Wednesday, January 22, 2025

‘బేషరమ్ రంగ్’ పాటపై రగిలిపోతున్న విహెచ్‌పి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: నటుడు షారూఖ్ ఖాన్ నుంచి చాలా కాలంగా ఎదురుచూస్తున్న ‘పఠాన్’ సినిమా విడుదలకు ముందే వివాదంలో చిక్కుకుంటోంది. దీపిక పదుకోణ్ తో తీసిన ‘బేషరమ్ రంగ్’ పాటను విడుదల చేశాక మరింతగా అగ్గిమీద గుగ్గిలం అవుతోంది. ఆ పాట విడుదలైనప్పటి నుంచి మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా సహా హిందు సంస్థలు, బిజెపి నాయకులు ఆక్షేపణలు తెలుపుతున్నారు. ‘బేషరమ్ రంగ్ కహా దేఖా దునియా వాలోనే’ అనే ఆ పాటలో నటి దీపిక కాషాయ రంగు దుస్తులు ధరించి నటించింది.

ఇప్పుడు విశ్వహిందూ పరిషద్(విహెచ్‌పి) జాతీయ ప్రతినిధి వినోద్ బన్సల్ కూడా ఆ వీడియోను షేర్ చేస్తూ దుమ్మెతిపోశారు. ముఖ్యంగా దీపిక డ్రెస్‌ను విమర్శించారు. వినోద్ బన్సల్ ఆ చిత్ర నిర్మాతను, నటీనటులపై విరుచుకుపడ్డారు. “కాషాయ రంగును ‘సిగ్గుమాలిన రంగు’ అంటూ ‘పఠాన్’ సినిమాలో పాట పెట్టారు. అది వారి మనోస్థితిని ప్రస్ఫుటం చేస్తోంది….ఇది సిగ్గుమాలిన పని. హిందూ సమాజం దీనిని సహించదు” అన్నారు. హిందూ వ్యతిరేకతకు కూడా ఓ హద్దంటూ ఉంది. దీనిని మేము ఎంత మాత్రం సహించం. బాలీవుడ్‌ను అపఖ్యాతిపాలు చేస్తున్న ఈ టుక్డే టుక్డే గ్యాంగ్‌ను ఏ మాత్రము సహించబోము అని ఆయన ఆ వీడియోకు శీర్షిక కూడా పెట్టారు. ఇదిలావుండగా ‘బేషరమ్’ పాటకు నిరసనగా వీర్ శివాజీ గ్రూప్ కార్యకర్తలు వీధుల్లోకి వచ్చి నిరసన ప్రదర్శించారు. అంతేకాక షారూఖ్ ఖాన్ దిష్టి బొమ్మను కూడా దగ్ధం చేశారు. సినిమాలోని ఆ పాట తమ సమాజం మనోభావాలను దెబ్బతీసేదిగా ఉందన్నారు.

షారూఖ్ ఖాన్ నటిస్తున్న ‘పఠాన్’సినిమా దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్. దానిని యశ్ రాజ్ ఫిలిమ్స్ రూపొందిస్తోంది. అందులో షారూఖ్ ఖాన్, దీపిక పదుకోణ్, జాన్ అబ్రాహం నటించారు. ఆ సినిమాను హిందీ, తమిళ్, తెలుగులో నిర్మించారు. జనవరి 25న థియేటర్లలో విడుదల కాబోతున్నది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News