హైదరాబాద్: దేశ ప్రజలకు ప్రధాని అందిస్తున్న సేవలు కొనసాగించాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలిపారు. రిఫార్మ్, పర్ ఫార్మ, ట్రాన్స్ ఫార్మ్ నినాదంతో ముందుకెళ్తున్నారని, అవసరం ఉన్నంత వరకు ఉచిత రేషన్ పథకం కొనసాగించాలన్నారు. మహానేత వెంకయ్యనాయుడు పుట్టిన రోజు సందర్భంగా ఆయన జీవితం, ప్రయాణం పుస్తకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా విడుదల చేశారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడారు. యువతకు నైపుణ్యం శిక్షణ కార్యక్రమాలను కొనసాగించాలని, మాతృభాషలను ప్రోత్సహించడం గొప్ప విషయం కితాబిచ్చారు. తాను ఆంగ్ల భాషకు వ్యతిరేకం కాదు అని, ప్రభుత్వ ఆదేశాలన్నీ భారతీయ భాషల్లో ఉండాలని, ఆ తరువాతే ఆంగ్ల భాషలో ఉండాలని కోరుతున్నామని, మాతృభాష, సోదర భాష తర్వాతే ఇతర భాషలకు ప్రాధాన్యం ఇవ్వాలని వెంకయ్య పేర్కొన్నారు.
ఉత్సాహం ఉన్నవాళ్లు రాజకీయాల్లోకి రావాలని, సిద్దాంతపరమైన రాజకీయాలను ప్రోత్సహించాలని, చట్ట సభలకు ఎంపికైనవారు హుందాగా ప్రవర్తించాలని, విలువలు పాటిస్తూ మాతృభాషను ప్రోత్సహిస్తూ ముందుకు సాగాలని వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. విలువలు కాపాడాల్సిన బాధ్యత రాజకీయ నాయకులపై ఉందని, ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటున్నారో తెలియడం లేదన్నారు. సిద్దాంతం నచ్చకపోతే నాయకులు పార్టీ మారవచ్చని, పార్టీ ద్వారా వచ్చిన పదవిని వదిలి వెళ్లాలని సూచించారు. కార్యకర్తలకు నేతలు ప్రవర్తనా నియమావళి రూపొందించాలని, రాజకీయాల్లో జవాబుదారీతనం తీసుకరావాడానికి ప్రయత్నించాలని, రాజకీయాల్లో కులం, ధనం ప్రభావం తగ్గిపోవాలని పిలుుపునిచ్చారు. గుణం చూసి నాయకులకు ఓటు వేయాలని, మార్పు రాకపోతే ప్రజాస్వామ్యం బలహీనపడుతుందని, దేశ ప్రతిష్ఠను నిలబెట్టాలంటే చెడుపోకడలను అడ్డుకోవాలని వెంకయ్య నాయుడు సలహాలు ఇచ్చారు.