సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రధాన కోచ్‌గా న్యూజిలాండ్ క్రికెట్ దిగ్గజం డానియల్ వెటోరిని ఎంపిక చేశారు. ఇప్పటి వరకు హెడ్ కోచ్‌గా వ్యవహరించిన వెస్టిండీస్ లెజెండ్ బ్రియాన్ లారాకు సన్‌రైజర్స్ యాజమాన్యం ఉద్వాసన పలికింది. ఈ ఏడాది జరిగిన ఐపిఎల్‌లో సన్‌రైజర్స్ అత్యంత పేలవమైన ఆటతో అట్టడుగు స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. ప్రధాన కోచ్‌గా లారా తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించలేక పోయాడు. అతని పర్యవేక్షణలో సన్‌రైజర్స్ ఘోర పరాజయాలను చవిచూసింది. దీంతో లారాపై వేటు పడుతుందని అప్పుడే ఊహగానాలు వచ్చాయి. తాజాగా అవే నిజమయ్యాయి. లారాకు ఉద్వాసన పలికి న్యూజిలాండ్ మాజీ స్టార్ వెటోరిని ప్రధాన కోచ్‌గా నియమించింది.
రానున్న ఐపిఎల్ సీజన్‌లో సన్‌రైజర్స్ ప్రధాన కోచ్‌గా వెటోరి బాధ్యతలు నిర్వర్తిస్తాడు. ఈ విషయాన్ని సన్‌రైజర్స్ యాజమాన్యం సోమవారం ట్విటర్ వేదికగా అధికారికంగా ప్రకటించింది. ఇక వెటోరికి ఐపిఎల్‌లో అపార అనుభవం ఉంది. అతను 2014 నుంచి 2018 వరకు ఆర్‌సిబి ప్రధాన కోచ్‌గా వ్యవహరించాడు. ఆటగాడిగా కూడా వివిధ జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. కాగా, ప్రపంచంలోని అత్యుత్తమ స్పిన్నర్లలో వెటోరి ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు. తన స్పిన్ బౌలింగ్‌తో కివీస్‌కు ఎన్నో చారిత్రక విజయాలు సాధించి పెట్టాడు.