కెకె వేణుగోపాల్‌కు ఘనంగా వీడ్కోలు
న్యూఢిల్లీ: భారత నూతన అటార్నీ జనరల్‌గా సీనియర్ న్యాయవాది వెంకటరమణి శనివారం బాధ్యతలు స్వీకరించారు. 72 సంవత్సరాల వెంకటరమణిని సెప్టెంబర్ 30వ తేదీన పదవీ విరమణ చేయనున్న కెకె వేణుగోపాల్ స్థానంలో బుధవారం కేంద్ర ప్రభుత్వం నియమించింది. వెంకటరమణి పదవీకాలం మూడేళ్ల పాటు ఉంటుంది. కాగా..పదవీ విరమణ చేసిన కెకె వేణుగోపాల్‌కు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు శుక్రవారం ఘనంగా వీడ్కోలు పలికారు. పదవీ విరమణ చేస్తున్న అటార్నీ జనరల్‌కు భావోద్వేగపూరిత వీడ్కోలు..నూతన అటార్నీ జనరల్‌కు సాదర స్వాగతం అంటూ రిజిజు శుక్రవారం రాత్రి ట్వీట్ చేశారు. దేశానికి అత్యంత విలువైన సేవలందచేసిన దిగ్గజ న్యాయవాదికి రిజిజు ధన్యవాదాలు తెలియచేశారు. కొత్తగా బాధ్యతలు చేపట్టనున్న వెంకటరమణికి ఆయన శుభాకాంక్షలు అందచేశారు. 91 సంవత్సరాల వేణుగోపాల్ తన వయోభారం కారణంగా అటార్నీ జనరల్ పదవిలో కొనసాగడానికి నిరాకరించడంతో వెంకటరమణి ఆయన స్థానంలో నియమితులయ్యారు.