మన తెలంగాణ/హైదరాబాద్: నగరంలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ (ఇబిఎస్‌బి)పై ఛాయాచిత్ర ప్రదర్శనను ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ఆదివారం ప్రారంభించారు. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన రీజనల్ అవుట్ రీచ్ బ్యూరో ఈ ప్రదర్శనను ఏర్పాటు చేసింది. ఇబిఎస్‌బి కింద జత చేసిన హర్యానా, తెలంగాణ రాష్ట్రాల వివిధ ఆసక్తికరమైన అంశాలను, కళా రూపాలు, వంటకాలు, పండుగలు, స్మారక చిహ్నాలు, పర్యాటక ప్రదేశాలు, క్రీడలు మొదలైన వాటిని తెలియ చేసేలా ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ ఎగ్జిబిషన్ 12(ఆదివారం) నుంచి 14వ తేదీ వరకు నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ క్యాంపస్ లో వీక్షించేందుకు తెరిచి ఉంటుంది. కళలు, సంస్కృతి ఇతివృత్తాలపై తీసుకువచ్చిన గుర్తించదగిన పుస్తకాలను ప్రచురణల విభాగం ఈ ఎగ్జిబిషన్ లో ఉంచింది.
ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి ఆలోచనలను పంచుకుంటూ, ఈ జంట రాష్ట్రాల సుసంపన్న సాంస్కృతిక వారసత్వానికి ప్రాచుర్యం కల్పించడంలో ప్రజలకు ప్రజలకు మధ్య సంబంధాలు పెంపొందించడంలో ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో దోహద పడతాయని అన్నారు. రెండు రాష్ట్రాల ప్రజలను కలిపి మన సంపన్న, విభిన్న సాంస్కృతిక వారసత్వం గురించి అవగాహన కల్పించగల ఈ చొరవ తీసుకున్నందుకు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర హోంమంత్రి మహమ్మద్ మహమూద్ అలీ, రాష్ట్ర ప్రణాళిక మండలి వైస్ చైర్మన్ బి.వినోద్ కుమార్ తదితరులు హాజరయ్యారు. అలాగే కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన ఆర్‌ఒబి, పిఐబి, డిపిడి, ఎఐఆర్ సీనియర్ అధికారులు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం జాతీయ సమైక్యతా స్ఫూర్తిని ప్రోత్సహించడానికి, దేశ ప్రజల మధ్య భావోద్వేగ బంధాల ముడిని బలోపేతం చేయడానికి ప్రభుత్వం తీసుకున్న ఒక వినూత్న చొరవ. స్వాతంత్య్రానంతరం దేశ ఏకీకరణలో గణనీయమైన పాత్ర పోషించిన సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ 140వ జయంతి సందర్భంగా 2015 అక్టోబర్ 31న ప్రధాన మంత్రి ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ (ఇబిఎస్ బి) కార్యక్రమాన్ని ప్రారంభించారు.
Venkaiah Naidu inaugurated photo exhibition on EBSB