మనతెలంగాణ / సైదాపూర్ : రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతిలో భాగంగా గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అందిస్తున్న సహకారాన్ని కేంద్రం గుర్తించింది. కేంద్ర గ్రామీణ మంత్రిత్వ శాఖ 2021 సంవత్సరానికిగాను ప్రకటించిన సంసద్ ఆదర్శ గ్రామ యోజన పథకం కింద కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని వెన్నంపల్లి గ్రామం దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. గ్రామాల అభివృద్ధి, పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామాలు, రైతు వేదికలు, పారిశుధ్య నిర్వహణకు ట్రాక్టర్ల కొనుగోలు, డంపింగ్ యార్డుల ఏర్పాటుతోపాటు వివిధ అభివృద్ధి పనుల అమలులో భాగంగా కేంద్రం ఈ ర్యాంకులను ప్రకటించింది. సామాజిక, అర్థిక, సంస్కృతిక స్వాలంబనను అమలుచేయటంలో వెన్నంపల్లి ఆదర్శంగా నిలిచి, దేశవ్యాప్తంగా కీర్తి ప్రతిష్ఠలను దక్కించుకుంది.
ఈ నేపథ్యంలో వెన్నెంపల్లి గ్రామ సర్పంచ్ అబ్బిడి పద్మ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందెలా కృషిచేస్తునే వాటిపై ప్రజలకు అవగాహన కల్పించామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న నిధులను గ్రామాభివృద్ధికి ఉపయోగిస్తూ గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామన్నారు. అహ్లాదకరంగా ఉన్న పల్లె పకృతి వనం, గ్రామంలో ఎక్కడ చూసిన పచ్చదనం, పరిశుభ్రత చుట్టుపక్కల గ్రామస్థులను కూడా అకట్టుకుంటోందని ఆమె అన్నారు. గ్రామాభివృద్ధికి గ్రామస్తులు వెన్నంటి ఉండి అభివృద్ధికి బాటలు వేశారని అన్నారు. అధికారులు, ప్రజలిచ్చిన ప్రోత్సాహంతో దేశంలో తమ గ్రామం ప్రాథమ స్థానంలో నిలిచినందుకు సంతోషంగా ఉందని సర్పంచ్ పద్మ తెలిపారు. కాగా, గ్రామాభివృద్ధికి ఇంతలా నిధులిచ్చిన ముఖ్యమంత్రి కెసిఆర్‌కు, గ్రామాన్ని దత్తత తీసుకున్న ఎంపి కెప్టెన్ లక్ష్మికాంతారావుకు, ఎమ్మెల్యే సతీష్‌కుమార్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.