పనాజీ : మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కెప్టెన్ సతీశ్ శర్మ (73) కన్నుమూశాడు. ఆయన గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారని, ఆరోగ్య పరిస్థితి విషమించడంతో సతీశ్ తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. అక్టోబర్ 11, 1947న తెలంగాణలోని సికింద్రాబాద్‌లో జన్మించారు. ప్రొఫెషనల్ కమర్షియల్ పైలట్ గా పని చేశాడు. సతీశ్ శర్మ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి సన్నిహితుడుగా ఉన్నాడు. రాయ్ బరేలి, అమేథి లోక్‌సభ స్థానాల నుంచి మూడుసార్లు ఎంపీగా గెలిచి ప్రజలకు సేవచేశారు. పివి నర్సింహారావు ప్రభుత్వంలో కేంద్ర పెట్రోలియం, సహజవాయువు మంత్రిగా ప్రజలకు సేవలందించారు. అలాగే మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి మరో మూడు పర్యాయాలు రాజ్యసభ సభ్యుడిగానూ కొనసాగారు. ఆయనకు భార్య, కుమారుడు, కూతుళ్లు ఉన్నారు. శర్మ మృతిపై కాంగ్రెస్ లీడర్లు, కాంగ్రెస్ నేత రణదీప్ సుర్జేవాలా సంతాపం ప్రకటించారు.