Monday, December 23, 2024

వెన్నెల-వేడుక

- Advertisement -
- Advertisement -

తెలతెలవారు జాము
శారదాకాశంలో
కాంతులీనుతున్న జాబిల్లిలా
నిద్ర మంచం నుండే వీడు
నవ్వులీనుతూ మేల్కొంటాడు

పచ్చని చెట్టు మీద
ఆకుపచ్చని చిలకను
చప్పున పోల్చుకోలేనట్టు
అమ్మ అమ్మమ్మల చలికాలపు
నులివెచ్చని రగ్గుల మధ్య
దోబూచులాడుతున్న వీడ్ని
వెతికి పట్టుకోవడం ఒక క్రీడ
చెట్టునే పక్వానికొచ్చి
తెల్లబారి మిగలపండిన
జామపండుకు
ఆ రంగెలా వచ్చిందో
వీడి ముఖ వర్చస్సునడిగి
తెలుసుకోవాలి
చిరాకు పరాకుల లోకంలో
నిత్యమూ నవ్వుతూ వుండే
సంజీవినీ విద్య ఎక్కడి నుండి నేర్చుకున్నాడో
సింహాచలం సంపెంగ పూరేకుల్లాంటి
వాడి పెదవులను అడిగి తెలుసుకోవాలి

ఎత్తుకుందామని దగ్గరకెళ్తే
బయటకు వెళ్లి పోతున్నామని
భ్రమించి కాళ్లకు చెప్పులున్నాయేమోనని
తొంగి చూసే వీడి కాల జ్ఞానానికి
వీరబ్రహ్మం గారు సైతం
అచ్చెరు వొందాల్సిందే

ఇలా చేతుల్లోకి తీసుకున్నానో లేదో
అలా చేయి తిరిగిన రంగస్థలనటునిలా
ఒక చేయి పైకిత్తి ఊరకనే
గాల్లో అటు ఇటూ తిప్పుతాడు
బహుశా వాడి ముత్తాత తీసిన
పౌరాణిక పద్యరాగమేదో
సన్నగా వీనుల సోకిందేమో
వాకిలి గడప దగ్గరకు
పాక్కుంటూ వెళ్లి
కుండీలో ఉన్న
తమలపాకు మొక్క
చిగుర్లను చేత్తో అందుకున్నాడు
అవెక్కడ నలిగిపోతాయోమోనని
నేను కంగారుగా వెళితే
నీ చేతులు కందిపోతాయి నాన్నా
అంటూ చిగుర్లు వాడ్ని వారించడం
నేను చెవులారా విన్నాను

ఇంకా తెల్లవారనే లేదు
పెరట్లో నంది వర్ధనం చెట్టు
పూల కనులు తెరవడానికి
ఒకటే బద్దకిస్తోంది, ఈలోగా
పడగ్గదిలో వీడు పారిజాతాల వంటి కనులు విచ్చి గదంతా చక్రభ్రమణం చేస్తున్నాడు.
అది చూసి అలిగిన నంది వర్ధనం
ఆ వేల్టికి పూయడం విరమించుకుంది

నిన్నటి వరకు
పెట్టిన దగ్గరే అలుక్కుపోయే
చలివిడి ముద్దలా పడున్నవాడు
పాకడం వచ్చాక
తల్లి ఆవు చుట్టూ
చెంగనాలు పోయే
లేగదూడలా
వాళ్లమ్మ చుట్టూ
గింగిరాలు కొడుతున్నాడు

శిఖామణి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News