తెలంగాణలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ పర్యటించనున్నారు. మార్చి 2న రాష్ట్రానికి రానున్న నేపథ్యంలోనే అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉన్నతాధికారులను ఆదేశించారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో శుక్రవారం ఉన్నత స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉపరాష్ట్రపతి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-హైదరాబాద్ (ఐఐటీ హైదరాబాద్)ను సందర్శిస్తారని, అక్కడ అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులతో సంభాషిస్తారని సీఎస్ తెలిపారు.
ఈ కార్యక్రమానికి హాజరై అదే రోజు న్యూఢిల్లీకి బయలుదేరి వెళ్తారని వెల్లడించారు. ఇందుకు అన్ని విభాగాల మధ్య సమన్వయంతో పనిచేయాలని, కమ్యూనికేషన్ అంతరాయం లేకుండా చూసుకోవాలని ఆదేశించారు. దీని కోసం భద్రతా ఏర్పాట్లు, శాంతిభద్రతలు, ట్రాఫిక్, బందోబస్తు ఏర్పాట్లు చేయాలని తెలంగాణ పోలీసు శాఖకు సూచించారు. ఉపరాష్ట్రపతి సందర్శించే అన్ని ప్రదేశాల్లో అర్హత కలిగిన వైద్యుల సేవలను అందుబాటులో ఉంచాలని, నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండేలా చూసుకోవాలని రాష్ట్ర వైద్య, విద్యుత్ శాఖ అధికారులకు సీఎస్ శాంతికుమారి సూచించారు.