విజయ్ సేతుపతి, వెట్రీమారన్ కలయికలో రూపొందిన ’విడుదల -1’ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్‌గా విజయ్‌సేతుపతి, వెట్రీమారన్ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ’విడుదల -2’. ఈనెల 20న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రముఖ నిర్మాత, శ్రీ వేధాక్షర మూవీస్ అధినేత చింతపల్లి రామారావు ఈ చిత్ర తెలుగు హక్కులను దక్కించుకున్నారు. హైదరాబాద్‌లో ఏర్పాటైన విలేకరుల సమావేశంలో నిర్మాత చింతపల్లి రామారావు మాట్లాడుతూ “పరిపాలకుల అహంకారానికి అణచివేయబడిన సామాన్యుల నుంచి ఉధ్భవించిన ఒక అసామాన్యుడి వీర విప్లవ గాథే ’విడుదల-2’.
ఈ చిత్రం తమిళ చిత్రం కాదు. తెలుగు రాష్ట్రాల్లోని సమస్యలు, ఇక్కడ జరిగిన సంఘటనలు ఆధారంగా తీసిన చిత్రమిది. ఈ చిత్రంలో పెరుమాళ్ పాత్రకు సేతుపతి నూటికి నూరు శాతం సరిపోయాడు. నక్సెలైట్ పాత్రలో విజయ్ సేతుపతి నటన, పాత్రలోని ఎమోషన్ ఆయన పండించిన విధానం అద్భుతం. ఇక ఈ చిత్రానికి మ్యాస్ట్రో ఇళయరాజా ప్రళయం లాంటి సంగీతాన్ని అందించారు. ఈనెల 20న తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానున్న ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధిస్తుంది”అని అన్నారు. ఈ సమావేశంలో దర్శకుడు కొండా విజయ్‌కుమార్, నిర్మాతలు సుబ్బారెడ్డి, తుమ్మల పల్లి రామసత్యనారాయణ, డీఎస్‌రావులు పాల్గొన్నారు.