వెంకయ్యనాయుడు ఆకాంక్ష
న్యూఢిల్లీ : సభ్యుల గత రికార్డును బట్టే రాజ్యసభ ప్యానెల్స్‌కు సభ్యులుగా తీసుకోవడం మంచిదని ఉప రాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ ఎం వెంకయ్యనాయుడు సూచించారు. ఎగువసభకు వివిధ అంశాలపై ప్యానెల్స్ ఉన్నాయి. అయితే వీటిలోని సభ్యులు వీటి పట్ల ఆసక్తి చూపుతున్నారా? లేదా ఆరా తీయాల్సి ఉంది. ఏడాది కాలంలో వీరు ఎన్ని సార్లు వీటి భేటీలకు హాజరయ్యారు? సంబంధిత అంశాలపై మాట్లాడారా? అనేది నిర్థారించుకోవల్సి ఉంటుంది. తరువాతనే వారిని సభ్యులుగా తీసుకుంటే ప్రయోజనం ఉంటుందని వెంకయ్యనాయుడు ఆకాంక్షిస్తున్నారు. సంబంధిత అంశంపై ఆయన ఎప్పటికప్పుడు అధికారులతో సంప్రదిస్తున్నారని ఈ క్రమంలో సభ్యుల నియామకక్రమంపై ఆయన ఆలోచనలు స్పష్టంగా ఉన్నాయని వెల్లడైంది. విభాగాలవారిగా మొత్తం 24 పార్లమెంటరీ స్థాయీ సంఘాల (డిఆర్‌ఎస్‌సి)పునర్వస్థీకరణ జరగాల్సి ఉంది.
సంబంధిత ప్యానెల్స్ పనితీరుపై అవగావహన, వీటిపట్ల ఆసక్తి ఉన్న వారిని తీసుకుంటేనే ప్యానెల్స్‌కు సరైన సమగ్రత ఏర్పడుతుందని రాజ్యసభ ఛైర్మన్ అభిప్రాయపడ్డారు. వెంటనే రాజ్యసభ సచివాలయ అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. 32 రాజకీయ పార్టీలకు చెందిన 243 మంది సభ్యులు 361 సార్లు జరిగిన ఈ కమిటీల సమావేశాలకు ఎన్నిసార్లు హాజరయ్యారనేది లెక్కతీశారు. గత ఏడాది సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకూ సభ్యులు హాజరీ, వివిధ అంశాలపై వారి ఆసక్తి వంటివి తెలుసుకున్నారు. ప్రతి ఏడాది సెప్టెంబర్‌లో 8 రాజ్యసభ, 16 లోక్‌సభ ప్యానెల్స్ సరికొత్తగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. లోక్‌సభకు సంబంధించి స్పీకర్, రాజ్యసభకు సభ ఛైర్మన్ వీటిపై తుది నిర్ణయం తీసుకుంటారు.