Friday, November 15, 2024

గాలి ద్వారా కరోనా వ్యాప్తి.. వెంటిలేషనే సరైన కట్టడి

- Advertisement -
- Advertisement -

Ventilation is only way to control Coronavirus in air

 

ఆస్ట్రేలియా క్వీన్‌లాండ్ వర్శిటీ ఆధ్వర్యంలో అధ్యయనం

న్యూయార్క్ : గాలి ద్వారా కూడా కరోనా వైరస్ వ్యాపిస్తుందని గత ఏడాది కాలంగా శాస్త్రవేత్తలు చేస్తున్న వాదనలను ఇప్పుడు వైద్యాధికారులు అంగీకరిస్తున్నారు. గాలి ద్వారా కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్యసంస్థ, యుఎన్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వెల్లడించాయి. గాల్లో వైరస్‌ను నియంత్రించడానికి వెంటిలేషన్ ఒక్కటే మార్గమని శాస్త్రవేత్తలు స్ఫష్టం చేస్తున్నారు. 1800 సంవత్సరంలో దుర్గంధమైన పైపుల వల్ల కలరా వ్యాపిస్తుందని గుర్తించి, ప్రజానీటి సరఫరాను సరి చేశారు. అదే విధంగా ఇప్పుడు వెంటిలేషన్ వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని శాస్త్రవేత్తలు కోరుతున్నారు.

ఇంటిలోపల గాలి స్వచ్ఛంగా ఉంటే కరోనా మాత్రమే కాకుండా ఫ్లూ వంటి శ్వాస సంబంధ అంటువ్యాధులను బాగా తగ్గించ వచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆస్ట్రేలియా లోని క్వీన్స్‌లాండ్ యూనివర్శిటీ ప్రొఫెసర్ లిదియా మోరావ్‌స్కా సారధ్యంలో 14 దేశాలకు చెందిన 39 మంది శాస్త్రవేత్తలు కరోనాపై చాలా కాలం అధ్యయనం చేసి తమ పరిశోధనలను వెల్లడించారు. ఇండోర్ వెంటిలేషన్ వ్యవస్థను మెరుగుపర్చడం వల్ల అంటువ్యాధుల వ్యాప్తిని నివారించ వచ్చని వారు సూచించారు. ఈమేరకు ప్రపంచ ఆరోగ్యసంస్థ నూతన మార్గదర్శకాలు, భవనాలకు వెంటిలేషన్ ప్రమాణాలను రూపొందించాలని వారు కోరుతున్నారు. దగ్గడం, తుమ్మడం, శ్వాస తీసుకోవడం , మాట్లాడడం, పాటలు పాడడం వంటివి చేసేటప్పుడు కరోనా సోకిన వ్యక్తి ముక్కు, గొంతు నుంచి వైరస్ కణాలు బయటకు విడుదల అవుతాయి.

అందులోని పెద్ద కణాలు వేగంగా కిందకు పడి భూ ఉపరితలంపై చేరుకుంటాయి. కానీ కంటికి కనిపించని చిన్నచిన్న ఎరోసోల్స్ కణాలు మాత్రం గాల్లో ఉండిపోతాయి. ఇవి తేమ, ఉష్ణోగ్రత, గాలి వేగాన్ని బట్టి ప్రయాణిస్తుంటాయి. ఇవి గాలిలో ఎక్కువ గంటలు ఉండిపోవడంతో పాటు గదుల్లో తొందరగా వ్యాపిస్తుంటాయి. ఇవే ప్రమాదకరంగా మారుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే భవనాల్లో వెంటిలేషన్ పెంచడం ద్వారా ఈ ప్రమాదాన్ని నివారించ వచ్చని సూచిస్తున్నారు. కరోనా వ్యాప్తిని అరికట్టడంపై ప్రపంచ ఆరోగ్యసంస్థ ఇప్పటివరకు రెండు సార్లు మార్గదర్శకాలు సవరించింది. వ్యక్తుల మధ్య మూడడుగుల దూరం పాటిస్తే కరోనా వ్యాప్తిని కట్టడి చేయవచ్చని తెలిపింది.

అయితే ఎరోసోల్స్ కణాలు ఉన్నప్పుడు భౌతిక దూరం కూడా పనిచేయట్లేదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. వెంటిలేషన్ తక్కువగా ఉన్న గదులు, ఎప్పుడూ మూసి ఉండే గదుల్లో ఏరోసోల్స్ ఎక్కువ కాలం గాల్లో ఉంటున్నాయని అందువల్ల ఇండోర్‌లో పనిచేసే వారిలో ఎక్కువ మంది వైరస్ బాధితులవుతున్నారని తెలిపారు. అందుకే భవనాల్లోకి గాలి, వెలుతురు బాగా వచ్చేలా చూసుకోవాలని సూచించారు. ఈ దిశగా ప్రపంచ ఆరోగ్యసంస్థ మార్గదర్శకాలు రూపొందించక పోతే భవిష్యతులో మరేదైనా మహమ్మారి ఎదురైతే పరిస్థితి ఇంతకంటే భయంకరంగా ఉంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News