Thursday, January 23, 2025

వెంకయ్యనాయుడుకు పద్మవిభూషణ్

- Advertisement -
- Advertisement -

దేశ రాజధాని ఢిల్లీలో రాష్ట్రపతిభవన్ ప్రాంగణంలో సోమవారం సాయంత్రం కనులపండువగా పద్మ పురస్కారాల ప్రదాన కార్యక్రమం జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ చేతుల మీదుగా వివిధ రంగాలకు , సామాజిక సేవా కార్యక్రమాల్లో పేరొందిన వారు అవార్డులు స్వీకరించారు. భారత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు, ప్రఖ్యాత సినీనటులు మిథున్ చక్రవర్తి, గాయనీ ఉషా ఉతుప్ , సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకులు బిందేశ్వర్ పాఠక్(మరణానంతరం) , ఉత్తరప్రదేశ్ మాజీ గవర్నర్ రామ్ నాయక్, పారిశ్రామికవేత్త సీతారామ్ జిందాల్ , ప్రముఖ భరతనాట్య కళాకారిణి పద్మ సుబ్రమణ్యం , తెలంగాణ లోని నారాయణపేటకు చెందిన విశిష్ట అరుదైన బుర్ర వీణ వాయిద్యకళాకారుడు దాసరికొండప్ప వంటి వారు ఈ పురస్కారాలను అందుకున్నారు.

రాజకీయ సామాజిక సాహితీ సేవలలో విశిష్టతను గడించిన తెలుగు ప్రతినిధి ఎం వెంకయ్యనాయుడుకు ఈసారి పద్మవిభూషణ్ పురస్కారం అందించారు. కాగా ఈ కోవలోనే పద్మవిభూషణ్ అవార్డును పాఠక్‌తరఫున ఆయన భార్య అమోలా అందుకున్నారు. మిథున్ చక్రవర్తి, ఉషా ఉతుప్, రామ్‌నాయక్, జిందాల్‌కు పద్మభూషణ్ పురస్కారం అందింది. కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్, ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి జై శంకర్ ఇతరులు హాజరయ్యారు. సోమవారం పద్మభూషణ్ పురస్కారం అందుకున్న వారిలో గుజరాత్‌కు చెందిన కార్డియాలజిస్టు తేజస్ మధుసూదన్ పటేల్, ప్రముఖ మరాఠా డైరెక్టర్ దత్తాత్రేయ అంబదాస్ మయాలో అలియాస్ రాజదూత్, ప్రఖ్యాత భౌతికశాస్త్రవేత్త చంద్రేశ్వర్ ప్రసాద్ ఠాకూర్ కూడా ఉన్నారు. ఇక పద్మశ్రీల వరుసలో పురస్కారాలు అందుకున్న వారిలో దాసరికొండప్ప , ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రఖ్యాత తివాచీ నేతన్న ఖలీల్ అహమద్, మధ్యప్రదేశ్ జానపద కళాకారుడు కాలూరాం బమానియా, బంగ్లాదేశీ గాయకులు రెజ్వానా చౌదరి బన్యా, చింకారీ ఎంబ్రాయిడరీ కళాకారిణి , యుపికి చెందిన ససీం బానో ఉన్నారు. మరికొందరు విశిష్టులకు కూడా పద్మశ్రీ అవార్డులను రాష్ట్రపతి అందించారు.

నృత్యభంగిమలతో సాగిన ద్రోణా
కాగా పద్మశ్రీని రాష్ట్రపతి చేతుల మీదుగా తీసుకునేందుకు వెళ్లుతున్నప్పుడు అసోం జానపద నాట్యకారుడు డ్రోణా భూయాన్ తన నైపుణ్యపు ఒజాపలి, దియోధని నృత్యభంగిమలను ప్రదర్శిస్తూ రాష్ట్రపతి వద్దకు వెళ్లారు. సభికుల కరతాళ ధ్వనుల నడుమ పురస్కారం స్వీకరించారు. తనకు ఈ కళారూపమే ఈ పురస్కారానికి అర్హత కల్పించినందున ఈ కళకు తాను ఈ విధంగా కృతజ్ఞతలు తెలిపినట్లు ఈ కళాకారుడు తెలిపారు. తన స్థానానికి వెళ్లుతూ ఆయన ప్రధాని మోడీ వద్దకు వెళ్లి పాదాలను తాకారు. ఇందుకు ప్రధాని నుంచి ప్రతి నమస్కారం దక్కింది. పద్మశ్రీ అందుకున్న త్రిపుర మత గురువు చిట్టా రంజన్ దేబ్బార్మ కాషాయదుస్తులలో తరలివచ్చారు. ఆయనతో ప్రధాని మోడీ కొద్ది సేపు మాట్లాడారు.

అసాంకు చెందిన గిరిజన రైతు సర్బేశ్వర్ బసుమతతరీ పద్మశ్రీని స్వీకరించారు. ఈ దశలో ఆయన రాష్ట్రపతి ముందు మోకరిల్లారు. ప్రతిభా సేవా పాటవాలకు గుర్తింపుగా ఇచ్చే 2024 పద్మ పురస్కారాలను రిపబ్లిక్ డే నేపథ్యంలో రాష్ట్రపతి ప్రకటించారు. మొత్తం 132 పద్మ పురస్కారాలలో ఐదుగురికి పద్మవిభూషణ్, 17 మందికి పద్మ భూషణ్, 110 మందికి పద్మశ్రీలు వెలువడ్డాయి. సోమవారమే అత్యధికులకు పద్మపురస్కారాలను బహుకరించారు. కాగా మిగిలిన వారికి మరో కార్యక్రమంలో వచ్చే వారం ఈ పురస్కారం అందుతుంది. ప్రముఖ నటుడు చిరంజీవి, వైజయంతిమాలా బాలీ విశిష్ట పద్మవిభూషణ్ పురస్కారాలను తరువాతి దశలో తీసుకోనున్నారని వెల్లడైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News