న్యూఢిల్లీ : సాంప్రదాయక , పురాతన జలపరిరక్షణ నిర్మాణాలను బలోపేతం చేయాల్సి ఉందని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్ శనివారం పిలుపు నిచ్చారు. 4వ జాతీయ జల పురస్కారాల బహుకరణ సభలో ఆయన మాట్లాడారు. కుంటలు, చెరువులు, వాననీటి గుంతల వంటి జలవనరుల ఏర్పాట్లు దేశంలో తరాల నుంచి వ్యవసాయ పనులకు వాడకంలో ఉన్నాయి. ఇటువంటి ఏర్పాట్లు మరింతగా పటిష్టం కావల్సి ఉంటుంది. దీనితో వాననీటి సంరక్షణ తద్వారా భూగర్భ జలాల పరిరక్షణ , ఆయా ప్రాంతాలలో స్థానికంగా పచ్చదనం నిలబడుతోంది. ప్రాచీన జలపరిరక్షణ ఏర్పాట్లను బలోపేతం చేసుకోవడం పౌరుల చేతుల్లోనే ఉందని ఉపరాష్ట్రపతి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ట్రిపుల్ ఆర్ నినాదం వెలువరించారు. రెడ్యూస్, రీయుజ్, రీసైకిల్ పద్ధతిలో జలవనరుల పరిరక్షణ జరగాల్సి ఉందని తెలిపారు.
జనం తమ దైనందిన జీవితంలో నీటి ఆదాను అంతర్గత భాగం చేసుకోవాలన్నారు. జలవనరుల పరిరక్షణ నిర్వహణలో అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచి అవార్డులు పొందిన విజేతలకు ఉపరాష్ట్రపతి ఈ నేపథ్యంలో అభినందనలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని భద్రాది కొత్తగూడెం జిల్లా జగన్నాథపురం గ్రామ పంచాయతీ జలవనరుల పరిరక్షణలో బాగా పనిచేసిన గ్రామాలలో ఉత్తమపంచాయతీగా నిలిచింది. ఇక మధ్యప్రదేశ్‌కు ఈ దిశలో ఉత్తమ రాష్ట్రం అవార్డు, ఒడిషాలోని గంజామ్ జిల్లాకు ఉత్తమ జిల్లా పురస్కారం అందించారు. పురస్కార ప్రదాన కార్యక్రమంలో 11 కేటగిరీలకు చెందిన 41 మంది విజేతలను సత్కరించారు. ఇక పట్టణాలకు సంబంధించి చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్‌కు, జల పరిరక్షణకు సంబంధించి ఉత్తమ మీడియా అవార్డు అడ్వాన్స్ వాటర్ డైజెస్ట్ ప్రైవేటు లిమిటెడ్ గురుగావ్‌కు, ఇదే విషయంలో పలు ఇతర సంస్థలకు కూడా పురస్కారాలు లభించాయి. ఇందులో విద్యాసంస్థలు, ప్రైవేటు సంస్థలు ,ఎన్‌జిఒలు ఉన్నాయి.
ఈ కార్యక్రమంలోనే ఉపరాష్ట్రపతి నేషనల్ వాటర్ మిషన్ సంబంధిత యానిమేటెడ్ పాత్రతో కూడిన పికూ’ను విడుదల చేశారు. జల వనరుల పరిరక్షణ ఆదా గురించి తెలిపే ఈ చిత్రం దూరదర్శన్‌లో ప్రసారితం అవుతుంది. భారతీయ జనజీవిత సరళిలోనే జల పరిరక్షణ ఓ విడదీయరాని బంధంగా ఉందని ఉపరాష్ట్రపతి విజేతల అభినందన సభలో తెలిపారు. భారతీయ నాగరితల మూలాలు జలవనరులతోనే ముడివడి ఉన్నాయని చెప్పారు. ప్రకృతి ప్రసాదించే జలవనరులను సద్వినియోగం చేసుకోవల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపైనా ఉందన్నారు. దేశ రాజధానిలోని విజ్ఞాన్‌భవన్ వేదికగా సాగిన జాతీయ జల పురస్కారాల ప్రదాన కార్యక్రమం జలవనరుల శాఖ, నదుల వృద్ధి, గంగాపునరుజ్జీవ సంస్థ, జలశక్తి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు అయింది.