ఆదివారం (19న) ఒక హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీమ్ రైసీ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖర్ బుధవారం ఇరాన్ చేరుకున్నారు. ‘గౌరవనీయ ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖర్‌కు బుధవారం టెహ్రాన్‌లో ఇరాన్ అధికారులు స్వాగతం పలికారు’ అని ఉప రాష్ట్రపతి అధికారిక అకౌంట్ ’ఎక్స్’లో తెలిపింది. ‘ఇరాన్ అధ్యక్షుడు సయ్యద్ ఇబ్రహీమ్ రైసీ, విదేశాంగ శాఖ మంత్రి హెచ్ అమీర్ అబ్దొల్లాహియాన్ మృతికి సంతాపం తెలిపేందుకు విపి ధన్‌ఖర్ అధికార కార్యక్రమానికి హాజరవుతారు’ అని ఆ పోస్ట్ తెలిపింది. ‘ఇరాన్ అధ్యక్షుడు సయ్యద్ ఇబ్రహీమ్ రైసీ,
విదేశాంగ శాఖ మంత్రి హెచ్ అమీర్ అబ్దొల్లాహియాన్ దుర్మరణంపై సంతాపం నిమిత్తం అధికార కార్యక్రమానికి హాజరయ్యేందుకు విపి జగ్దీప్ ధన్‌ఖర్ టెహ్రాన్ పర్యటనకు వెళుతున్నారు’ అని బుధవారం ఉదయం విదేశాంగ మంత్రిత్వశాఖ (ఇఎఎం) అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ ‘ఎక్స్’ పోస్ట్‌లో తెలియజేశారు. రైసీ భౌతికకాయాన్ని శుక్రవారం (23న) ఆయన జన్మస్థలం మష్షాద్‌లో ఖననం చేయనున్నారు. ఇది ఇలా ఉండగా, న్యూఢిల్లీలో ఇరాన్ దివంగత అధ్యక్షునికి, దివంగత విదేశాంగ శాఖ మంత్రికి, ఇతర అధికారులకు ప్రజలు నివాళి అర్పించేందుకు వీలుగా ఇరాన్ రాయబార కార్యాలయంలో ఒక సంతాప సందేశం పుస్తకాన్ని తెరిచారు.