న్యూఢిల్లీ: గురువారం (నేడు) రాజ్యసభకు చెందిన 72 మంది సభ్యుల పదవీకాలం ముగియడంతో వారు రిటైర్ కానున్నారు. ఈ సందర్భంగా గురువారం ఏర్పాటు అయ్యే వీడ్కోలు కార్యక్రమం ప్రత్యేకతలను సంతరించుకుంది. సభలో సాధారణంగా సాగే సాంప్రదాయపు ప్రసంగాలు, సభ్యుల సేవలు, అనుభవాల తంతు కాకుండా ఈసారి కొత్తదనం ఉంటుంది. రాజ్యసభ అధ్యక్షులు, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ రిటైర్ అయ్యే సభ్యుల గౌరవార్థం తమ అధికారిక నివాసంలో ఆత్మీయ విందు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా వారికి పలు రకాల రుచులతో కూడిన భోజనం ఉంటుంది. అంతేకాకుండా రిటైర్ అయ్యే సభ్యులకు చిరస్మరణీయంగా నిలిచేలా సాంస్కృతిక కార్యక్రమం ఒకటి ఏర్పాటు చేస్తున్నారు. సభలో జరిగే కార్యక్రమంలో ప్రధాని మోడీ ప్రసంగిస్తారు. ఇక విందు దశలో ఆరడజను మంది వరకూ రిటైరయ్యే ఎంపిలు తమ కళా ప్రతిభను చాటుకుంటారు. సంతానూ సేన్ గిటార్ వాయిస్తారు. డోలా సేన్ రవీంద్ర సంగీతం ఆలపిస్తారు. తిరుచి శివ తమిళ పాట పాడుతారు. నటి రూపా గంగూలీ, వందనా చవాన్‌లు హిందీ సినిమా పాటలతో ఆలరిస్తారు. రామచంద్ర జాంగ్రా దేశ భక్తి గీతాలు విన్పిస్తారు. తరువాత చివరిలో బృందగానం కూడా ఉంటుంది.
Venkaiah Naidu to host farewell dinner for 72 Retiring MPs