎండీ మహిమ దాట్ల, ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు, ఎమ్మెల్సీ కవితను సన్మానించారు. ప్రజాగాయకుడు, ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న, వందేమాతరం శ్రీనివాస్‌లు ఆలపించిన పాటలు కార్యక్రమంలో ఉత్తేజం నింపింది. 2005లో అలాయ్ బలాయ్ కార్యక్రమాన్ని దత్తాత్రేయ ప్రారంభించారు. ప్రసుత్తం ఆయన కుమార్తె విజయలక్ష్మినిర్వహించారు. తెలంగాణకు ప్రత్యేకమైన వెజ్, నాన్ వెంజ్ వంటకాలతో పాటు మొత్తం 40 రకాల వంటకాలను అందించారు. కరోనా కారణంగా నమస్కారాలతో అలయ్ బలయ్ జరిపారు.

సందడిగా అలయ్ బలయ్ ప్రాంగణం

ఉదయం నుంచి ప్రముఖల రాకతో జలవిహార్‌లోని అల య్ బలయ్ ప్రాంగణం కిటకిటలాడింది. వివిధ పార్టీల నేతలు, ప్రముఖులకు స్వాగతం పలుకుతూ కళాకారులు చేసిన నృత్యాలతో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, శాసనమండలి ప్రొటెం చైర్మన్ భూపాల్‌రెడ్డి,రాష్ట్రమంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్, టిఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి కె.కేశవరావు, ఓబిసి మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్,నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత, గోరటి వెంకన్న, జనసేన అధినేత పవన్‌కల్యాణ్, గ్రే టర్ హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మీ, ఎమ్మెల్యేలు రాజ్‌సింగ్, రఘనందన్‌రావు, చింతల రామచంద్రారెడ్డి, భారత్ బయోటెక్ చైర్మన్ కృష్ణ ఎల్ల, భాజపా ఓబీసీ మోర్చా జాతీ య అధ్యక్షుడు లక్ష్మణ్, టిజెఎస్ అధ్యక్షుడు కోదండరా మ్, ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య, ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు, కాంగ్రెస్ నేత విహెచ్ హనుమంత్‌రావు, మల్లు రవి, బూర నర్సయ్యగౌడ్, చాడ వెంకట్‌రెడ్డి,లక్ష్మీపార్వతి, జీహెచ్‌ఎంసి కార్పొరేటర్లు, వివిధ జిల్లాలకు చెం దిన ప్రజాప్రతినిధులు, ప్రముఖులు హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News