Thursday, January 23, 2025

ఉపరాష్ట్రపతి అపవ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

మంచి గతమున కొంచెమేనోయ్ అని గురజాడ అన్నట్టు మానవ విజ్ఞానం, సత్యశోధన బలం పుంజుకొని నిన్నటి కంటే నేడు, నేటి కంటే రేపు మెరుగ్గా వుండడానికి దోహదపడతాయి. కాని అరుదైన సందర్భాల్లో ఇది తిరగబడుతుందనే అభిప్రాయానికి కొన్ని పరిణామాలు దారి తీస్తాయి. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధంఖడ్ దీనిని ఎప్పటికప్పుడు నిరూపిస్తూ వుంటారు. ప్రధాని మోడీ నాయకత్వంలోని ఎన్‌డిఎ పాలనలో రెండవ ఉపరాష్ట్రపతిగా పగ్గాలు చేపట్టిన ధంఖడ్ ఆ పదవికి వుండవలసిన హుందాతనాన్ని వీలు చిక్కినప్పుడల్లా బలి తీసుకొంటూనే వున్నారు. తాను ఉపరాష్ట్రపతిని మాత్రమే కాదు జాతీయ స్థాయి పెద్దల సభకు చైర్మన్ కూడానని నిష్పాక్షికతకు మారుపేరుగా నిరూపించుకోవలసిన స్థానంలో వున్నాననే విషయాన్ని కూడా ఆయన ఉద్దేశపూర్వకంగా మరచిపోతుంటారు.

కొలీజియం వ్యవహారంలో ధంఖడ్ పాలక పక్షానికి మైక్‌లా వ్యవహరించి అందరూ ముక్కున వేలేసుకొనేలా చేశారు. రాజ్యాంగ ధర్మాసనం తీర్పును తప్పుపట్టి మోడీ ప్రభుత్వానికి సంతృప్తి కలిగించడంలో సాటిలేని వారనిపించుకొన్నారు. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ విదేశాల్లో మాట్లాడిన తీరును విమర్శించి బిజెపి కేంద్ర నాయకత్వం సేవలో తరించారు. పశ్చిమ బెంగాల్‌లో అక్కడి తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి మమతా బెనర్జీని సాధ్యమైనంతగా ఇబ్బందులు పాలు చేయడానికి రాజ్‌భవన్‌ను దుర్వినియోగపరచి సాటిలేని రాజకీయ గవర్నర్‌గా నిరూపించుకొన్న ధంఖడ్ అందుకు గుర్తింపుగానే ఉప రాష్ట్రపతి పదవిని పొందారని అప్పట్లో అనుకొన్నారు. వెనుకటి గుణమేల మాను అన్నట్టు ఉపరాష్ట్రపతిగా కూడా అదే ధోరణిని రక్తికట్టిస్తున్నారు. రాహుల్ గాంధీ ఇటీవల లండన్‌లో కేంబ్రిడ్జ్ విద్యార్థులతో మాట్లాడుతూ ఇండియాలో తన మీద, ఇతర ప్రతిపక్ష నేతల మీద పెగాసస్ నిఘా నడుస్తోందని, ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లిందని అన్నారు. ప్రజాస్వామ్యానికి అవసరమైన వ్యవస్థలు పార్లమెంటు, స్వతంత్ర మీడియా, న్యాయ వ్యవస్థ వంటివి ముప్పును ఎదుర్కొంటున్నాయని, ప్రజాస్వామిక మౌలిక నిర్మాణంపై దాడి జరుగుతున్నదని రాహుల్ ‘21వ శతాబ్దంలో భిన్నాభిప్రాయాన్ని గౌరవించడం’ అనే అంశంపై ప్రసంగిస్తూ అభిప్రాయపడ్డారు.

మైనారిటీల మీద, మీడియా మీద దాడులు జరుగుతున్నాయన్నారు. దీనికి బిజెపి నేతలు విదేశీ భూభాగంపై భారతీయ ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేశారంటూ రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ రాహుల్ గాంధీని నేరుగా విమర్శించారు. రాహుల్ గాంధీ పార్లమెంటరీ నియమాలన్నింటినీ మంటగలిపారని అన్నారు. లండన్‌లో రాహుల్ మాట్లాడిన తీరు అత్యంత సిగ్గు పడవలసినదని దాడి చేశారు. ఇది చాలదన్నట్టు జగ్దీప్ ధంఖడ్ గురువారం నాడు ఢిల్లీలో ఒక పుస్తకావిష్కరణ సభలో మాట్లాడుతూ రాహుల్ గాంధీని పేరు పెట్టకుండా ఆయనపై ఒంటి కాలు మీద లేచారు. ప్రపంచమంతా భారత ప్రజాస్వామ్యాన్ని పొగుడుతుండగా, ఎంపిలు సహా కొంత మంది మన ప్రజాస్వామిక విలువలను విదేశీ గడ్డ మీద హేళన చేయడం విచిత్రమని ధంఖడ్ అన్నారు.

ఒక పార్లమెంటు సభ్యుడు దేశం బయట దురుద్దేశపూర్వకంగా మన ప్రజాస్వామ్యంపై చేస్తున్న దాడిని ఖండించకపోతే తాను తన రాజ్యాంగ బాధ్యతను నిర్వర్తించనట్టే అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.రాహుల్ గాంధీ విదేశీ గడ్డ మీద ఇక్కడి రాజకీయాల గురించి మాట్లాడడాన్ని తప్పుపట్టడం తప్పుకాదు. భావ ప్రకటన స్వేచ్ఛ అందరికీ వుంది. కాని ఉపరాష్ట్రపతి స్థానంలో వుండి ఇంతగా రాజకీయ పాత్ర పోషించవలసిన అవసరం వుందా? ఆ పదవికి వుండవలసిన హుందాతనాన్ని దేని కోసం కోల్పోవాలి? ధంఖడ్‌ను ఆ పదవిలో కూచోబెట్టి ఇటువంటి పాత్రను పోషించాలని ఎవరైనా వెనుక నుంచి చెబుతున్నారా? రాహుల్ గాంధీని విమర్శించినందుకు ధంఖడ్‌ను కాంగ్రెస్ అగ్ర నాయకుడు జైరామ్ రమేశ్ ‘ఛీర్ లీడర్’ అనడాన్ని తప్పుపట్టలేము.

రాజ్యసభ చైర్మన్‌గా ఆయన అంపైర్ పాత్ర పోషించడానికి బదులు పాలక పక్షాన్ని ఆనందంలో ముంచెత్తే ‘చీర్ లీడర్’ గా వ్యవహరిస్తున్నారని జైరామ్ రమేశ్ అన్నారు. అలా అయితే ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ గడ్డ మీది నుంచి ఇక్కడి ప్రతిపక్షాన్ని ఇష్టావిలాసంగా ఎత్తి పొడిచిన సందర్భాలను ఏమనాలి? గత మే నెలలో డెన్మార్క్‌లో భారతీయులను ఉద్దేశించి మోడీ మాట్లాడుతూ ఇక్కడి ప్రతిపక్షాలను తీవ్రంగా విమర్శించారు. 2015 ఏప్రిల్‌లో కెనడాలో మాట్లాడుతూ భారత దేశ గత పాలకులు చిందరవందర, గందరగోళం సృష్టించగా తాము దానిని శుభ్రపరిచే బాధ్యతను స్వీకరించామన్నారు. ‘వారిది శ్కామ్ ఇండియా అయితే తమది స్కిల్ ఇండియా’ అని ఆత్మస్తుతి పరనిందకు పాల్పడ్డారు. ఒకే పనిని తాము చేస్తే సరైనది, అవతలి వారు చేస్తే అపరాధం అన్నట్టు ఇంతటి సువిశాల ప్రజాస్వామ్య దేశ పాలకులు వ్యవహరించడం హాస్యాస్పదం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News