ఎంపీలకు వెంకయ్య నాయుడు లేఖ
న్యూఢిల్లీ: మాతృభాషను ప్రోత్సహించాలని పార్లమెంట్ సభ్యులకు ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. భారతీయ భాషల ప్రోత్సాహానికి తమ వంత కృషిని అందచేయాలని వారికి ఆయన విజ్ఙప్తి చేశారు. ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని పార్లమెంట్ సభ్యులకు ఉప రాష్ట్రపతి మూడు పేజీల లేఖ రాశారు. పుట్టిన ప్రతి బిడ్డ అమ్మ భాషలో నేర్చుకునే తొలి మాటలు జీవిలో ఆత్మలా పెనవేసుకునిపోయి ఉంటాయిన ఆయన తన లేఖలో పేర్కొన్నారు. ప్రతి చిన్నారికి మాతృభాష ఈ లోకంలోకి తొంగిచూసే మొదటి గవాక్షం లాంటిదని ఆయన వర్ణించారు. ఇంట్లో మాట్లాడే భాషలోనే అద్భుతమైన సాహితీ ప్రావీణ్యం లభిస్తుందనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయని, చదువుల్లో కూడా ప్రతిభను మెరుగుపరుస్తూ రెండవ భాష నేర్చుకోవడానికి ఇది దోహదపడుతుందని ఆయన అన్నారు. భాషాపరమైన అవరోధాలను తొలగించి చిన్నారులలో సృజనాత్మక శక్తిని పెంపొందింపచేయాలని వెంకయ్య సూచించారు. ఈ మెయిల్ ద్వారా లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలకు వెంకయ్య నాయుడు వేర్వేరు భారతీయ భాషలలో ఈ లేఖను పంపించారు.