ఉప రాష్ట్రపతి వెంకయ్య పిలుపు
దండి(గుజరాత్): భారతదేశ స్వాతంత్య్ర శత సంవత్సరం 2047 నాటికి ”నూతన భారతదేశ” నిర్మాణానికి సంబంధించిన సమగ్ర కార్యాచరణ ప్రణాళికను దేశం రూపొందించుకుంటుందని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు విశ్వాసం వ్యక్తం చేశారు. భారతదేశ 75వ స్వాతంత్య్ర వార్షికోత్సవాలను పురస్కరించుకుని గుజరాత్‌లోని సబర్మతి ఆశ్రమం నుంచి 81 మంది చేపట్టిన 25 రోజుల దండి యాత్ర ముగింపు సందర్భంగా మంగళవారం నాడిక్కడ ఉప రాష్ట్రపతి ప్రసంగించారు.
1947 నుంచి నేటి వరకు స్వాతంత్య్ర సమరయోధులు చూపిన బాటలో మనం నడిచామని, సబ్‌కా సాథ్ సబ్‌కా వికాస్ అన్నది తమ ప్రధాన ఆశయమని ఆయన చెప్పారు. స్వాతంత్య్రానంతరం దేశం అనేక రంగాలలో ఎన్నో సాధించిందని ఆయన చెప్పారు. భారతదేశ శక్తి సామర్ధాలను యావత్ ప్రపంచం నేడు గుర్తించి గౌరవిస్తోందని ఆయన అన్నారు. ఇందుకు ప్రధాని నరేంద్ర మోడీతోపాటు రాజకీయాలకు అతీతంగా అన్ని రాష్ట్రాల(ఆయా రాష్ట్రాలలోని ప్రభుత్వాలు) కృషి ఉందని ఆయన అన్నారు. రానున్న 25 ఏళ్లలో నూతన భారతదేశ నిర్మాణానికి సంబంధించిన సమగ్ర రూపురేఖలతో ఒక కార్యాచరణను రూపందించుకుని అందుకు అనుగుణంగా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.