Saturday, November 23, 2024

బయోటెక్నాలజీ హబ్‌గా హైదరాబాద్

- Advertisement -
- Advertisement -

Vice President M Venkaiah Naidu Visits Bharat Biotech

ప్రజలంతా స్వచ్ఛందంగా టీకా తీసుకోవాలి
ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు
జీనోమ్ వ్యాలీలోని భారతళ్ బయోటెక్‌ను సందర్శించిన ఉపరాష్ట్రపతి
చిన్నారులకు కరోనా టీకా, ముక్కు ద్వారా ఇచ్చే టీకాలపై
ప్రయోగాలను మరింత వేగవంతం చేయాలని సూచన

హైదరాబాద్ : బయోటెక్నాలజీ హబ్‌గా హైదరాబాద్ మారుతోందని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. భారత్ బయోటెక్ శాస్త్రవేత్తలు చాలా తక్కువ సమయంలోనే ప్రభావవంతమైన టీకాను సిద్ధం చేయడాన్ని ఉపరాష్ట్రపతి ప్రశంసించారు. ఈ మహత్కార్యంలో భాగస్వాములైన ప్రతిఒక్కరినీ ఆయన అభినందించారు. శుక్రవారం నగరంలోని జినోమ్ వ్యాలీలో ఉన్న ‘భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్’ను ఉపరాష్ట్రపతి సందర్శించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, పలు భారతీయ సంస్థలు కూడా కరోనాకు టీకాను తీసుకురావడంలో విశేష కృషి చేశాయని అన్నారు. మరికొన్ని సంస్థల ప్రయోగాల ఫలితాలు కూడా త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. ప్రపంచ ఫార్మా కేంద్రంగా భారతదేశానికి అంతర్జాతీయ గుర్తింపు దక్కుతున్న విషయాన్ని ఉపరాష్ట్రపతి ప్రస్తావిస్తూ, ప్రపంచవ్యాప్తంగా 50 శాతం టీకాలు మన దేశం నుంచే పంపిణీ అవుతున్నాయని పేర్కొన్నారు.

దీంతోపాటు భారీ మొత్తంలో జెనరిక్ డ్రగ్స్ కూడా మన దేశంలోనే ఉత్పత్తి అవుతున్నాయని అన్నారు. ఎయిడ్స్ వ్యాధికి అవసరమైన యాంటీ-రిట్రోవైరల్ డ్రగ్స్ కూడా 80 శాతం భారతదేశం నుంచే యావత్ ప్రపంచానికి పంపిణీ అవుతుండటం, రానున్న రోజుల్లో ఫార్మారంగంలో భారతదేశం సాధించబోతున్న ప్రగతికి నిదర్శనమని పేర్కొన్నారు. 2021 నాటికి మన దేశీయ ఫార్మా వ్యాపారం 42 బిలియన్ డాలర్లు (దాదాపుగా రూ. 3.12 లక్షల కోట్లు)గా భావిస్తుండగా.. 2030 నాటికి ఈ వ్యాపారం 120-130 బిలియన్ డాలర్లకు (దాదాపుగా రూ. 9.6 లక్షల కోట్లకు) చేరుకోవచ్చనే అంచనాలున్నాయని చెప్పారు. ఈ వ్యాపారంలో టీకాలు, బల్క్ డ్రగ్స్ ఉత్పత్తి కేంద్రంగా హైదరాబాద్ మారడం శుభపరిణామని పేర్కొన్నారు. , జినోమ్ వ్యాలీ బయోటెక్నాలజీ హబ్‌గా తన ప్రత్యేకతను చాటడం అభినందనీయమని అన్నారు.

కరోనా మహమ్మారిపై పోరాటాన్ని ప్రజాఉద్యమంగా మలిచేందుకు ప్రజలంతా స్వచ్ఛందంగా టీకా తీసుకోవాలని పిలుపునిచ్చారు. టీకాలు తీసుకోవడం ద్వారా వ్యాధి నిరోధకతను పెంచుకోవడం అత్యంత అవసరమ అన్నారు. టీకాలపై ఎలాంటి అపోహలు అక్కర్లేదని, మనతో పాటు పక్కవారిని కూడా కరోనా వైరస్ నుంచి కాపాడేందుకు టీకాను మించిన ఆయుధం లేదని చెప్పారు. అందుకే దేశవ్యాప్తంగా ఈ టీకాల కార్యక్రమం ప్రజా ఉద్యమంగా మారాల్సిన అవసరముందని అన్నారు. ఇందుకోసం నగరాలు, పట్టణాల నుంచి మారుమూల గ్రామాల వరకు ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరముందని పేర్కొన్నారు. టీకా తీసుకోవడం కారణంగా ఒకవేళ కరోనా వైరస్ సోకినప్పటికీ.. ఆసుపత్రిలో చేరాల్సినంత తీవ్ర ప్రభావం ఉండదని చెప్పారు. చిన్నారులకు కరోనా టీకాపై జరుగుతున్న పరిశోధనల గురించి ఉపరాష్ట్రపతి అడిగి తెలుసుకున్నారు. దీంతో పాటుగా ముక్కు ద్వారా అందించే టీకాలపై ప్రయోగాలను మరింత వేగవంతం చేయాలని సూచించారు.

రాజకీయ పార్టీలు కరోనా నిబంధనలు పాటించాలి

రాజకీయ పార్టీలు, కార్యకర్తలు కచ్చితంగా కరోనా నిబంధనలను పాటించాలని ఉపరాష్ట్రపతి సూచించారు. మహమ్మారి విషయంలో మనలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అన్నారు. కరోనా మూడో దశ రాకుండా అరికట్టేందుకు మన వంతు పాత్రను పోషించాలని తెలిపారు. తరచుగా తన రూపాన్ని మార్చుకుంటూ సరికొత్త సవాళ్లను విసురుతున్న కరోనా వైరస్ బారినుంచి మానవాళిని కాపాడుకునేందుకు అవసరమైన పరిష్కార మార్గాలను కనుగొనే విషయంలో మనం వ్యక్తిగతంగా, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పరస్పర సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇందుకోసం టీకా పంపిణీ కార్యక్రమం వేగవంతం కావడం ద్వారా ప్రజలకు వీలైనంత త్వరగా టీకాలు ఇప్పించాల్సిన అవసరం ఉందన్నారు.

దేశంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ ఏడాది చివరినాటికి ఉచితంగా టీకాలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సంకల్పం, చేపట్టిన టీకాకరణ కార్యక్రమం రానున్న రోజుల్లో మరింత వేగవంతం కానుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఎటువంటి పరిస్థితులకైనా సిద్ధంగా ఉండేలా మన వైద్యరంగ మౌలిక వసతులను అభివృద్ధి చేసుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కృషి అభినందనీయమైనదని పేర్కొన్నారు. ఈ ప్రయత్నంలో ప్రైవేటు రంగం కూడా కీలక భూమిక పోషించాలని ఉపరాష్ట్రపతి సూచించారు.మన దేశంతోపాటు ఇతర దేశాల్లో టీకాకరణ కార్యక్రమాలకోసం భారత్ బయోటెక్ చేస్తున్న కృషిని ఉపరాష్ట్రపతి ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, భారత్ బయోటెక్ సిఎండి డాక్టర్ కృష్ణ ఎల్లా, జెఎండి సుచిత్ర ఎల్లా, ఇడి డాక్టర్ కృష్ణ మోహన్, శాస్త్రవేత్తలు, వివిధ విభాగాల అధిపతులు పాల్గొన్నారు.

Vice President Venkaiah Naidu Visits Bharat Biotech

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News