Monday, December 23, 2024

జగ్దీప్ ధన్‌ఖడ్

- Advertisement -
- Advertisement -

సంపాదకీయం:  భారత ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగ్దీప్ ధన్‌ఖడ్‌ను పాలక ఎన్‌డిఎ ప్రకటించడం విశేషం. జగ్దీప్ ధన్‌ఖడ్ రాజస్థాన్‌కు చెందిన ఝాట్ నాయకుడు. హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయవాదిగా పని చేసిన అనంతరం రాజకీయాల్లో ప్రవేశించిన ఆయన 1989లో లోక్‌సభకు ఎన్నికయి చంద్రశేఖర్ ప్రభుత్వంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా పని చేశారు. 2019లో పశ్చిమ బెంగాల్ గవర్నర్ అయ్యారు. తన అభ్యర్థి ఉపరాష్ట్రపతిగా యెన్నిక కావడానికి అవసరమైనంత సంఖ్యా బలం స్వయంగా బిజెపికే ఉంది. రాజ్యాంగం 66వ అధికరణ ప్రకారం ఉపరాష్ట్రపతి పదవి యెన్నికలో వోటర్లుగా పార్లమెంటు ఉభయ సభల సభ్యులు పాల్గొంటారు. రాష్ట్రపతి ఎన్నికలో మాత్రం దేశంలోని చట్టసభల సభ్యులందరూ ఓటు వేస్తారు. ఈసారి ఉపరాష్ట్రపతి ఎన్నికలో 233 మంది రాజ్యసభ సభ్యులు, 12 మంది నామినెట్ అయిన రాజ్యసభ సభ్యులు, 543 మంది లోక్‌సభ సభ్యులు -మొత్తం 788 మంది వోటు వేస్తారు.

ప్రస్తుతం బిజెపికే స్వయంగా ఉభయ సభల్లో కలిసి 394 మంది సభ్యుల బలం ఉంది గనుక యితర పార్టీల మద్దతు అవసరం లేకుండానే ధన్‌ఖడ్ ఉపరాష్ట్రపతి కాగలుగుతారు. రాజ్యాంగం 65 అధికరణ ప్రకారం యే కారణం వల్లనైనా రాష్ట్రపతి పదవి అర్ధంతరంగా ఖాళీ అయితే కొత్త రాష్ట్రపతిని యెన్నుకొనే వరకు ఆ పదవి బాధ్యతలను ఉపరాష్ట్రపతి నిర్వహిస్తారు. అలాగే రాష్ట్రపతి అనారోగ్య తదితర కారణాల వల్ల బాధ్యతలు నిర్వహించలేని స్థితి యేర్పడితే ఆ పదవిని ఉపరాష్ట్రపతి నిర్వహిస్తారు. అలాగే రాజ్యసభ చైర్ పర్సన్‌గానూ బాధ్యతలు నిర్వహిస్తారు. ఇంత ప్రాధాన్యం కలిగిన పదవికి తగిన వ్యక్తిని యెంపిక చేయడం దేశానికి మేలు చేస్తుంది. రాజ్యాంగం తనపై ఉంచిన బాధ్యతలను దానికి కట్టుబడి విజ్ఞతతో నిర్వర్తించే పరిణతి, పెద్దరికం గల వ్యక్తిని అందుకు యెంచుకోవడం ఆవశ్యకం.

ధన్‌ఖడ్ 2019 నుంచి పశ్చిమ బెంగాల్ గవర్నరుగా వ్యవహరించిన తీరును గమనించినప్పుడు ఆయనలోని పరిణతి ప్రాభవాలకంటే అమిత విధేయతకే ప్రాధాన్యమిచ్చి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసినట్టు భావించడానికి అవకాశం కలుగుతుంది. ప్రజాస్వామ్యంలో గవర్నర్ల పాత్ర కేంద్రానికి కళ్లు చెవులుగా ఉండడమనే సంగతి తెలిసిందే. అంటే కేంద్ర, రాష్ట్రాల మధ్య వారధిగా వ్యవహరించడమే. కేంద్ర, రాష్ట్రాలు వేరైనా రెండూ పాలించాల్సింది వొకే ప్రజలను కాబట్టి రాష్ట్రాల్లోని ప్రజల బాగోగులను గమనించి కేంద్రానికి తెలియజేసే పాత్రను గవర్నర్లు నిర్వహిస్తారు. అరుదుగా కొన్ని ప్రత్యేక పరిస్థితులు నిజంగానే యెదురైనప్పుడు ఆ ప్రాంతంలో రాజ్యాంగ విహిత పాలనకు భంగం కలగకుండా చూడడానికి రాష్ట్రపతి పాలన విధించాలని సిఫారసు చేయడం వంటి బాధ్యతలనూ గవర్నర్లు కలిగి వుంటారు. కాని అది అత్యంత ప్రజాహిత దృష్టితో నిర్వర్తించవలసిన బాధ్యత. అందుకు పూర్తి విరుద్ధంగా గవర్నర్లు కేంద్ర పాలకుల రాజకీయ యేజెంట్లుగా పని చేయడం మామూలై పోయింది. రాష్ట్రాల్లో వుండేవీ ప్రజలెన్నుకొనే ప్రభుత్వాలే కాబట్టి వాటి ఉనికిని గుర్తించి గౌరవించవలసిన ఫెడరల్ బాధ్యత సైతం గవర్నర్‌పై వుంటుంది. గవర్నర్లు కేంద్ర పాలకులకు రాజకీయ విధేయులుగా, యేజెంట్లుగా పని చేయడం దేశాన్ని కాంగ్రెస్ పాలించినప్పుడే ప్రారంభమై తీవ్ర రూపం ధరించింది.

కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రధాని మోడీ హయాంలో యిది యింకా యెక్కువైందనే అభిప్రాయం నెలకొన్నది. ఇందులో ధన్‌ఖడ్ మిగతా గవర్నర్లకు మించిపోయారనిపించుకొన్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి గవర్నర్ ధన్‌ఖడ్‌కి మధ్య సంబంధాలు వుప్పు, నిప్పును తలపించాయి. ఇద్దరి మధ్య మాటల ఈటెల ప్రయోగమూ మితిమించింది. గవర్నరు లాట్ సాబ్ (వైస్రాయ్) మాదిరిగా కూచొని రాష్ట్రంలో చెడు జరిగినప్పుడల్లా ప్రకటనలిస్తున్నాడని వొక సందర్భంలో మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు.

విశ్వవిద్యాలయాలకు ముఖ్యమంత్రిని ఛాన్సలర్ గా చేస్తూ మమత ప్రభుత్వం శాసనసభలో బిల్లు ఆమోదించి తన సంతకం కోసం పంపించిన తర్వాత కూడా ధన్‌ఖడ్ వొక వర్సిటీకి విసిని నియమించారు. ప్రజాస్వామిక విలువల మీద, ఫెడరల్ వ్యవస్థ పైన తనకు బొత్తిగా గౌరవం లేదని ఆయన చాటుకొన్నట్టు తృణమూల్ కాంగ్రెస్ విమర్శించింది. ఇలా అనేక సార్లు గవర్నర్‌కు ముఖ్యమంత్రికి మధ్య మాటల యుద్ధం నడిచింది. ఒక సమయంలో జాదవ్ పూర్ విశ్వవిద్యాలయం కాన్వొకేషన్‌కు హాజరు కావడానికి వెళ్లిన ధన్‌ఖడ్‌ను తృణమూల్ అనుబంధ ఉద్యోగుల సంఘం అడ్డుకొన్నది. గవర్నర్ లేకుండానే ఆ సన్నివేశం జరిగిపోయింది. ప్రజలెన్నుకున్న ముఖ్యమంత్రులకు స్పీడ్ బ్రేకర్‌గా, గుదిబండలుగా పని చేయడం గవర్నర్ల విధి ఎంత మాత్రం కాదు. అది రాజ్‌భవన్లను దుర్వినియోగం చేయడమే. ఫెడరల్ వ్యవస్థ తమపై వుంచిన బాధ్యతలను గాలికి వదిలివేయడమే. ఇందులో అందరి కంటే నాలుగాకులు ఎక్కువగా చదువుకొన్ని ధన్‌ఖడ్ దేశానికి ఉపరాష్ట్రపతి కాబోవడం విశేషమే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News