Monday, December 23, 2024

డిప్యూటీ సిఎం భట్టిపై విహెచ్ గరం గరం

- Advertisement -
- Advertisement -

నాకు ఖమ్మం సీటు రాకుండా అడ్డుకుంటున్నారు

పార్టీలో భట్టి ఎదుగుదలకు నేనే కారణం
కాంగ్రెస్‌లో బిసిలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన

మనతెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్కపై సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్‌లో బిసిలకు అన్యాయం జరుగుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విహెచ్ ఆదివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ తనకు ఖమ్మం లోక్‌సభ సీటు రాకుండా డిప్యూటీ సిఎం భట్టి అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఆయన ఎందుకు అడ్డుకుంటున్నారో తెలియదని ఆయన ఆవేదనవ్యక్తం చేశారు. మొదట సీటు ఇస్తానని తెలిపారని, ప్రస్తుతం తనను పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఈరోజు భట్టి పార్టీలో ఆ స్థానంలో ఉన్నాడంటే దానికి తానే కారణమని, భట్టిని ఎమ్మెల్సీని చేసింది తానేనని విహెచ్ పేర్కొన్నారు. నా కుటుంబం నుంచి ఎవరూ రాజకీయాల్లో లేరని, సోనియా, రాహుల్‌గాంధీలు నాకు న్యాయంచేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
నేను లోకల్ కాదంటా..?
నేను లోకల్ కాదంటున్నారు, రేణుకాచౌదరి, నాదెండ్ల భాస్కర్, రంగయ్యనాయుడు లోకలా అంటూ ఆయన ప్రశ్నించారు. పదవులు ఆశించకుండా పనిచేసిన తనకు న్యాయం చేయాలని ఆయన విన్నవించారు. ఖమ్మం లోక్‌సభ సీటును తనకు కేటాయిస్తే కచ్చితంగా గెలుస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో బిసిలకు అన్యాయం జరుగుతుందని, బిసిల ఓట్లు కాంగ్రెస్‌కు అవసరం లేదా, బిసిలు కేవలం ఓట్లు వేసే మిషన్లు మాత్రమే అని ఆయన ప్రశ్నించారు. రాహుల్‌గాంధీ న్యాయ్‌యాత్ర, కులగణన అంటున్నారు, రాహుల్ అయినా తనకు న్యాయం చేయాలని విహెచ్ సూచించారు. ఖమ్మం నుంచి రాహుల్ పోటీ చేస్తే తాను తప్పుకుంటానని, లేకపోతే ఖమ్మం నుంచి పోటీకి తానే అర్హుడినని ఆయన తెలిపారు. తాను చనిపోయే వరకు పార్టీలో ఉంటానన్నారు. చనిపోయిన తరువాత పార్టీ జెండా తనపై ఉంటుందన్నారు. నేను పార్టీ మారే వ్యక్తిని కాదన్నారు. తాను పార్టీలో ఎందరికో సాయం చేశానన్నారు.
నాకు వయసు ఇంకా మించిపోలేదు
నాకు వయసు ఇంకా మించిపోలేదు. ఇప్పటికి నేను చాలా చురుగ్గా పని చేస్తున్నానని, పార్టీలో నా మాదిరిగా పనిచేసే నేత ఎవరూ లేరని ఆయన తెలిపారు. ప్రజలకు సేవ చేయాలన్నదే నా తపన అని ఆయన పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల కోసం ఇటీవల కాంగ్రెస్ పార్టీ నలుగురు అభ్యర్థులను ప్రకటించిన మరికొంతమంది పేర్లను ఢిల్లీ అధిష్టానానికి పంపారు. ఆయా నియోజకవర్గాల కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై విహెచ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పా ర్టీకి తానుచేసిన త్యాగాలకు గుర్తుగా ఖమ్మం నుంచి తనను బరిలో దింపి గెలిపించాలని ఆయన అధిష్టానాన్ని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News